ఒకే యాత్రలో మూడింటి దర్శనభాగ్యం!

‘నమామి దేవి నర్మదే!’ - మన దేశంలోని 12 పుణ్య నదుల్లో నర్మదా నది ఒకటి. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలతో ఈ నదీ పరీవాహక ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంటుంది. ఆ పుష్కర ఏడాది మళ్లీ వచ్చేసింది. ఇటీవలే ప్రారంభమైన ఈ నదీ పుష్కరాల్లోనూ దేశం నలుమూలల నుంచీ భక్తకోటి పోటెత్తుతోంది.

Published : 11 May 2024 13:03 IST

‘నమామి దేవి నర్మదే!’ - మన దేశంలోని 12 పుణ్య నదుల్లో నర్మదా నది ఒకటి. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలతో ఈ నదీ పరీవాహక ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంటుంది. ఆ పుష్కర ఏడాది మళ్లీ వచ్చేసింది. ఇటీవలే ప్రారంభమైన ఈ నదీ పుష్కరాల్లోనూ దేశం నలుమూలల నుంచీ భక్తకోటి పోటెత్తుతోంది. మధ్యప్రదేశ్‌లోని వింధ్యాచల పర్వతాల్లో పుట్టిన ఈ నదిని ఇటీవలే దర్శించుకున్నారు హైదరాబాద్‌కు చెందిన ట్రావెల్‌ లవర్‌ శేషరత్నం. ఈ నదీ యాత్ర విశేషాలతో పాటు అక్కడి జ్యోతిర్లింగ, శక్తిపీఠాల దర్శనభాగ్యం కూడా తమకు కలిగిందంటూ తమ తీర్థయాత్ర విశేషాల్ని ‘వసుంధర.నెట్- ట్రావెల్ డైరీస్’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. వాటి గురించి ఆమె మాటల్లోనే విందాం రండి..

పుష్కర స్నానం, జ్యోతిర్లింగ దర్శనం, శక్తిపీఠ సందర్శనం.. ఒకే యాత్రలో ఈ మూడింటి దర్శనభాగ్యం కలగడమంటే అదృష్టమనే చెప్పాలి. ఇటీవలే ఈ అదృష్టం మాకు దక్కింది. మా స్నేహితులతో చేసిన మూడు రోజుల తీర్థయాత్రలో భాగంగా ఎన్నో మధురానుభూతులు మా సొంతమయ్యాయి. తొలి రోజున మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి మా యాత్ర మొదలైంది. ఉదయం ఏడింటికి కార్లో ఓంకారేశ్వర్‌కి బయల్దేరాం. ఇండోర్‌ నుంచి సుమారు 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ జ్యోతిర్లింగం. రెండు కొండల మధ్య ప్రవహించే నర్మదా నది, ఈ నదీ తీరాన కొలువైన ఓంకారేశ్వర క్షేత్రాన్ని పైనుంచి చూస్తే ‘ఓం’ ఆకృతిలో కనిపిస్తుంది.

నర్మదా నదికి ఉత్తరాన ఓంకారేశ్వర్‌, దక్షిణాన మమలేశ్వర ఆలయాలుంటాయి. ఈ రెండింటినీ కలిపి ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది నాలుగోది. ముందుగా నర్మదా నదిలో స్నానమాచరించి.. మమలేశ్వరంలో కొలువైన శివుడిని దర్శించుకున్నాం. ఆపై నర్మదా నదిలో పడవ ప్రయాణం చేసి అవతలి ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర ఆలయానికి చేరుకున్నాం. అప్పటికే ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. దాంతో ప్రత్యేక దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నాం. సాధారణ సమయాల్లోనే ఈ జ్యోతిర్లింగ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువ! అలాంటిది పుష్కరాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే ఈ జనసందోహాన్ని మేం ముందుగానే ఊహించి అందుకు తగినట్లుగా దర్శన ఏర్పాట్లు, ఉండడానికి హోటల్‌ బుకింగ్స్‌ అన్నీ చేసుకున్నాం కాబట్టి ఇబ్బందేమీ అనిపించలేదు. ఓంకారేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాక.. అక్కడే భోజనం చేసి మహేశ్వరం చేరుకున్నాం. అక్కడి శివుడినీ దర్శించుకొని ఆ రోజు రాత్రి అక్కడి నర్మద రిసార్ట్‌లో బస చేశాం. ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ అంటారు కదా.. ఈ రిసార్ట్‌ని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పురాతనమైనదే అయినా.. చవక ధరల్లోనే చక్కటి ఆతిథ్యాన్ని, ఆధునిక వసతి సదుపాయాల్ని మాకు అందించింది.

మరుసటి రోజు ఉదయం నర్మదా నది ఒడ్డు నుంచి సూర్యోదయాన్ని తిలకించడం మరో అద్భుతం! కొండల మధ్యలో నుంచి మేఘాలను చీల్చుకుంటూ వచ్చే బాలభానుడు తన నులివెచ్చటి సూర్యకిరణాలతో మమ్మల్ని పలకరించినట్లుగా అనిపించిన ఆ క్షణం నన్ను నేనే మర్చిపోయా. ఇక ఆపై పడవ ప్రయాణం చేస్తూ అహల్యాబాయి ఘాట్‌కు చేరుకున్నాం. అక్కడి అందాల్ని ఫొటోల్లో బంధించిన అనంతరం అదే పడవలో ‘సహస్రధార’ అనే ప్రదేశానికి చేరుకున్నాం. కార్త్యవీర్యార్జునుడు తన వెయ్యి చేతులతో నర్మదా నది ప్రవాహాన్ని కట్టడి చేసినప్పుడు అతడి వేళ్ల సందుల నుంచి ఈ నది ప్రవహించినట్లు, తద్వారా ఈ స్థలానికి సహస్రధారగా పేరొచ్చినట్లు చెబుతారు. ఇక్కడి అద్భుతమైన జలపాతాలు, పచ్చటి ప్రకృతి మమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్లాయి. మా స్నేహితులతో కలిసి ఇక్కడే కాసేపు సరదాగా గడిపి.. మరికాసేపు ధ్యానం చేసుకొని.. ఈ మధురానుభూతులన్నీ ఫొటోలు, వీడియోల్లో బంధించి తిరిగి పడవ ప్రయాణం ప్రారంభించాం. ఈ క్రమంలోనే నది మధ్యలో ఉన్న శివాలయాన్ని సందర్శించుకున్నాం. అక్కడ్నుంచి నర్మదా ఘాట్‌కు చేరుకున్నాం.

బాహుబలి సినిమాలో దర్శకుడు రాజమౌళి చూపించిన మాహిష్మతి రాజ్యం కల్పితం కాదు.. ప్రస్తుతం మహేశ్వరంగా పిలుస్తోన్న ఈ ప్రాంతమే గతంలో మాహిష్మతి రాజ్యంగా విలసిల్లింది.. కార్త్యవీర్యార్జునుడు పరిపాలించిన హైహయ దేశ రాజధాని ఇది.. అని చెబుతారు.  ప్రస్తుతం మహేశ్వరంగా పిలుస్తోన్న ఈ ప్రాంతంలో కొలువైందే ఈ నర్మదా ఘాట్‌. ఇక్కడి ఘాట్‌లన్నింటిలోకెల్లా ఇది ప్రత్యేకమైంది. ఎందుకంటే రాత్రుళ్లు గంగామాత తనను తాను శుద్ధి చేసుకోవడానికి నల్ల ఆవు రూపంలో ఇక్కడికి వచ్చి, ఈ నదిలో స్నానమాచరిస్తుందని చెబుతారు. అహల్యాబాయి కోట, కాశీ విశ్వేశ్వరాలయం తదితర ప్రసిద్ధ ఆలయాల్ని దర్శించుకున్నాక నర్మదా బాణలింగాన్ని కొనుక్కొని తిరిగి మా ప్రయాణాన్ని కొనసాగించాం. మెరిసే స్పటికంలా ఉండే ఈ బాణలింగాలు ఎక్కువగా నర్మదా నదీ పరీవాహక ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. మట్టి, స్పటికం, బంగారం, వెండి.. వంటి వాటితో తయారుచేసిన శివలింగాల్ని పూజించడం వల్ల కలిగే పుణ్యం.. ఒక్క నర్మదా నది బాణలింగాన్ని పూజించడం వల్ల లభిస్తుందని, సకల శుభాలు, సుఖసంతోషాలు కలుగుతాయని పురాణగాథలు చెబుతున్నాయి. ఇక అక్కడ్నుంచి మాండు చేరుకొని ఇక్కడి రేవా కుండ్‌, జహజమహల్‌, ఇతర చరిత్రాత్మక కోటల్ని దర్శించుకొని ఉజ్జయిని చేరుకున్నాం.

జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చోట కొలువై ఉన్న ప్రాంతాల్లో ఉజ్జయిని ఒకటి. ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనమయ్యాక.. మహాకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. శక్తిపీఠాల్లో ఇది తొమ్మిదోది. ఇక్కడ సతీదేవి పైపెదవి పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ ఆలయంలో కొలువైన అమ్మవారిని, గణపతిని, శివుడిని దర్శించుకొన్నాం. ఇక మరుసటి రోజు ఉదయం నాలుగ్గంటలకు ప్రారంభమైన భస్మహారతిని దర్శించుకొని, ఆపై స్వామివారిని కళ్లారా దర్శించుకోవడంతో మనసు ఆనందంతో పులకించిపోయింది. ఈ ఆలయంలో భక్తులకు డ్రస్‌కోడ్ ఉంది. ఆడవాళ్లు చీర లేదా చుడీదార్‌, మగవాళ్లు పంచెకట్టులోనే ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఈ ఆలయ సందర్శనం పూర్తయ్యాక ఇక్కడికి దగ్గర్లోని కాలభైరవ ఆలయం, సందీప ఆశ్రమం దర్శించుకున్నాం. 64 కళల గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూసుండరు చాలామంది. కానీ సందీపాశ్రమంలో ఈ అవకాశం దొరుకుతుంది. ఇక్కడ బొమ్మల సహాయంతో 64 కళల గురించి చక్కగా వివరిస్తారు. ఆపై ఉజ్జయిని నుంచి నేరుగా ఇండోర్‌ చేరుకొని.. అక్కడి చెప్పన్‌ బజార్‌తో పాటు ఇతర గణపతి మందిరాలు దర్శించుకోవడంతో మా యాత్ర సంపూర్ణమైంది. ఇలా ఈ మూడు రోజుల తీర్థయాత్ర.. ఏడేడు జన్మలకు సరిపడా మధురానుభూతుల్ని, పుణ్యఫలాన్ని అందించింది.
- శేషరత్నం, హైదరాబాద్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్