logo

రిజర్వాయర్లలో తేలే పంపింగ్‌ స్టేషన్లు

రిజర్వాయర్ల నీటి మట్టాలు పూర్తిస్థాయిలో తగ్గినా నగరానికి తరలించడానికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Published : 10 Apr 2024 01:51 IST

ఏర్పాటుకు జలమండలి సిద్ధం
నీటి నిల్వలు పూర్తి స్థాయిలో తగ్గితే ఇబ్బందుల్లేకుండా చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: రిజర్వాయర్ల నీటి మట్టాలు పూర్తిస్థాయిలో తగ్గినా నగరానికి తరలించడానికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అవసరమైతే రిజర్వాయర్ల మధ్యలో ఫ్లోటింగ్‌ పంపింగ్‌ స్టేషన్లు (బార్జ్‌లు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

  • జలాశయం మధ్యలో ఈ బార్జ్‌ ఏర్పాటు చేసి భారీ పైపుల ద్వారా అప్రోచ్‌ ఛానెల్‌లో వేసి.. పంపింగ్‌కు ఇబ్బందులు లేకుండా చూస్తారు. మట్టాలు డెడ్‌ స్టోరేజీలకు పడిపోయినప్పుడు అత్యవసర పంపింగ్‌తోపాటు ఇలాంటివి ఏర్పాటు చేస్తుంటారు.
  • మహానగరానికి నాగార్జునసాగర్‌, ఎల్లంపల్లి, సింగూరు, మంజీరా, జంటజలాశయాల నుంచి నిత్యం 2604 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. ఇందులో కృష్ణా, గోదావరి జలాలే కీలకం. నాగార్జునసాగర్‌తోపాటు ఎల్లంపల్లిలో నీటి మట్టాలు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్‌ అవసరాలే కాకుండా ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా చేయాలి. ఈ నేపథ్యంలో అనుకున్న దానికంటే వేగంగా మట్టాలు తగ్గుతున్నాయి.
  • సాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 511 అడుగులు వరకు ఉంది. మరో అడుగు తగ్గితే.. ఆ ప్రభావం నగరంపై పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అత్యవసర పంపింగ్‌కు ఏర్పాట్లుచేస్తున్నారు.
  • మరో రెండురోజుల్లో ఒక పంపు ప్రారంభించనున్నారు. ఫలితంగా సాగర్‌ లోపలి నుంచి నీటిని తోడి పుట్టంగండి వద్ద పంపింగ్‌కు ఇబ్బంది లేకుండా అప్రోచ్‌ ఛానెల్‌లో పోయనున్నారు. 510 అడుగులు ఇంకా తగ్గి.. అత్యవసర పంపింగ్‌కూ జలాలు అందని పరిస్థితి తలెత్తితే ఈ బార్జ్‌లు ఉపయోగపడనున్నాయి.
  • ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి మట్టం 485.560 అడుగులు.. ప్రస్తుతం 465.934కు తగ్గింది. వచ్చే నెల 1 నుంచి అత్యవసర పంపింగ్‌ చేపట్టాల్సిందే. ఇప్పటికే టెండర్లు పూర్తి చేసి జలమండలి పనులు మొదలుపెట్టింది. ఈ జలాశయం నుంచి మిషన్‌ భగీరథ ఇతర అవసరాలకు నీటిని తరలించాలి. జలాశయాల్లో మట్టాలు తగ్గితే బార్జ్‌ ఏర్పాటుచేసి అప్రోచ్‌ ఛానెల్‌లోకి నీటిని పంపింగ్‌ చేయనున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని