logo

తేజస్‌ హత్యకు వారం క్రితమే పథక రచన

తేజస్‌ హత్యకు వారం క్రితమే నిందితులు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. బాచుపల్లి ఠాణా పరిధిలోని ప్రగతినగర్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రతీకార హత్యలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Published : 10 Apr 2024 01:40 IST

సామాజిక మాధ్యమాల వేదికగా హెచ్చరించిన నిందితులు

నిజాంపేట, న్యూస్‌టుడే: తేజస్‌ హత్యకు వారం క్రితమే నిందితులు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. బాచుపల్లి ఠాణా పరిధిలోని ప్రగతినగర్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రతీకార హత్యలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది దసరా రోజున ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో తరుణ్‌రాయ్‌ హత్య కేసులో గ్యాంగ్‌స్టార్‌గా పేరుగాంచిన షరీఫ్‌ ప్రధాన, తేజస్‌ ఏ3 నిందితులు. ఆ హత్యకు వ్యూహరచన చేసింది తేజస్‌ అనేది తరుణ్‌ మిత్రబృందం మొదటి నుంచి నమ్ముతుంది. దాంతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తేజస్‌ను ఎలాగైనా మట్టుబెడతామంటూ నిందితులు గతంలోనే పలు సామాజిక మాధ్యమాల వేదికంగా బహిరంగ సవాల్‌ విసిరినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రెండు నెలల క్రితం జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన అతని కోసం తరుణ్‌రాయ్‌ స్నేహితులు ఆరా తీసినట్లు తెలిసింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన తేెజస్‌ తల్లి ప్రగతినగర్‌కు మకాం మార్చారు. నిందితుల్లో ఓ యువకుడు తేజస్‌కు దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అయితే తేజస్‌ వెన్నంటే ఉంటూ అతడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వైరి వర్గానికి చేరవేసేవాడు. వారం క్రితం నిందితులు తేజస్‌ను చంపడానికి ప్రగతినగర్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రోజు తేజస్‌ ఇంట్లో లేకపోవడంతో తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆదివారం రాత్రి ముగ్గురు మిత్రులు తేజస్‌ వద్దకు వచ్చి తెల్లవారుజాము వరకు మద్యం తాగారు. ఆ ముగ్గురిలో వైరి వర్గానికి సమాచారం చేరవేస్తున్న యువకుడి మాయ మాటలతో తేజస్‌ను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటికే అక్కడ మాటు వేసిన నిందితులు మూకుమ్మడిగా తేజస్‌ను వెంటాడి కత్తితో దారుణంగా పొడిచి అంతమొందించారు. ప్రస్తుతం నిందితులు కొందరు పోలీసుల అదుపులో ఉన్నట్లు మిగతా వారి కోసం ఐదు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని