logo

తాగునీటి సరఫరాకు ప్రత్యేక కార్యాచరణ

రాజధానిలో అంతర్భాగమైన రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి విజయేంద్ర బోయి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు.

Published : 10 Apr 2024 01:48 IST

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పరిస్థితులపై సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో అంతర్భాగమైన రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి విజయేంద్ర బోయి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఏప్రిల్‌ తొలి వారం నుంచి జూన్‌ వరకూ రెండు నెలల పాటు మున్సిపల్‌, కార్పొరేషన్ల కమిషనర్లు, మండలాల ప్రత్యేక అధికారులు, మిషన్‌ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమండలి, మిషన్‌ భగీరథ అధికారులతో నిత్యం సంప్రదింపులు నిర్వహిస్తూ తాగునీటి లభ్యతపై సమాచారం సేకరించాలన్నారు. అవసరమైన చోట్ల బోర్లు, పైపులైన్ల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. శేరిలింగంపల్లి సర్కిల్‌, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీ, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, మేడ్చల్‌ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులున్నాయని, అక్కడ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఫిర్యాదుల నమోదు.. పరిష్కారం..  మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జలమండలి కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదులను రిజిస్టర్‌లో నమోదు చేయాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా ఏఏ ప్రాంతాల్లో సరఫరా సరిపడినంత లేదు.. లీకేజీలున్నాయా? అన్న అంశాలపై అవగాహన వస్తుందని భావిస్తున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. 93474 92260 నంబర్‌కు ఫోన్‌ లేదా వాట్సాప్‌ చేయాలన్నారు.

ప్రత్యేక అధికారుల నియామకం.. రంగారెడ్డి జిల్లాలో తాగునీటి సరఫరాను పర్యవేక్షణకు  జిల్లా కలెక్టర్‌ శశాంక.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. మున్సిపల్‌ పరిధిలో కమిషనర్లు, గ్రామాల్లో కార్యదర్శులు చర్యలు చేపడతారు. మున్సిపల్‌ కమిషనర్లు, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌ అధికారులు  నీటి పొదుపుపై ప్రచారం నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని