Shreya Ghoshal: ఆ గాన ప్రస్థానానికి 19ఏళ్లు

‘నువ్వేం  మాయ చేశావో కానీ’ అంటూ ఆమె పాడితే సంగీత ప్రియులు మాయలో పడిపోతారు. ‘నమ్మిన నా మది మంత్రాలయమేగా’ అని అంటే మన మది పులకిస్తుంది. ‘కోపమా నా పైన ఆపవా ఇకనైనా’ అంటూ తన స్వరంతో బుజ్జగిస్తుంది.

Published : 12 Jul 2021 17:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నువ్వేం మాయ చేశావో కానీ’ అంటూ ఆమె గానం సంగీత ప్రియుల్ని మాయలో పడేస్తుంది. ‘నమ్మిన నా మది మంత్రాలయమేగా’ అని అంటే మన మది పులకిస్తుంది. ‘కోపమా నా పైన.. ఆపవా ఇకనైనా’ అంటూ తన స్వరంతో బుజ్జగిస్తుంది. ‘మూగ మనసులు’ అంటూ తన గాత్రంతో మరో లోకంలోకి తీసుకెళ్తుంది. ఇలాంటి మధురమైన పాటల్నే కాదు ఐటెం గీతాల్నీ ఆలపించి ‘బ్లాక్‌ బ్లస్టర్‌’ సింగర్‌ అనిపించుకుంది. తను పాడినా ఏ పాట విన్నా మనం ‘ఇంకోసారి ఇంకోసారి’ అనాల్సిందే. ఇప్పటికే అర్థమైంది కదూ ఆ గాయని ఎవరో! అవును. తనే శ్రేయా ఘోషల్‌. సినిమా రంగంలో శ్రేయ గొంతువిప్పి 19 ఏళ్లు పూర్తయ్యాయి.

షారుఖ్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్‌, మాధురీ దీక్షిత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘దేవదాస్‌’ చిత్రంతో తన గాన ప్రస్థానాన్ని మొదలుపెట్టిందామె. 2002లో ఇదే రోజున విడుదలైందా సినిమా. ఈ సందర్భంగా శ్రేయ నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంది. గాయనిగా అవకాశం ఇచ్చినందుకు చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీకి ధన్యవాదాలు తెలిపింది. ‘19 సంవత్సరాల క్రితం ఇదే రోజున గాయనిగా నా తొలి చిత్రమైన ‘దేవదాస్‌’ విడుదలైంది. ఈ సినిమా సంగీతానికి సంబంధించిన జ్ఞాపకాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. 16 ఏళ్ల అమ్మాయినైన (ఆ సమయంలో) నన్ను నమ్మి ఆ అవకాశం ఇచ్చిన సంజయ్‌ లీలా భన్సాలీకి, రాత్రనకా పగలనకా నా వెంటే ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకి ధన్యవాదాలు’ అని పేర్కొంది.

2000లో ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన ‘స రె గ మ’ సింగింగ్‌ షోలో పాల్గొని విజేతగా నిలిచిన శ్రేయ చిత్ర పరిశ్రమవైపు అడుగులేసింది. ప్రాంతీయ, జాతీయ అవార్డులు గెలుచుకుంది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు.. ఏ భాషలో పాడినా తనదైన ముద్ర వేసింది. ఎంతోమందికి అభిమాన గాయనిగా మారింది. 19 ఏళ్ల సినీ కెరీర్‌లో శ్రేయ ఆలపించిన కొన్ని తెలుగు గీతాల్ని విందామా...










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని