Behavioral Problems: మీ పిల్లల్లో కూడా ఇలాంటి సమస్యలున్నాయా?

ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి ప్రశ్నలతో తమ వద్దకొస్తున్నట్లు చైల్డ్‌ సైకాలజిస్టులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువ శాతం సమస్యలకు తల్లిదండ్రులే స్వయంగా చెక్‌ పెట్టచ్చంటున్నారు. ఈ క్రమంలో పిల్లల ప్రవర్తనలో తరచుగా వచ్చే సమస్యలు....

Published : 08 Apr 2023 19:58 IST

‘మా పాప పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వదు. వాళ్లు మాట్లాడుతుంటే కనీసం వారి వంక కూడా చూడదు’..

‘మా బాబు ఎక్కడ నేర్చుకున్నాడో కానీ.. అసభ్యకరమైన పదాలు తరచుగా మాట్లాడుతున్నాడు. మేము అలాంటి పదాలను ఇంట్లో కూడా వాడం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు’..

‘మా పాప ఎప్పుడూ బద్ధకంగా ఉంటోంది. హోంవర్క్‌ చేయదు. ఏ పని మీదా ఆసక్తి చూపదు. మార్కులు కూడా తక్కువగా వస్తున్నాయి. గట్టిగా చెబితే ఏడుస్తోంది’..

ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి ప్రశ్నలతో తమ వద్దకొస్తున్నట్లు చైల్డ్‌ సైకాలజిస్టులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువ శాతం సమస్యలకు తల్లిదండ్రులే స్వయంగా చెక్‌ పెట్టచ్చంటున్నారు. ఈ క్రమంలో పిల్లల ప్రవర్తనలో తరచుగా వచ్చే సమస్యలు ఏంటి? వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గాలేంటో తెలుసుకుందాం రండి...

పట్టించుకోవడం లేదా..?

ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లల్ని పలకరించడం మామూలే. కొంతమంది పిల్లలు వాళ్లు అడిగే కుశల ప్రశ్నలకు ఠక్కున సమాధానాలు ఇస్తుంటారు. కానీ, కొంతమంది ఎంత మాట్లాడినా వారి వంక కూడా చూడరు. ఇంకొంతమంది పిల్లలు ‘మీకెందుకు, నేను చెప్పను’ అన్నట్లు వారిని తీసి పారేసినంత పని చేస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన మంచిది కాదంటున్నారు నిపుణులు. మీ పిల్లలు కూడా వచ్చిన అతిథులతో సరిగా మాట్లాడకపోవడం, అనుచిత పదాలు ఉపయోగించడం చేస్తుంటే దానిని మొదటి నుంచే అదుపులో పెట్టాలి. లేకపోతే, వయసు పెరిగే కొద్దీ కొంతమంది పిల్లలు ఈ విషయంలో మొండిగా తయారవుతారు. అప్పుడు వారిని మార్చడం మరింత కష్టమవుతుంది. ఈ క్రమంలో- అతిథులతో ఎలా మాట్లాడాలో చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. మంచిగా ప్రవర్తించినప్పుడు వారిని అభినందించాలి. దాంతో వారిలో కొద్ది కొద్దిగా మార్పు వస్తుంటుంది. ఈ రోజుల్లో పిల్లలు టీవీ కార్యక్రమాలు, యూట్యూబ్‌ వీడియోలకు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. వాటి వల్ల కూడా పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. కాబట్టి, మీ పిల్లలు చూసే కార్యక్రమాలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది.

అబద్ధాలు చెబుతున్నారా?

కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధాలు చెబుతుంటారు. ఇది తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంటుంది. తాము చేసే పనుల గురించి తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ తిడతారోనన్న భయం కూడా పిల్లల్లో ఈ అలవాటుకి కారణం అవ్వచ్చు. ఈ సమస్య సాధారణమే అయినప్పటికీ తల్లిదండ్రులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని తిట్టకుండా దాని వల్ల కలిగే సమస్యల గురించి వివరించాలి. ఇలా చేయడం వల్ల వారు నిజాలు చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు చేసే మంచి పనులను ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏది మంచి? ఏది చెడు? అన్న విషయాలు వారికి తెలుస్తుంటాయి. అలాగే అబద్ధాలు చెప్పడం వల్ల వచ్చే నష్టాల గురించి వారికి నిత్యం వివరించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఫోన్‌లో, ఇతరులతో మాట్లాడేటప్పుడు పిల్లల ముందే అబద్ధాలు చెబుతుంటారు. దానివల్ల కూడా పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది.

బూతులు మాట్లాడుతున్నారా?

కొంతమంది పిల్లలు కోపం వచ్చినప్పుడు, తమకు ఇష్టమైన వస్తువుని ఇవ్వనప్పుడు.. తల్లిదండ్రుల మీద అరుస్తుంటారు. మరికొంతమందైతే బూతులు మాట్లాడుతుంటారు. వారు ఎక్కడో విన్న పదాలను కోపంలో ఇలాంటి సందర్భాల్లో బయటకు వదులుతుంటారు. చాలామందికి వాటి అర్థాలు కూడా తెలియవు. అయితే మీ పిల్లల్లో కూడా ఇలాంటి అలవాటు ఉంటే తక్షణమే అప్రమత్తం కావాలి. ఇవి వయసుతో పాటు మరింతగా పెరుగుతుంటాయి. కాబట్టి, మొదట్లోనే వారికి సరైన అవగాహన కల్పించాలి. ముందుగా ఏదైనా బూతు పదం మాట్లాడిన వెంటనే దాన్ని ఉపయోగించద్దని చెప్పాలి. అలాగే అలాంటి పదాలను వాడడం వల్ల వచ్చే నష్టాల గురించి వివరించాలి. పిల్లలకు అనుకరించే అలవాటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీరు కూడా వారి ముందు ఎలాంటి అసభ్యకరమైన పదాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అలాంటి మాటలు అనుకోకుండా వచ్చినప్పుడు వెంటనే ‘సారీ’ చెప్పాలి. ఆ పద్ధతినే పిల్లలకు అలవాటు చేస్తుండాలి.

బద్ధకిస్తున్నారా?

ఈ రోజుల్లో చాలామంది పిల్లలు వివిధ కారణాల వల్ల ఆటలకు దూరమవుతున్నారు. దీనివల్ల బద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మరికొంతమందికి స్వతహాగానే బద్ధకించే గుణం ఉంటుంది. ఈ లక్షణం వల్ల సరిగా హోంవర్క్‌ చేయక చదువులో వెనకబడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో వెంటనే మార్పు తీసుకురావడం కష్టం. వారిని నెమ్మదిగా మోటివేట్‌ చేస్తుండాలి. ఇందుకోసం మీ జీవితంలో చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలనే వారికి పాఠాలుగా చెప్పే ప్రయత్నం చేయండి. అవి వారిలో స్ఫూర్తి నింపే అవకాశం ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు బద్ధకిస్తున్నారని వారికి ఏదో ఒక హాబీని బలవంతంగా అలవాటు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. దానికి బదులుగా వారికే కొంత సమయమిచ్చి నచ్చిన హాబీని ఎంచుకోమని ప్రోత్సహించండి. తద్వారా వారిలో క్రమంగా మార్పు వస్తుంది.

దానిని ఆదిలోనే తుంచేయాలి...

కొంతమంది పిల్లలు తమ తోటి స్నేహితులను శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటారు. వారిలోని శారీరక, మానసిక లోపాలను ఎత్తి చూపుతూ తమను తాము తెలివైన వారిగా చిత్రీకరించుకుంటారు. ఈ క్రమంలో- మీ పిల్లలు వేధించినా, వేధింపులకు గురైనా రెండూ వారి భవిష్యత్తుకు మంచిది కాదు. కాబట్టి, ఆది నుంచి వారికి దీనిపై అవగాహన కల్పించాలి. ఇతరుల లోపాలను ఎత్తి చూపుతూ వేధించడం వల్ల కలిగే నష్టాలను సోదాహరణగా వివరించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని