logo

యథేచ్ఛగా డీజిల్‌ అక్రమ రవాణా

పరిశ్రమల్లో నిరంతర విద్యుత్తు సరఫరా కోసం నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో డీజిల్‌ను వినియోగిస్తుంటారు. వేల లీటర్ల ఇంధనాన్ని భూగర్భ ట్యాంకుల్లో భద్రపరిచి భారీ జనరేటర్లకు వినియోగిస్తుంటారు.

Published : 10 Apr 2024 01:46 IST

నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక నుంచి దిగుమతి
పరిశ్రమల్లో స్టోరేజీ ట్యాంకర్లలో నిల్వ
ఈనాడు, హైదరాబాద్‌

రిశ్రమల్లో నిరంతర విద్యుత్తు సరఫరా కోసం నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో డీజిల్‌ను వినియోగిస్తుంటారు. వేల లీటర్ల ఇంధనాన్ని భూగర్భ ట్యాంకుల్లో భద్రపరిచి భారీ జనరేటర్లకు వినియోగిస్తుంటారు. ఇలా ఇంధనాన్ని నిల్వ చేయడానికి పౌరసరఫరాలశాఖ అనుమతి తప్పనిసరి. కాటేదాన్‌, మైలార్‌దేవ్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్‌ పారిశ్రామికవాడల్లో కొందరు ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించకుండా స్టోరేజీ ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి తరుణంలో ఈ స్టోరేజీ ట్యాంకులపై నిఘా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న డీజిల్‌ను అనుమతుల్లేని పరిశ్రమల్లో వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలోని చించోలి నుంచి భారీగా డీజిల్‌ను తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠా గుట్టును  శంకర్‌పల్లి ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. వారి నుంచి రూ.14.36 లక్షల విలువైన 15వేల లీటర్ల ఇంధనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ధరల్లో వ్యత్యాసమే కారణం..

కర్ణాటకలో డీజిల్‌ ధరకు ఇక్కడికి రూ.10ల తేడా ఉండటంతో వేల లీటర్లు అక్రమంగా తెప్పించి లబ్ధిపొందుతున్నారు. రాయచూరు (నగరం నుంచి 208కి.మీ), యాద్గిర్‌ (194 కి.మీ) , గుర్మిట్‌కల్‌(156కి.మీ), సైదాపూర్‌ (209కి.మీ), చించోలి (155కి.మీ) నుంచి శివారు ప్రాంతాల మీదుగా ట్యాంకర్లలో తరలిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్యాంకర్లు సరిహద్దుల్లో అధికారుల కళ్లుగప్పి రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక్కో ట్యాంకర్‌ సామర్థ్యం 15 వేల లీటర్లు ఉంటుంది. శివార్లలోని కొన్ని బంకులు, పరిశ్రమల నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారని సమాచారం.


ఖజానాకు గండి..

రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, దూరం తదితర అంశాలను కలిపి నిర్ధారించిన ధరకు మాత్రమే ఆయిల్‌ కంపెనీల నుంచి డీజిల్‌ను కొనుగోలు చేయాలన్నది నిబంధన. కానీ చవకగా వస్తుందని, మూడు నుంచి నాలుగు గంటల్లో నగరానికి చేర్చొచ్చని కొందరు కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి డీజిల్‌ను అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాకు గండి పడుతోంది. ఒక రాష్ట్రంలో ఉన్న బంకుల నుంచి రిటైల్‌ వాడకందారులు తప్ప, హోల్‌సేల్‌గా ట్యాంకర్ల కొద్దీ వేరే రాష్ట్రం విక్రయాలు జరగకూడదు. కొందరు రాజకీయ పలుకుబడితోనే ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని