Vande Bharat Express: ఒకే రోజు పట్టాలెక్కిన 5 వందేభారత్‌ రైళ్లు.. జెండా ఊపిన ప్రధాని

మధ్యప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ నేడు 5 వందే భారత్‌ రైళ్ల (Vande Bharat Express)ను ప్రారంభించారు. ఒకే రోజు ఒకటికంటే ఎక్కువ వందేభారత్‌ రైళ్లను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Updated : 27 Jun 2023 11:55 IST

భోపాల్‌: అత్యాధునిక సదుపాయాలు కలిగిన సెమీహైస్పీడ్‌ వందే భారత్‌ రైళ్ల (Vande Bharat Express) ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకే రోజు అయిదు కొత్త వందే భారత్‌ రైళ్లు పట్టాలెక్కాయి. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రాజధాని భోపాల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) జెండా ఊపి వీటిని ప్రారంభించారు. పలు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలను అనుసంధానించేలా ఈ రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

మంగళవారం ఉదయం భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని.. భోపాల్‌(రాణికమలాపతి)-జబల్‌పుర్‌; ఖజురహో-భోపాల్‌-ఇందౌర్‌; హతియా-పట్నా; ధార్వాడ్‌-బెంగళూరు; గోవా(మడ్గావ్‌)-ముంబయి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల (Vande Bharat Express)కు జెండా ఊపారు. ఇందులో రెండు రైళ్లను భౌతికంగా, మిగతా మూడు రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వందే భారత్‌ రైల్లో చిన్నారులతో ఆయన ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, మధ్యప్రదేశ్ గవర్నర్‌ మంగుభాయ్‌ పటేల్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఒకే రోజు ఒకటికంటే ఎక్కువ వందేభారత్‌ రైళ్లను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ ఉదయం భోపాల్‌ ఎయిర్‌పోర్టు నుంచి రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు ప్రధాని హెలికాప్టర్‌లో రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా ఆయన స్టేషన్‌ను చేరుకున్నట్లు భాజపా రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జ్‌ ఆశిష్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒకేసారి రెండు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని