logo

కొడంగల్‌లో మెజార్టీపై కాంగ్రెస్‌ కసరత్తు

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.

Published : 10 Apr 2024 01:23 IST

50 వేల ఆధిక్యం వచ్చేలా వ్యూహాలు

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. తాను ప్రాతినిథ]్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఈ లోక్‌సభ స్థానంలో ఉండటంతో సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. భాజపా నుంచి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కాంగ్రెస్‌ నుంచి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి, భారాస నుంచి ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. త్రిముఖ పోరులో ఎలాగైనా ఈ స్థానాన్ని గెలిచి తీరాలని కాంగ్రెస్‌ భావిస్తుంది. లోక్‌సభ పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో భాజపా గట్టి పోటీ ఇవ్వనుండటంతో ఆ ప్రభావం గెలుపోటములపై పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కేవలం కొడంగల్‌ నియోజకవర్గం నుంచే సుమారు 50వేల మెజార్టీ తీసుకొస్తే విజయం తేలికవుతుందని సీఎం భావిస్తున్నారు. అందుకే కొడంగల్‌లో సోమవారం నిర్వహించిన  సమావేశంలో పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

అభివృద్ధి మంత్రం జపిస్తూ..

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్‌రెడ్డి కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. కోస్గిలో మొత్తం రూ.4,369.143 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు జనవరిలో సీఎం శంకుస్థాపన చేశారు. ప్రధానంగా రూ.2,945 కోట్లతో నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(కడా)ని ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి మంత్రాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళిక రూపొందించి ముఖ్యనేతలు, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. కొడంగల్‌లో ఏ మాత్రం మెజార్టీ తగ్గినా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై ప్రభావం పడుతుందని, ఆ పరిస్థితి రావొద్దన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అత్యధిక మెజార్టీ సాధించవచ్చని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.  

భాజపా వైపే ప్రధాన దృష్టి..

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో భాజపాపైనే కాంగ్రెస్‌ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ప్రాతినిథ]్యం వహిస్తున్న నియోజకవర్గం నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో ఉంది. నారాయణపేట జిల్లాలో నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాలున్నాయి. ఈ రెండుచోట్లా భాజపా బలంగా ఉంది. మహబూబ్‌నగర్‌లోనూ ఆ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో భారాస కంటే భాజపాపైనే రేవంత్‌రెడ్డి ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని