2KGames: రోజుల వ్యవధిలో మరో కంపెనీ డేటా హ్యాక్‌!

అమెరికన్‌ గేమింగ్ కంపెనీ 2K కూడా హ్యాకింగ్‌కు గురైనట్లు ట్వీట్‌ చేసింది. 2K సపోర్ట్ పేరుతో వచ్చే ఈ-మెయిల్స్‌, వెబ్‌ లింక్‌లను క్లిక్ చేయొద్దని యూజర్లకు సూచించింది.... 

Published : 23 Sep 2022 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్‌ డేటా లక్ష్యంగా సైబర్‌ దాడుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. కొద్దిరోజుల క్రితం పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ సంస్థ లాస్ట్‌పాస్‌ సోర్స్‌కోడ్‌ను హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికన్‌ గేమింగ్ కంపెనీ 2K కూడా హ్యాకింగ్‌కు గురైనట్లు ట్వీట్‌ చేసింది. 2K సపోర్ట్ పేరుతో వచ్చే ఈ-మెయిల్స్‌, వెబ్‌ లింక్‌లను క్లిక్ చేయొద్దని యూజర్లకు సూచించింది. ఒకవేళ యూజర్లు ఎవరైనా 2K సపోర్ట్ పేజ్‌ పేరుతో వచ్చిన లింక్‌లపై క్లిక్ చేసి ఉంటే వెంటనే తమ ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకోవడంతోపాటు, వెబ్‌ బ్రౌజర్లలో సేవ్‌ చేసిన పాస్‌వర్డ్‌లను తొలగించుకోవాలని కోరింది. నకిలీ లింక్‌ను క్లిక్ చేసిన డివైజ్‌లలో యాంటీ వైరస్‌ ఇన్‌స్టాల్ చేయడం, మల్టీ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలని సూచించింది. 

‘‘2K కంపెనీ కస్టమర్లకు సేవలను అందించేందుకు ఉపయోగించే సపోర్ట్ పేజీలో హెల్ప్‌ డెస్క్‌లోని మా వెండర్‌ పేజీలోకి థర్డ్‌-పార్టీ వ్యక్తులు చొరబడ్డారు. అందులోని సమాచారం ఆధారంగా కొంత మంది యూజర్లకు నకిలీ ఈ-మెయిల్స్‌ పంపారు. వాటిని ఎవరూ క్లిక్ చేయొద్దని కోరుతున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమించాలి. త్వరలోనే సమస్యను పరిష్కరించి సమాచారాన్ని మీకు తెలియజేస్తాం’’ అని ట్వీట్‌లో పేర్కొంది. కొద్దిరోజులుగా రాక్‌స్టార్‌ గేమ్స్‌కు చెందిన సర్వర్లలోకి చొరబడిన హ్యాకర్స్‌ గ్రాండ్ థెఫ్ట్‌ ఆటో 6 గేమ్‌కు సంబంధించిన 90 వీడియోలను లీక్ చేశారు. వరుసగా గేమింగ్ కంపెనీలపై జరుగుతున్న సైబర్‌ దాడుల నేపథ్యంలో గేమర్లు తమ డేటా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని