అక్కడ ఛాంపియన్లని తయారుచేస్తారు!

చదువుతో తమ జీవితాల్ని మార్చుకునే వారు కొందరైతే, ఆ చదువుల జ్ఞానంతో ఇతరుల జీవితాల్నీ మార్చేవారు ఇంకొందరు. ఆ రెండో కోవకే చెందుతారు ప్రియా నాద్‌కర్ణి. ‘రివర్‌సైడ్‌ నేచురల్‌ స్కూల్‌’ ప్రారంభించి వందల మంది విద్యార్థుల కలల్ని నిజం చేస్తోన్న ప్రియా ప్రయాణమిది...

Published : 29 Apr 2024 02:27 IST

చదువుతో తమ జీవితాల్ని మార్చుకునే వారు కొందరైతే, ఆ చదువుల జ్ఞానంతో ఇతరుల జీవితాల్నీ మార్చేవారు ఇంకొందరు. ఆ రెండో కోవకే చెందుతారు ప్రియా నాద్‌కర్ణి. ‘రివర్‌సైడ్‌ నేచురల్‌ స్కూల్‌’ ప్రారంభించి వందల మంది విద్యార్థుల కలల్ని నిజం చేస్తోన్న ప్రియా ప్రయాణమిది...

ది మధ్యప్రదేశ్‌ మాండ్లా జిల్లాలో జబల్‌పుర్‌కి దగ్గర్లోని ఓ మారుమూల గిరిజన పల్లె. పిల్లలు చదువుకునేందుకు సరైన వసతులు లేని ఊరు అది. టెక్నాలజీ వాడకమూ అక్కడ ఉన్న వారికి అంతగా తెలిసేది కాదు. నైపుణ్యం గల టీచర్లు లేకపోవడంతోపాటు పోషకాహార లోపం లాంటి సవాళ్లు  చదువుల పరంగా పిల్లలు ముందుకు వెళ్లలేకపోవడానికి కారణం. విద్యావ్యవస్థ మీద నమ్మకం లేని అక్కడి ప్రజలు హైస్కూల్‌ తర్వాత వారి పిల్లల్ని ఇంటికే పరిమితం చేసేవారు. అబ్బాయిలతో పొలం పనులు చేయిస్తే, అమ్మాయిలకేమో పెళ్లి చేసేవారు. ఈ ఆలోచనా విధానాన్నే మార్చాలనుకున్నారు ప్రియా...

జర్నలిస్ట్‌ నుంచి బ్యాంకర్‌గా...

ముంబైలో పుట్టి పెరిగిన ప్రియా ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ఆ తర్వాత చెన్నైలో జర్నలిజం చదివి, రెండేళ్లు ఫైనాన్స్‌ జర్నలిస్ట్‌గా పనిచేశారు. అప్పుడే ఆమెకు ఆర్థిక రంగంపై ఆసక్తి ఏర్పడి, ఐఎస్‌బీ హైదరాబాద్‌లో ఎంబీఏ చేశారు. యూనిటస్‌ క్యాపిటల్‌లో మూడున్నరేళ్లు పనిచేశాక గ్రామీణ స్థాయిలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రభుత్వ సమన్వయంతో పనిచేసే ప్రదాన్‌ (ప్రొఫెషనల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ యాక్షన్‌)లో చేరారు. అప్పుడే తనకు అదే ప్రాజెక్టులో పనిచేసే దిగ్విజయ్‌ సింగ్‌ పరిచయమయ్యారు. ప్రాజెక్టులో భాగంగా మాండ్లా జిల్లాలోని గిరిజన యువతకు శిక్షణ ఇచ్చేందుకు వెళ్లారు. అప్పుడే అక్కడ విద్యార్థుల్లో నైపుణ్య లేమిని గుర్తించిన ప్రియా, స్నేహితుడు దిగ్విజయ్‌తో కలిసి 2016లో రివర్‌సైడ్‌ నేచురల్‌ స్కూల్‌ ప్రారంభించారు. చదువుతోపాటు అన్నిరంగాల్లో రాణించాలని ఫుట్‌బాల్‌, సాగు, టెక్నాలజీ వంటి వాటిలోనూ వారికి శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు టెక్నాలజీ అందిపుచ్చుకోవడం కోసం కోర్స్‌ఎరా లాంటి అనేక ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల సాయంతో పైతాన్‌, జావా, ఏఐ టూల్స్‌ వంటి ప్రోగ్రామింగ్‌ కోర్సులనూ ప్రవేశపెట్టారు. ఈ స్కూల్లోని బాలికల అండర్‌-17 బృందం స్టేట్‌ ఛాంపియన్‌గానూ రెండుసార్లు నిలిచింది. ప్రస్తుతం వీళ్లు దిల్లీలోని అండర్‌-17 ఖేలో ఇండియాలోనూ సత్తా చాటుతున్నారు. 30మంది విద్యార్థులతో మొదలైన ఈ స్కూల్లో ప్రస్తుతం 300మంది ఉన్నారు. జొమాటోతో అనుసంధానమై హాస్టల్‌ విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారు. పేద విద్యార్థులకైతే ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మెరిట్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లూ అందజేస్తున్నారు. మిగిలిన వారికీ నామమాత్రపు ఫీజులు ఉంటాయి. త్వరగా సంపాదన మొదలుపెట్టాలనుకునే వారికి జోహోలో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలూ కల్పిస్తున్నారు. ‘‘మా విద్యార్థుల్లో 80శాతం మంది రాబోయే రోజుల్లో ఉద్యోగులుగానో, లేక వ్యాపారవేత్తలుగానో స్థిరపడాలనేది మా లక్ష్యం’’ అంటోంది ప్రియా. .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్