జాన్వీ ‘క్రికెట్‌ బాల్‌’ డ్రస్.. అందుకే వైరల్!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని తమ ఇంట్లో అమ్మాయిలా పరిగణిస్తుంటారు చాలామంది. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయమైనా, సినిమా అప్‌డేట్‌ అయినా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతెందుకు.. ఈ బ్యూటీ పాటించే ఫ్యాషన్‌ ట్రెండ్స్ని ఫాలో అయ్యేవారూ చాలామందే!

Published : 11 May 2024 13:03 IST

(Photos: Instagram)

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని తమ ఇంట్లో అమ్మాయిలా పరిగణిస్తుంటారు చాలామంది. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయమైనా, సినిమా అప్‌డేట్‌ అయినా తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతెందుకు.. ఈ బ్యూటీ పాటించే ఫ్యాషన్‌ ట్రెండ్స్ని ఫాలో అయ్యేవారూ చాలామందే! అది పార్టీ అయినా, వేడుకైనా, సినిమా ప్రమోషన్లైనా.. సందర్భానికి తగినట్లుగా కొత్త కొత్త ఫ్యాషన్లను ఎంచుకోవడంలో జాన్వీ ముందుంటుంది. తాజాగా తన చిత్ర ప్రమోషన్‌ కోసం అలాంటి ఓ సరికొత్త డ్రస్‌నే ఎంచుకుందీ బాలీవుడ్‌ భామ. అదే ‘క్రికెట్‌ బాల్‌ డ్రస్‌’! ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ధరించిన ఈ డ్రస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలీవుడ్‌ నటీనటులు జాన్వీ కపూర్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ కలిసి నటించిన సినిమా ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’. క్రికెట్‌ లెజెండ్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇందులో ధోనీ క్రికెట్‌ కెరీర్‌ మినహాయించి.. ఆయన వ్యక్తిగత జీవితం, లవ్‌ లైఫ్‌ని ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు శరణ్‌ శర్మ. మే 31న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నారు జాన్వీ, రాజ్‌కుమార్‌ రావ్.

లెదర్‌ డ్రస్‌.. ప్రత్యేకతలెన్నో!

ఇక సాధారణంగానే తన ఫ్యాషన్లతో కట్టిపడేసే జాన్వీ.. ఈ సినిమా ప్రమోషన్ల కోసం విభిన్న దుస్తుల్ని ఎంచుకుంటూ తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌ని చాటుకుంటోంది. అలా తాజాగా ఈ సినిమా థీమ్‌కి తగినట్లుగా ఓ ట్రెండీ డ్రస్‌ని ధరించి.. వైవిధ్యంగా తన చిత్రాన్ని ప్రమోట్‌ చేసుకుందీ భామ. ఈ క్రమంలో జాన్వీ ధరించిన ఎరుపు రంగు లెదర్‌ బాడీకాన్‌ డ్రస్కు ఇరువైపులా కటౌట్స్‌తో హంగులద్దారు. హాల్టర్‌ నెక్‌లైన్‌తో కూడిన ఈ డ్రస్‌కు నడుం భాగంలో స్టిచింగ్‌ బయటికి కనిపించేలా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ డ్రస్‌ అసలు కథంతా వెనుక భాగంలోనే ఉందని చెప్పచ్చు. క్రికెట్‌ నేపథ్యానికి తగినట్లుగా వెన్నెముకపై నిటారుగా ఉన్న ఫ్యాబ్రిక్‌ స్ట్రిప్‌పై సమాన దూరాల్లో చిన్న చిన్న క్రికెట్‌ బాల్స్ లాగా డిజైన్ చేశారు. ప్రముఖ డిజైనర్‌ సూర్య సర్కార్‌ రూపొందించిన ఈ అవుట్‌ఫిట్‌లో జాన్వీ సూపర్‌ క్యూట్‌గా మెరిసిపోయింది.

ప్రస్తుతం ఈ క్రికెట్‌ బాల్‌ డ్రస్‌ ఫొటోలు.. రాజ్‌కుమార్‌ రావ్ దీనిని సరదాగా చూపిస్తూ.. ఇద్దరూ కలిసి సందడి చేసిన వీడియోలూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ‘జాన్వీనా మజాకానా.. అమేజింగ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

‘మహీ’ జెర్సీలో!

ఇలా ఇప్పుడే కాదు.. ఇటీవలే ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌కి హాజరైన జాన్వీ.. ‘మహీ’ పేరున్న జెర్సీని ధరించి.. ఆ ఫొటోలు, తాను మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న వీడియోల్ని ఇన్‌స్టాలో పంచుకుంది. దాంతో అవి కూడా వైరల్‌గా మారాయి. ఇలా సినిమా పరంగానే కాదు.. నిజ జీవితంలోనూ తాను ధోనీకి వీరాభిమానినంటూ చెప్పకనే చెప్పిందీ కపూర్‌ బ్యూటీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్