logo

కేర్‌ టేకర్‌ దుర్బుద్ధి.. సపర్యలకు వచ్చి..

సేవలు చేయడానికి వచ్చి కొంతకాలం నమ్మకంగా పనిచేసి అదను చూసి రూ.30 లక్షలు కాజేసిన ఘటన దోమలగూడ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 10 Apr 2024 10:08 IST

రాంనగర్‌, న్యూస్‌టుడే: సేవలు చేయడానికి వచ్చి కొంతకాలం నమ్మకంగా పనిచేసి అదను చూసి రూ.30 లక్షలు కాజేసిన ఘటన దోమలగూడ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం... విశ్రాంత ప్రభుత్వ ఉన్నతోద్యోగి వి.రాధాకృష్ణయ్య, అతని భార్య కమల దోమలగూడ గగన్‌మహల్‌ బాలసాయిబాబా మందిరం సమీపంలోని రాఘవ టవర్స్‌లో నివసించే కూతురు కవిత, అల్లుడు నాగేంద్ర ఇంట్లో ఉంటున్నారు. నాగేంద్ర పంజాగుట్టలో మెడికల్‌ షాపు నిర్వహిస్తుండగా.. కవిత సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. రాధాకృష్ణయ్య అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆయనకు సపర్యలు చేయడానికి ఏడాది క్రితం కుత్బుల్లాపూర్‌కు చెందిన బీవీ లోకేశ్వర్‌రావు(27)ను కేర్‌టేెకర్‌గా పెట్టుకున్నారు. అతనికి వీరి ఇంట్లోనే గది ఇచ్చి, రోజు భోజనం పెడుతూ నెలకు రూ.35 వేలు ఇస్తున్నారు. ఇంట్లో వారికి, బంధువులకు నమ్మకంగా ఉంటున్నాడు. అతని కుటుంబ సమస్యలు చెబుతూ కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు.

రాధాకృష్ణయ్యకు పదవీ విరమణ సమయంలో వచ్చిన డబ్బులోంచి రూ.10 లక్షలు తన అకౌంట్‌లో, రూ.11 లక్షలు భార్య కమల ఖాతాలో జమ చేశాడు. మందులకు డబ్బు అవసరం ఉండడంతో రెండు, మూడుసార్లు లోకేశ్వర్‌రావుతో ఏటీఎం నుంచి తెప్పించుకున్నాడు. బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లు తెలుసుకున్న లోకేశ్వర్‌రావుకు వాటిని కాజేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. జనవరిలో ఇద్దరి బ్యాంకు ఖాతాల నుంచి రూ.21 లక్షలు డ్రా చేశాడు. వేర్వేరు కారణాలు చెబుతూ మరో రూ.9 లక్షలు తీసుకున్నాడు. ఫిబ్రవరి 5న చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తోంది. మార్చి 14న బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేయడానికి వెళ్తే ఇద్దరి అకౌంట్లో బ్యాలెన్స్‌ లేదని తెలుసుకొని షాకయ్యారు. వెంటనే దోమలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకోవడంలో జాప్యం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని