logo

ఎండల్లో నో ఏసీ.. తక్కువ ధరలో తీసుకెళ్లలేమంటున్న క్యాబ్‌ డ్రైవర్లు

గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ ఎండలో ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లకు చేరుకోవాలంటే చాలామంది క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు.

Updated : 10 Apr 2024 09:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ ఎండలో ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లకు చేరుకోవాలంటే చాలామంది క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. తీరా క్యాబ్‌ ఎక్కాక ఏసీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టిప్‌ లేదా అదనపు ఛార్జీలు చెల్లిస్తే ఏసీ వేస్తామని క్యాబ్‌ డ్రైవర్లు చెబుతూ.. తమను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. జంటనగరాల్లో ప్రధాన కంపెనీలైన ఓలా, ఉబర్‌, రాపిడో అగ్రిగేటర్‌ సంస్థల తరఫున క్యాబ్‌లు నడుపుతున్న డ్రైవర్లు రెండు రోజులుగా ఈ ‘నో ఏసీ క్యాంపైన్‌’ నడిపిస్తున్నారు. ఏసీతో నడిపించాలంటే అగ్రిగేటర్‌ సంస్థలు చెల్లించే కమీషన్‌ సరిపోవడం లేదని తెలంగాణ గ్రిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్ల యూనియన్‌(టీజీపీడబ్ల్యూయూ) వాదిస్తోంది. కమీషన్లు పెంచాలని ఇప్పటికే వారి దృష్టికి తీసుకెళ్లినట్లు టీజీపీడబ్ల్యుయూ చెబుతోంది. లేదంటే కర్ణాటక మాదిరి క్యాబ్‌లకు యూనిఫాం ధరలు అమలు చేయాలని వాదిస్తోంది.


ప్రయాణికుల అసహనం.. సంస్థల చర్యలు

ప్పటికే పీక్‌ అవర్స్‌, ఇతర ఛార్జీల పేరుతో కొన్నిసార్లు తక్కువ దూరానికి కూడా ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తున్నామని, ఏసీ సేవల పేరుతో అదనంగా ఎలా చెల్లిస్తామని ప్రయాణికులు వాపోతున్నారు.  డ్రైవర్లతో వాదనకు దిగుతూ ఆయా కంపెనీలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఛార్జీలు గిట్టుబాటు కాకపోతే ఆయా అగ్రిగేటర్‌ సంస్థలతో తేల్చుకోవాలని, తీరా క్యాబ్‌ ఎక్కాక ఏసీ వేయకపోతే ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ప్రయాణికులే తమకు కీలకమని, వారిని ఇబ్బంది పెట్టాలని కాదని, తమను అర్థం చేసుకోవాలని మరోవైపు టీజీపీడబ్ల్యూయూ ప్రతినిధులు చెబుతున్నారు. క్యాబ్‌ డ్రైవర్లకు తక్కువ కమీషన్‌పై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలిపారు. మరోవైపు డ్రైవర్లు క్యాబ్‌ల్లో ఏసీ వేసేందుకు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయా అగ్రిగేటర్‌ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ట్రిప్‌ ఛార్జీల్లో 25శాతం కోతతోపాటు, అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్‌ చేయడమే కాకుండా..వారంవారీగా ఇన్సెంటివ్స్‌ పొందే అర్హత కోల్పోతారని తెలిపాయి. అంతేకాక ఎయిర్‌పోర్టు, రెంటల్స్‌ లేదా ఇంటర్‌సిటీ ట్రిప్‌లు కోల్పోతారని చెబుతున్నాయి. మరోవైపు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ‘నో ఏసీ’ క్యాంపైన్‌పై ముందుకే వెళ్తామని డ్రైవర్లు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని