logo

తప్పని గురి.. విజయతీరం చేరి

సమాజానికి తమవంతు సేవ చేయాలన్న ఆశయం.. విభిన్నమైన ఆలోచనా విధానం.. పరీక్షల్లో విజయం పొందాలన్న ఆత్మవిశ్వాసంతో వీరంతా సివిల్స్‌వైపు అడుగులేశారు.

Updated : 17 Apr 2024 05:10 IST

సివిల్స్‌ విజేతల మనోగతం

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, ముషీరాబాద్‌, గాంధీనగర్‌, రాంనగర్‌, షాద్‌నగర్‌, తుర్కయంజాల్‌ పురపాలిక: సమాజానికి తమవంతు సేవ చేయాలన్న ఆశయం.. విభిన్నమైన ఆలోచనా విధానం.. పరీక్షల్లో విజయం పొందాలన్న ఆత్మవిశ్వాసంతో వీరంతా సివిల్స్‌వైపు అడుగులేశారు. కొందరు ఉన్నత శ్రేణిలో నిలబడ్డారు. వీరిలో కొందరు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ‘ఈనాడు’తో వారి మనోగతాన్ని పంచుకున్నారు. అశోక్‌నగర్‌లోని సివిల్స్‌ శిక్షణ కేంద్రాలకు చెందిన అభ్యర్థులు ర్యాంకులు సాధించడంతో సంబురాలు చేసుకున్నారు.

అణగారిన వర్గాలకు సేవలందించాలని..

మేఘనా దేవి, 411వ ర్యాంకు, హైదరాబాద్‌

అణగారిన వర్గాలకు సేవలందించాలన్న లక్ష్యంతో సివిల్స్‌ ఎంచుకున్నా. రెండేళ్లక్రితం రాస్తే కార్పొరేట్‌ అఫైర్స్‌లో ఉద్యోగం వచ్చింది. హరియాణా మనేసర్‌లో శిక్షణ పొందుతున్నా. ఇది రెండోసారి. ఇంజినీరింగ్‌ అయ్యాక హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో చేరా. పెళ్లయ్యాక మావారితో జర్మనీ వెళ్లా.

545వ ర్యాంకర్‌కు సత్కారం

తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ కోహెడ గ్రామంలో నారాయణ ఐఏఎస్‌ అకాడమీకి చెందిన నరేంద్ర పడాలకు 545వ ర్యాంకు సాధించినట్లు విద్యాసంస్థ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం కోహెడలోని అకాడమీ ప్రాంగణంలో నరేంద్రను సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల డీన్‌ మనోజ్‌కుమార్‌, ఏజీఎం సింగారెడ్డి, ప్రిన్సిపల్‌ మంజుల తదితరులు పాల్గొన్నారు.

కుటుంబమే ప్రేరణ

ఐశ్వర్య నీలి శ్యామల, 649వ ర్యాంకు, హైదరాబాద్‌

మా కుటుంబ వాతావరణమే సివిల్స్‌ సాధించేందుకు ప్రేరణ కల్పించింది. తాతయ్య జస్టిస్‌ కె.రామస్వామి సుప్రీంకోర్టులో జడ్జిగా విధులు నిర్వహించారు. అమ్మ ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలు. నాన్న రైల్వేశాఖలో ఉన్నారు. వారంతా సమాజానికి తమవంతు సేవ చేస్తున్నారు. అందుకే జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ చదివి సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. తొలి మూడుసార్లు అనుకున్నంతగా విజయం రాలేదు.

మహమ్మద్‌ అష్ఫక్‌కు 770వ ర్యాంకు

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: మండలంలోని గోట్లపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్‌ అష్ఫక్‌ 770 ర్యాంకుతో రాణించాడు. మహమ్మద్‌ జాఫర్‌, రిజ్వాన బేగం కుమారుడైన ఇతను మంచి ర్యాంక్‌ సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తండ్రి జాఫర్‌ బీహెచ్‌ఈఎల్‌ చౌరస్తా వద్ద లైట్‌ మెషీన్‌ ఇంజినీరింగ్‌ పనులు చేస్తున్నారు. తల్లి గృహిణి.

పేదలకు సేవ చేయాలన్న లక్ష్యంతో..

హనిత వేములపాటి, 887వ ర్యాంకు, హైదరాబాద్‌

పేదలకు సేవ చేయాలన్న లక్ష్యంతో సివిల్స్‌ ఎంచుకున్నా. ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరంలో వెన్నెముకలో ఇన్ఫెక్షన్‌ కారణంగా మంచానికి పరిమితయ్యా. ఇంజినీరింగ్‌ చదవలేక దూరవిద్యలో డిగ్రీ చేశా. 3 ప్రయత్నాల్లో అనుకున్న ర్యాంక్‌ రాలేదు. ప్రతి ప్రయత్నంలో నాకు తోడుగా నిలిచి ఆత్మస్థైర్యాన్ని పెంచిన అమ్మా,నాన్నలకు ఎంతో రుణపడి ఉంటా.

రైల్వే ఉద్యోగం వదిలి..

శశికాంత్‌, 891వ ర్యాంకు, షాద్‌నగర్‌

బీటెక్‌ చదివి 2008 నుంచి ఇప్పటివరకు 8 సార్లు రాసి మూడుసార్లు ర్యాంకు సాధించా. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామపరిధిలోని చాకలి తండాకు చెందిన గిరిపుత్రుడను. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో తల్లి సీతమ్మ, సోదరులతో కలిసి షాద్‌నగర్‌ వచ్చి స్థిరపడ్డాం. 2018లో 2002 ర్యాంకు, 2020లో 695 ర్యాంకు వచ్చాయి. ఇండియన్‌ రైల్వేస్‌లో ఆపరేషన్‌ మేనేజర్‌గా ఉద్యోగం రాగా ప్రస్తుతం అస్సాంలో విధులు నిర్వహిస్తున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని