logo

ధర్మ భావమే సమాజాన్ని ఐక్యంగా ఉంచుతుంది

భాషలు వేరైనా భారతీయులందరి భావం ఒక్కటేనని తెలంగాణ గవర్నర్‌ సీ.పీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు.

Published : 10 Apr 2024 01:30 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: భాషలు వేరైనా భారతీయులందరి భావం ఒక్కటేనని తెలంగాణ గవర్నర్‌ సీ.పీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉగాది సంబరాల్లో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి గవర్నర్‌ పాల్గొన్నారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ అందిస్తున్న సామాజిక సేవలను గవర్నర్‌ పరిశీలించారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆడిటోరియంలో గవర్నర్‌, కేంద్రమంత్రిని వెంకయ్యనాయుడు శాలువాలతో సన్మానించారు. వేద పండితుడు చిర్రపూరి విజయానందశర్మ క్రోధి నామ సంవత్సరం పంచాగ పఠనం చేసి వివరించారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ..  ధర్మ భావమే భారతీయులను కలిసికట్టుగా ఉంచుతోందని అన్నారు. తెలుగు భాష, యాస వినపొంపుగా ఉండడమే కాకుండా సంగీతంలో కలిసిపోయి ఉంటుందన్నారు.  ప్రపంచంలోనే భారత్‌ సూపర్‌ పవర్‌ దేశంగా అవతరించే రోజులు చాలా దగ్గరగా ఉన్నాయని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. 2027 నాటికి మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందన్నారు. కొత్త పనులను చేయడానికి ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకునే ఉగాది వేడుకలను దేశ వ్యాప్తంగా జరపడం అభినందనీయమన్నారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంలో జయ, అపజయాలతో పాటు ప్రేమానురాగాలు ఉంటాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునే బాధ్యత యువతపైనే ఉందన్నారు. క్రోధి నామ సంవత్సరం తెలుగు ప్రజల జీవితాల్లో ఆనందంతో పాటు ఆరోగ్యం, సానుకూల మార్పులను తీసుకురావాలని ఆకాంక్షించారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడు చిగురుపాటి కృష్ణప్రసాద్‌, గ్రాన్యూల్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉమ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని