indian 2: ‘భారతీయుడు-2’.. మూవీ మీకు నచ్చడానికి వాళ్లే కాదు.. నేనూ ఒక కారణమవుతా: సిద్ధార్థ్‌

Siddharth: శంకర్‌, కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇండియన్‌2’ గురించి నటుడు సిద్ధార్థ్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Updated : 12 Oct 2023 15:50 IST

హైదరాబాద్‌: భారతీయ సినిమా పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘భారతీయుడు2’ (indian 2) ఒకటి. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే డబ్బింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సిద్ధార్థ్‌ (Siddharth) మాట్లాడారు. తన పాత్రపై స్పందించారు. కమల్‌హాసన్‌, శంకర్‌, ‘భారతీయుడు’ అనే బ్రాండ్‌ ఇమేజ్‌ ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని, కానీ, సినిమా నచ్చడానికి తానూ ఓ కారణమవుతానని సిద్ధార్థ్‌ ధీమా వ్యక్తం చేశారు.

‘‘చిన్నా’ విజయంతో నాలాంటి నటుడు తమకు కావాలని తెలుగు ప్రేక్షకులు గట్టిగా చెప్పారు. సినిమా విడుదలకు ముందు పరిస్థితులను బట్టి భావోద్వేగానికి గురయ్యా. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులే కాదు, తెలుగు మాట్లాడే ప్రతీ ప్రేక్షకుడు నా చిత్రాన్ని చూడటాన్ని గెలుపుగా భావిస్తా. ‘చిన్నా’ను కొంతమంది థియేటర్‌లో చూశారు. ఇంకొందరు ఓటీటీలో చూస్తారు. మరి కొందరు టీవీలో చూస్తారు. అప్పటివరకూ ఈ మూవీ గురించి మాట్లాడుతూనే ఉంటాను. అలా థియేటర్‌కు వచ్చి చూసి వెళ్లిపోయే సినిమా కాదిది. నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. ఒక నటుడిగా ఇంతకంటే ఎక్కువ చేయలేను. చప్పట్ల కోసం ఈ మూవీ చేయలేదు. ‘మీలో ఒక మార్పు కలగాలి. బాధ రావాలి’ అని చేశా. నా నటనను ఆమోదించారు. 20ఏళ్ల నట జీవితంలో ఇప్పటివరకూ చేయని కథతో ఈ మూవీ చేశా. ఒక నిర్మాత ఇలాంటి సినిమా తీయడం ప్రస్తుతం పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. కానీ, నేను చేశా’’

‘‘రాబోయే 15 నెలల్లో నేను నటించిన నాలుగు ఆసక్తికర సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో డిఫరెంట్‌ జానర్‌ మూవీలు ఉంటాయి. ఒక సినిమాకూ మరొక దానికి సంబంధం ఉండదు. పదేళ్ల తర్వాత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన మూవీ చేశా. మరో నెలరోజుల్లో ఆ వివరాలు ప్రకటిస్తా. దాని తర్వాత ‘ఇండియన్‌2’ వస్తుంది. కమల్‌హాసన్‌-శంకర్‌ కాంబోలో వస్తున్న  మూవీ కావడంతో అందరూ చూడటానికి వస్తారు. అంతేకాదు, ‘భారతీయుడు’ అనే ట్యాగ్‌ కూడా ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పిస్తుంది. అయితే, సినిమా మీకు నచ్చడానికి నేనూ ఒక కారణమవుతానని గర్వంగా చెబుతున్నా. ఇది నా జీవితంలో మర్చిపోలేని మూవీ’’ అని సిద్ధార్థ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని