Nayanthara: ‘అన్నపూరణి’ వివాదంపై స్పందించిన నయనతార.. క్షమించమంటూ పోస్ట్‌..

‘అన్నపూరణి’ వివాదంపై నయనతార స్పందించి క్షమాపణలు చెప్పారు.

Updated : 19 Jan 2024 11:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అగ్రకథానాయిక నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం వివాదాస్పదమైంది. తాజాగా దీనిపై నయనతార స్పందించారు.

‘బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నా. ‘అన్నపూరణి’ సినిమాను ప్రజల్లోకి మంచి ఆలోచన తీసుకెళ్లేందుకు రూపొందించాం. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలియజేసేందుకు తెరకెక్కించాం. ఈ ప్రయత్నంలో మాకు తెలియకుండానే కొందరి మనసులను గాయపరిచాం. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చిన సినిమాను ఓటీటీ వేదిక నుంచి తొలగిస్తారని ఊహించలేదు. మా చిత్రబృందం, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. నేను ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదు. మీ మనోభావాలను గాయపరిచినందుకు క్షమించండి. ఈ చిత్ర ప్రధాన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదు. నా 20 ఏళ్ల కెరీర్‌లో సానుకూలతను వ్యాప్తిచేయాలనే చూశాను’ అని పేర్కొన్నారు.

మలయాళ బ్లాక్‌బస్టర్‌ ‘నేరు’.. ఓటీటీలో వచ్చేస్తోంది!

నయనతార 75వ చిత్రంగా ‘అన్నపూరణి’ విడుదలైంది. ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. చెఫ్‌గా ఎదగాలనే తన కలను ఎలా సాకారం చేసుకుంది? అనే కథాంశంతో దీనిని రూపొందించారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాగా.. ఇందులోని కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని