logo

సూరీడు సుర్రుమంటున్నాడు.. మీటరు గిర్రుమంటోంది

ఎండలు మండిపోతున్నాయి. నగరంలో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు విశ్రాంతి ఉండటం లేదు.

Updated : 10 Apr 2024 08:29 IST

ఊహించని రీతిలో పెరిగిన  విద్యుత్తు డిమాండ్‌
నిన్నటివరకు ట్రాన్స్‌ఫార్మర్ల పవర్‌ పెంపు... ఇప్పుడిక డీటీఆర్‌ల వంతు

ఈనాడు, హైదరాబాద్‌: ఎండలు మండిపోతున్నాయి. నగరంలో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు విశ్రాంతి ఉండటం లేదు. గ్రేటర్‌లో మార్చి, ఏప్రిల్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ విద్యుత్తు డిమాండ్‌ రావడంతో పలు ఉపకేంద్రాల్లోని 80 శాతం కంటే ఎక్కువ లోడ్‌ ఉన్న పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల (పీటీఆర్‌)ను ఎక్కువ సామర్థ్యం కలిగిన వాటితో మార్పిడి చేశారు. ఇప్పుడిక కాలనీల్లో ఉండే డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్‌)ను మార్చబోతున్నారు. ఇందుకోసం కరెంట్‌ వినియోగం అధికంగా ఉండే సమయంలో డీటీఆర్‌ల కచ్చితమైన లోడ్‌ను గుర్తించే మదింపు చేపట్టారు. టంగ్‌టెస్టర్‌ ద్వారా లోడ్‌ను గుర్తించి రికార్డు చేసే పనిని విద్యుత్తు సిబ్బంది ఎక్కువగా రాత్రిపూట చేస్తున్నారు.

ఒక్కో సర్కిల్‌లో ఒక్కోలా..

విద్యుత్తు గరిష్ఠ డిమాండ్‌ సాధారణంగా సాయంత్రం ఉంటుంది. ఈ ఏడాది పీక్‌ డిమాండ్‌ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఒక్కో సర్కిల్‌లో ఒక్కో సమయంలో నమోదవుతున్నట్లు ఇంజినీర్లు గమనించారు.

  • ఐటీ కార్యాలయాలు, ఆకాశహార్మ్యాల నివాసాలు ఉన్న సైబర్‌సిటీ సర్కిల్‌లో ఈ నెల 5న రికార్డు స్థాయిలో 784.4 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌ 20న గరిష్ఠంగా నమోదైన 455 మెగావాట్ల కంటే చాలా ఎక్కువ. గచ్చిబౌలి, నార్సింగిలో వెంటనే పీటీఆర్‌ల సామర్థ్యాన్ని పెంచారు. ఈ సర్కిల్‌ పరిధిలో రాత్రి 11 నుంచి 12 మధ్య పీక్‌ లోడ్‌ ఉంటుంది.
  • రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోనూ సాయంత్రం 5 గంటల మధ్య అత్యధిక లోడ్‌ రికార్డైందని అధికారులు తెలిపారు.  ఈ నెల 3న అత్యధికంగా 674 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. గతేడాది ఏప్రిల్‌ 16న గరిష్ఠ డిమాండ్‌ 649.9 మెగావాట్లుగా ఉంది.
  • సరూర్‌నగర్‌లో ఈ నెల 5న అత్యధికంగా 292.3 మెగావాట్లు నమోదైంది. క్రితం ఏడాది 6వ తేదీన 288 మెగావాట్లు రికార్డైంది. ఈ సర్కిల్‌లో సాధారణ వృద్ధినే ఉంది. నివాసకేంద్రాలు అధికంగా ఉండే ఈ సర్కిల్‌లో సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య పీక్‌ డిమాండ్‌ ఉంటుంది.


ముందుస్తుగా అప్రమత్తం..

గ్రేటర్‌లోని 9 సర్కిళ్ల పరిధిలో 1.47 లక్షల డీటీఆర్‌లు ఉన్నాయి. వేసవి కార్యాచరణ ప్రణాళికలో అధికలోడ్‌ ఉన్న కొన్నింటిని మార్చారు. డిమాండ్‌ నేపథ్యంలో ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో లోడ్‌ పెరిగింది. వీటిని గుర్తించి మార్చకపోతే మేలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముందుస్తుగా లోడ్‌ మదింపును చేపట్టారు. ఏసీల వాడకం పెరగడం, నిరంతరాయ కరెంట్‌ సరఫరా, అంతరాయం ఏర్పడితే వెంటనే మరమ్మతు చేయడం, వేసవి తాపంతో బోర్ల వాడకం పెరగడం, రంజాన్‌ మాసం ఇలా ఎన్నో అంశాలు మార్చి, ఏప్రిల్‌లో అనూహ్యంగా డిమాండ్‌ పెరగడానికి కారణాలని ఇంజినీర్లు అంటున్నారు. నగరం మొత్తానికి ఉపయోగించే కరెంట్‌ను ఇప్పుడు ఒక్క రంగారెడ్డి జోన్‌ పరిధిలోని సర్కిళ్లలో వినియోగిస్తున్నారు. వేసవి ప్రణాళిక వేసుకున్నా అంతకంటే ఎక్కువ డిమాండ్‌ ఈసారి కనిపించింది.


డిమాండ్‌ ఏ స్థాయిలో పెరిగిందంటే..

  • రంగారెడ్డి జోన్‌ పరిధిలో నాలుగు సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఈ నెల 7న 47.20 మిలియన్‌ యూనిట్ల గరిష్ఠ వినియోగం నమోదైంది. గత ఏడాది ఇదే రోజున 32.69 మిలియన్‌ యూనిట్లు మాత్రమే. ఏకంగా వినియోగం 30.75 శాతం పెరిగింది.
  • డిమాండ్‌ పరంగా చూస్తే ఏప్రిల్‌ 5న 1984 మెగావాట్లు గరిష్ఠంగా రికార్డైంది. క్రితం ఏడాది 1437 మెగావాట్లు మాత్రమే. ఈస్థాయిలో డిమాండ్‌ పెరగడంతో ఇంజినీర్లు ఒకింత కంగారు పడ్డారు. ఓవర్‌లోడ్‌ సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉన్నారు. రెండు మెగావాట్లకు మించితే తట్టుకోవడం కష్టమే. అందుకే డీటీఆర్‌ల సామర్థ్యాన్ని పెంచే పనిని ప్రాధాన్యతగా తీసుకున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని