logo

ప్రాంతీయ రింగ్‌రోడ్డు గ్రీన్‌బెల్ట్‌తో బహుళ ప్రయోజనాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ రింగ్‌రోడ్‌(రీజినల్‌ రింగ్‌రోడ్‌) పరిధిలోని ప్రతిపాదిత గ్రీన్‌బెల్ట్‌ ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరనున్నాయి.

Updated : 10 Apr 2024 04:47 IST

ప్రభుత్వానికి జేఎన్‌టీయూ ఆచార్యుడు కె.ఎం.లక్ష్మణ్‌రావు ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాంతీయ రింగ్‌రోడ్‌(రీజినల్‌ రింగ్‌రోడ్‌) పరిధిలోని ప్రతిపాదిత గ్రీన్‌బెల్ట్‌ ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరనున్నాయి. గ్రీన్‌బెల్ట్‌ ద్వారా అందుబాటులోకి వచ్చే 1.10లక్షల ఎకరాల భూముల్లో చెరువులు, ఆక్వాకల్చర్‌, అగ్రిబిజినెస్‌ వంటి వ్యాపారాలు చేపట్టవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం లేదా 1.10లక్షల ఎకరాలను ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా పచ్చదనం పెంపొందించి ప్రాంతీయ రింగ్‌రోడ్డు లోపల సకాలంలో వర్షాలు కురిసేలా చేయవచ్చు. రింగ్‌రోడ్డుపై రాకపోకలు కొనసాగించే వాహనాలు వెదజల్లే కాలుష్యం ముప్పునుంచి తప్పించుకోవచ్చని జేఎన్‌టీయూ ఆచార్యులు కె.ఎం.లక్ష్మణ్‌రావు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వీటిని ప్రభుత్వానికి అందజేసేందుకు వీలుగా తుదిమెరుగులు దిద్దుతున్నారు. ప్రస్తుత ఓఆర్‌ఆర్‌ చుట్టూ అంతగా గ్రీన్‌బెల్ట్‌ లేకపోవడం, నివాసాలు, పరిశ్రమలు పెరుగుతుండడంతో కాలుష్యం అధికమవుతోందని, ప్రాంతీయ రింగ్‌రోడ్డు అందుబాటులోకి రాకముందే గ్రీన్‌బెల్ట్‌ను సక్రమంగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు రూపొందించామన్నారు.

110 ప్రాంతాల్లో గ్రీన్‌జోన్లు.. ప్రాంతీయ రింగ్‌రోడ్డు లోపల వంద ప్రాంతాల్లో గ్రీన్‌జోన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రతిపాదనల్లో తొలి లక్ష్యం. ప్రభుత్వం గ్రీన్‌బెల్ట్‌కు కేటాయించనున్న 1.10లక్షల ఎకరాలను 110 గ్రీన్‌జోన్లుగా విభజిస్తే.. ప్రతి 3.5 కిలోమీటర్లకు ఒక గ్రీన్‌జోన్‌ వస్తుంది. ప్రతి గ్రీన్‌జోన్‌లో వెయ్యి ఎకరాల భూమి ఉంటుంది. ఇందులో 200నుంచి 400 ఎకరాల వరకూ చెరువులు నిర్మించడం, 600 ఎకరాల్లో అగ్రిబిజినెస్‌, పర్యావరణానికి హానికలగని రీతిలో రిసార్ట్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వెయ్యి ఎకరాల భూమిని పర్యావరణ ప్రాంతంగా మార్చవచ్చు. రెండు వందల ఎకరాల నుంచి నాలుగు వందల ఎకరాల్లో నిర్మించనున్న చెరువుల ద్వారా ఆక్వాకల్చర్‌ను ప్రవేశపెడితే.. గ్రీన్‌జోన్‌ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుంది. మిగిలిన 600 ఎకరాల్లో ప్రభుత్వం వద్ద నిధులుంటే సరే.. లేదంటే ప్రముఖ ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు లీజుకివ్వడం ద్వారా ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందనుంది.  


లోపల గృహసముదాయాలు..   వెలుపల పరిశ్రమలు.. హైదరాబాద్‌ రింగ్‌రోడ్డుకు ప్రాంతీయ రింగ్‌రోడ్డుకు అనుసంధానం చేయడం ద్వారా బాహ్యవలయ రహదారి వెలుపల కూడా ప్రణాళికాబద్ధమైన శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టేందుకు వీలుంటుంది. ప్రాంతీయ రింగ్‌రోడ్డు వెలుపల పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమల్లో విధులు నిర్వహించే కార్మికులు, సిబ్బందికి ప్రాంతీయ రింగ్‌రోడ్డు లోపలే ఇళ్లు, తాత్కాలిక నిర్మాణాలు చేపడితే పనిచేసే ప్రాంతాలకు, నివాసాలకు పది కిలోమీటర్లలోపే దూరం ఉండనుంది. భవిష్యత్తులో హైదరాబాద్‌ రింగ్‌రోడ్డు వెలుపల కూడా ఐటీ సంస్థలు, భారీస్థాయిలో గేటెట్‌ కమ్యూనిటీలు అందుబాటులోకి వస్తే.. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని