స్టైల్‌గా... సురక్షితంగా

ఎండ వేడికి మనలోని శక్తినంతా సూర్యుడు స్ట్రా వేసుకొని తాగేస్తున్నట్లు అనిపిస్తోంది కదా! ఇక అందం మాట సరేసరి. పొరపాటున సన్‌స్క్రీన్‌ రాయడం మర్చిపోయామో చర్మానికి కలిగే హానీ అంతా ఇంతా కాదు.

Published : 10 May 2024 13:52 IST

సమ్మర్‌ స్టైల్‌

ఎండ వేడికి మనలోని శక్తినంతా సూర్యుడు స్ట్రా వేసుకొని తాగేస్తున్నట్లు అనిపిస్తోంది కదా! ఇక అందం మాట సరేసరి. పొరపాటున సన్‌స్క్రీన్‌ రాయడం మర్చిపోయామో చర్మానికి కలిగే హానీ అంతా ఇంతా కాదు. అందుకే తగిన రక్షణ తప్పనిసరి. కాలమేదైనా స్టైల్‌కే మన ఓటు కదా. ఓవైపు ట్రెండీగా కనిపిస్తూనే ఎండ నుంచి కాపాడేలా కావాలా... ఈ టోపీలు ప్రయత్నించేయండి మరి.


దుస్తులేవైనా... సరే

క్యాప్‌లూ, హ్యాట్‌లూ మన దృష్టిలో ఫ్యాషన్‌ యాక్సెసరీలే! మరి దుస్తులతో సరితూగకపోతే మనకు బెంగేయదూ? అలాగని వీటినీ డ్రెస్సుకో రకం అని కొనిపెట్టుకోలేం. మరెలా అంటే... లేత వర్ణాలవి ఎంచుకోండి.

ముదురు రంగులే కావాలంటే నలుపు, నీలానికి ఓటేస్తే సరి. నిజానికి క్రౌన్‌, వైడ్‌ బ్రిమ్‌, లాంగ్‌ బ్రిమ్‌ టోపీలు... ఏ దుస్తులకైనా చక్కగా నప్పుతాయి అంటారు ఫ్యాషనిస్టులు. పైగా చిన్నపాటి బెల్ట్‌, క్లాత్‌ స్కార్ఫ్‌, నాణేలు, పూసలనీ జతచేస్తున్నారు. అవీ అందాన్ని పెంచేవే!


మడత పెట్టేయొచ్చు...

హెయిర్‌ లీవింగ్‌... జుట్టు పొట్టిదైనా, కాస్త పొడవుదైనా ఇట్టే నప్పేస్తుంది. కాస్త ట్రెండీగా కనిపించాలంటే ‘పోనీ’ ఎలాగూ ఉంది. ఇలాంటప్పుడు టోపీ పెడితే జుట్టు అందం చెడదూ? ‘విసర్స్‌’, ‘అడ్జస్టబుల్‌ బేస్‌బాల్‌ క్యాప్స్‌’ వచ్చింది అందుకే మరి.

ఇవైతే ముఖాన్ని ఎండ నుంచి కాపాడటమే కాదు స్టైల్‌నీ చెదరనీయవు. వెనక భాగం కురులను కావాల్సినట్లు అమర్చుకునేలా ఉంటాయి. పైగా వీటిలో చాలావరకూ సులువుగా మడతపెట్టి దాచుకునేవే! కొన్నైతే సన్నగా మడుస్తూ వెళితే చాలు... అందమైన హెడ్‌బ్యాండ్‌లూ అవుతాయి.


మాస్క్‌ జోడిస్తారా?

వేసవిలో వేడితోనే సమస్య కాదు... సన్నగా రేగే దుమ్ముతోనూ శ్వాస సంబంధిత అనారోగ్యాలు చుట్టుముడతాయి. వాటికీ పరిష్కారంగా ఫిషింగ్‌, ఫేస్‌ ప్రొటెక్షన్‌ క్యాప్‌లున్నాయి. బేస్‌బాల్‌ అతుక్కొని మాస్క్‌ లాంటిది వస్తుంది. కొన్ని ముఖం వరకే పరిమితమైతే మరికొన్ని నెక్‌నీ కవర్‌ చేస్తాయి. ఎప్పటికీ ఉంటే ఇబ్బంది అనుకుంటే అవసరమైనప్పుడు పెట్టి, తరవాత తొలగించుకునేవీ ఉన్నాయి.

ఫ్లోరల్‌, జీన్స్‌, మెష్‌, నిట్‌... అంటూ బోలెడు రకాల్లో ఎంచుకోవచ్చు. పర్యావరణంపై ప్రేమ ఉన్నవారికి కాటన్‌, వెదురు, గడ్డితో చేసినవీ ఉన్నాయి. జుట్టు పొడిబారకుండా, చిక్కులు పడకుండానూ తయారీదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీ అవసరానికీ, స్టైల్‌కి సరిపోయేవేవో ఎంచుకోవడమే మీ పని ఇక!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్