logo

మరో వెయ్యిటన్నుల.. వెలుగు

వ్యర్థాలను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్‌ మరో మైలురాయిని అందుకుంది. నాలుగేళ్ల కిందట జవహర్‌నగర్‌లో రోజూ 20మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల డబ్ల్యూటీఈ(వేస్ట్‌ టు ఎనర్జీ) కేంద్రం అందుబాటులోకి వచ్చింది.

Published : 10 Apr 2024 01:40 IST

దుండిగల్‌లో ప్రారంభమైన రెండో డబ్ల్యూటీఈ
రోజుకు 900-1000 టన్నుల చెత్తతో విద్యుత్తు
డిసెంబరుకు సిద్ధం కానున్న మూడో కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: వ్యర్థాలను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్‌ మరో మైలురాయిని అందుకుంది. నాలుగేళ్ల కిందట జవహర్‌నగర్‌లో రోజూ 20మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల డబ్ల్యూటీఈ(వేస్ట్‌ టు ఎనర్జీ) కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దాని పక్కనే 25 మెగావాట్ల డబ్ల్యూటీఈ నిర్మాణ దశలో ఉండగా.. అదే సమయంలో మొదలైన దుండిగల్‌ కేంద్రం సేవలు తాజాగా మొదలయ్యాయి. దుండిగల్‌ 10 మెగావాట్ల కేంద్రం అందుబాటులోకి రావడంతో జవహర్‌నగర్‌పై ఒత్తిడి తగ్గిందని, అక్కడ పోగయ్యే వ్యర్థాల నుంచి రోజూ వెయ్యి టన్నుల చెత్తను దుండిగల్‌కు తరలించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.

100 మెగావాట్ల దిశగా..

నగరంలో ప్రస్తుతం రెండు డబ్ల్యూటీఈలు పని చేస్తున్నాయి. వాటి ద్వారా రోజూ 2,200 టన్నుల ఆర్‌డీఎఫ్‌ (రెఫ్యూజ్‌ డెరైవ్డ్‌ ఫ్యూయల్‌) భస్మమవుతోంది. మరో 2,600టన్నుల ఆర్‌డీఎఫ్‌ రోజూ జవహర్‌నగర్‌లో నిల్వ ఉంటోంది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటామని అధికారులు చెబుతున్నారు. జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో నిర్మిస్తోన్న రెండో కేంద్రం అందుబాటులోకి వస్తే మూడు ప్లాంట్లలో కలిసి మొత్తం 60మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ప్యారానగర్‌లో తలపెట్టిన విద్యుదుత్పత్తి కేంద్రం పనులు స్థానికులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా నిలిచాయి. బీబీనగర్‌, యాచారంలో ప్లాంట్లు ఎప్పుడో సిద్ధమయ్యాయి. గత ప్రభుత్వం ఆయా కేంద్రాలను పక్కనపెట్టిందని, యాజమాన్యాలు ప్రస్తుత సర్కారును సంప్రదిస్తే జీహెచ్‌ఎంసీతో ఒప్పందం చేసుకుని విద్యుదుత్పత్తిని ప్రారంభించవచ్చని ఇంజినీర్లు గుర్తు చేస్తున్నారు. అదే జరిగితే గ్రేటర్‌లోని వ్యర్థాలతో 100మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


ఆర్డీఎఫ్‌ తరలింపు ద్వారా..

డంపింగ్‌యార్డుకు వచ్చే వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేస్తారు. అందులోంచి.. కాగితం, ప్లాస్టిక్‌, ఇతర మండే స్వభావమున్న వ్యర్థాలను పక్కకు తీసి వారంపాటు ఎండలో ఉంచుతారు. దాన్నే ఆర్‌డీఎఫ్‌ అంటారు. అలా పోగైన ఆర్‌డీఎఫ్‌ను రెసిప్రొకేటింగ్‌ గ్రేట్‌ అనే సాంకేతిక పద్ధతిలో విద్యుదుత్పత్తికి ఉపయోగిస్తారు. ప్రస్తుతం దుండిగల్‌ కేంద్రానికి జవహర్‌నగర్‌లోని ఆర్‌డీఎఫ్‌ను పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో కూకట్‌పల్లిలోని కైత్లాపూర్‌, మియాపూర్‌లోని దీప్తిశ్రీనగర్‌, ఇతర చెత్తనిల్వ కేంద్రాల్లోనే ఆర్‌డీఎఫ్‌ను తయారు చేసి.. అక్కడి నుంచి దుండిగల్‌ డబ్ల్యూటీఈకి తరలించే చర్చలు జరుగుతున్నాయని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని