logo

రద్దీ ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి.. ఓఆర్‌ఆర్‌ వరకు ప్రత్యేక ప్రణాళిక

అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రద్దీ ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి, ప్రణాళికాబద్దమైన రోడ్డు నెట్‌వర్క్‌, పాదచారులకు కాలిబాటల నిర్మాణం, అవసరమైన చోట ఎలివేటెడ్‌ కారిడార్‌లు, పైవంతెనలు తదితర మౌలిక వసతులపై హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది.

Updated : 10 Apr 2024 08:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు రద్దీ ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి, ప్రణాళికాబద్దమైన రోడ్డు నెట్‌వర్క్‌, పాదచారులకు కాలిబాటల నిర్మాణం, అవసరమైన చోట ఎలివేటెడ్‌ కారిడార్‌లు, పైవంతెనలు తదితర మౌలిక వసతులపై హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది. యూనిఫైడ్‌ మెట్రోపాలిట్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(ఉమ్టా) ఇందుకు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూపకల్పన చేస్తోంది. 2050 అవసరాలకు తగ్గట్లు రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి చేపట్టేందుకు ఉమ్టా శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా కాంప్రెన్సిన్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ)లో ప్రజారవాణాపై దృష్టి సారించారు. ఇందులో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ను కూడా భాగస్వామ్యం చేయనున్నారు.

ట్రాఫిక్‌ సాఫీగా సాగేలా.. పారడైజ్‌ జంక్షన్‌ వద్ద రోజుకు సగటున 1,57,105 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఇరుకైన రహదారి, పెద్దమొత్తంలో వాహన రాకపోకలతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వరకు డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. ఇదే జంక్షన్‌ నుంచి రాజీవ్‌ రహదారి వరకు దాదాపు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించనున్నారు. రద్దీ ప్రాంతాల్లో కాలిబాటలు ఏర్పాటు చేయడం.. ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోనున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో రద్దీ జంక్షన్లను గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై తొలుత ప్రణాళిక రూపొందించనున్నారు. దశలవారీగా రద్దీ జంక్షన్లలో ట్రాఫిక్‌, పాదచారులకు ఆటంకం లేకుండా రద్దీ చర్యలు చేపట్టనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని