logo

రుణ ప్రోత్సాహం.. తరుణి ప్రగతి పథం

మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు అధికారులు విరివిగా రుణాలు అందజేస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యానికి మించి రుణాల పంపిణీతో స్వయం సహాయక సంఘాల ఆర్థికంగా ప్రగతికి బాటలో పయనిస్తున్నాయి.

Published : 10 Apr 2024 01:27 IST

గత ఆర్థిక సంవత్సరం లక్ష్యానికి మించి పంపిణీ
రాష్ట్రంలో జిల్లాకు పదో స్థానం
న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ

హిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు అధికారులు విరివిగా రుణాలు అందజేస్తున్నారు. నిర్దేశించిన లక్ష్యానికి మించి రుణాల పంపిణీతో స్వయం సహాయక సంఘాల ఆర్థికంగా ప్రగతికి బాటలో పయనిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా రూ.522.78కోట్లు అందించి ప్రోత్సహించారు. ఏకంగా 104.87 శాతం లక్ష్యాన్ని అధిగమించారు. రాష్ట్రంలో జిల్లాను పదో స్థానంలో నిలిపారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

వ్యాపారం, కుటీర పరిశ్రమలు, ఉన్నత చదువులు: ఆసక్తి ఉన్న రంగంలో రాణించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్‌) అధికారులు 10 నుంచి 12 మంది మహిళలతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. వాటిలో చేరిన వారికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు పంపిణీ చేస్తున్నారు. ఈ నగదును పెట్టుబడిగా పెట్టి వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయం, పశుపోషణ, ఉన్నత చదువులకు సద్వినియోగం చేస్తున్నారు. ఆదాయం వచ్చే యూనిట్ల ఏర్పాటుతో నెలనెలా సులభ వాయిదాల్లో రుణాల్ని తీర్చుతున్నారు.

ఎలాంటి పూచీకత్తు లేదు, తక్కువ వడ్డీ: ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీకి ఇస్తున్న రుణాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాల మహిళలకు కలిసొస్తోంది. ఒక్కో సంఘానికి రూ.15 లక్షల రుణ మంజూరు పరిమితిని అధిగమించి గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక్కో సంఘానికి రూ.20లక్షలు అందించారు. ఒక్కో మహిళకు సగటున రూ.2 లక్షలు లభించింది. వీటిని వ్యాపారాల విస్తరణకు, నూతన యూనిట్ల ఏర్పాటుకు ఖర్చు చేయడంతో మరింత ఆదాయం పొందేందుకు తోడ్పడింది.  

16 మండలాల్లో శత శాతంకంటే ఎక్కువ

జిజిల్లాలో గత ఆర్థిక సంవత్సరం రుణాల మంజూరులో 16 మండలాల్లో వంద శాతం మించి లక్ష్యాన్ని సాధించాయి. 135 శాతం రుణాల మంజూరుతో బంట్వారం మండలం ప్రథమ స్థానం, 71.46 శాతంతో వికారాబాద్‌ మండలం ఆఖరు స్థానంలో నిలిచింది.    

సంఘాల్లో నమోదైన మహిళలకు వ్యక్తిగతంగా స్త్రీనిధి రుణాల్ని అందజేశారు. గత ఆర్థిక సంవత్సరం జిల్లాలో రూ.37.98కోట్లు అందజేసినట్లు స్త్రీనిధి జిల్లా ఇంఛార్జి మేనేజరు రాజయ్య వెల్లడించారు. వీటితో కొందరు తమకు తగినట్లు చిన్నపాటి వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.


ప్రణాళికలతో ముందుకెళ్లడంతో లక్ష్యం పూర్తి

-నర్సింహులు, ఇన్‌ఛార్జి డీపీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ

రుణాల మంజూరుపై నెలనెలా సిబ్బందితో సమీక్షలు జరిపి, ఆదాయం వచ్చే యూనిట్లను ఏర్పాటు చేయించడం ద్వారా లక్ష్యం దాటి రుణాలు అందించగలిగాం. గ్రామాల్లో మహిళలు ఉత్సాహంగా ముందుకొచ్చి రుణాలు పొందారు. వాటితో చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి సాధిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని