Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!

కెరీర్‌, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తుంటారు కొందరు. పలువురు సినీ తారలూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ క్రమంలోనే తమకు కావాలనుకున్నప్పుడు పిల్లల్ని కనేందుకు ముందుగానే అండాల్ని భద్రపరచుకుంటున్నారు. ఎగ్‌ ఫ్రీజింగ్‌/అండ శీతలీకరణగా పిలిచే ఈ పద్ధతికి తానూ సుముఖంగా ఉన్నానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.

Published : 27 Apr 2024 12:57 IST

(Photos: Instagram)

కెరీర్‌, ఇతర కారణాల రీత్యా అమ్మతనాన్ని వాయిదా వేస్తుంటారు కొందరు. పలువురు సినీ తారలూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ క్రమంలోనే తమకు కావాలనుకున్నప్పుడు పిల్లల్ని కనేందుకు ముందుగానే అండాల్ని భద్రపరచుకుంటున్నారు. ఎగ్‌ ఫ్రీజింగ్‌/అండ శీతలీకరణగా పిలిచే ఈ పద్ధతికి తానూ సుముఖంగా ఉన్నానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌. ఇందుకు బాలీవుడ్‌ నటి మోనాసింగ్‌నే స్ఫూర్తిగా తీసుకున్నానంటోంది. గతంలోనూ పలువురు తారలు చిన్న వయసులోనే తమ అండాల్ని శీతలీకరించుకొని.. ఆపై అమ్మతనాన్ని పొందారు. ఈ నేపథ్యంలో ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..!

టీవీ నటిగా పరిచయమై.. సినిమాల్లోకి ప్రవేశించింది మృణాల్‌ ఠాకూర్‌. కెరీర్‌ ఆరంభంలో పలు బాలీవుడ్‌, మరాఠీ సినిమాల్లో నటించిన ఈ భామ.. ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆపై తాను నటించిన ‘సీతారామం’, ‘హాయ్‌ నాన్న’, ‘ది ఫ్యామిలీ స్టార్‌’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద విజయాల్ని నమోదు చేశాయి. ప్రస్తుతం ‘పూజా మేరీ జాన్‌’ అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోందీ భామ.

అర్థం చేసుకునే వాడు దొరకాలి!

వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే మహిళలకు వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ కాస్త కష్టమే! అయితే ఈ రెండింటినీ సమతులం చేసుకోవాలంటే కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి సపోర్ట్‌ ఎంతగానో అవసరమంటోంది మృణాల్‌. ఇటీవలే ఓ సందర్భంలో రిలేషన్‌షిప్స్‌, పెళ్లి, పిల్లలు, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌.. తదితర అంశాలపై తన అభిప్రాయాల్ని పంచుకుందీ ముద్దుగుమ్మ.
‘చాలామంది మహిళలు ఇటు ఇంటిని, అటు కెరీర్‌ని బ్యాలన్స్‌ చేసుకోలేక సతమతమవుతుంటారు. కానీ ఈ రెండింటినీ సమతులం చేసుకున్నప్పుడే సానుకూలంగా ముందుకు సాగగలం. ఇందుకు కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి సపోర్ట్‌ ఎంతో అవసరం. అయితే అనుబంధాలు ఎంత కఠినంగా ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. అందుకే మనల్ని అర్థం చేసుకొని, మన వృత్తికి గౌరవమిచ్చే వాడు దొరికినప్పుడే సంతోషంగా ఉండగలం. ఇక పెళ్లి చేసుకొని, పిల్లల్ని కనడమనేది ప్రతి ఒక్కరి విషయంలో తప్పనిసరి! అయితే అందుకు వ్యక్తిగతంగా పూర్తిగా సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. అప్పుడే భార్యగా, తల్లిగా వంద శాతం న్యాయం చేయగలుగుతాం. కాబట్టి సమాజం కోరుకున్నప్పుడు కాకుండా.. మనకు నచ్చినప్పుడే ఈ రెండు విషయాల్లో ముందుకెళ్లడం మంచిదన్నది నా భావన! ఇక ఎగ్‌ ఫ్రీజింగ్‌ విషయానికొస్తే.. నేనూ ఇందుకు సుముఖంగానే ఉన్నా.. భవిష్యత్తులో అవసరమైతే కచ్చితంగా దీని గురించి ఆలోచిస్తా. ఇందుకు నటి మోనా సింగ్‌ నాకు స్ఫూర్తి!’ అంది మృణాల్.

ఈ తారలే స్ఫూర్తి!

అయితే గతంలోనూ కొందరు తారలు తాము తమ అండాల్ని భద్రపరచుకున్నామంటూ బహిరంగంగా పంచుకున్నారు. వారిలో బాలీవుడ్‌ దర్శక నిర్మాత ఏక్తా కపూర్, మాజీ ప్రపంచ సుందరి డయానా హెడెన్‌, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాతో పాటు నటీమణులు మోనా సింగ్‌, రాఖీ సావంత్‌, తనీషా ముఖర్జీ తదితరులున్నారు. ఇలా శీతలీకరించుకున్న అండాలతోనే ఏక్తా, డయానా, ప్రియాంక చోప్రాలు అమ్మతనంలోకి అడుగుపెట్టారు.

అసలేంటీ.. ఎగ్‌ ఫ్రీజింగ్?

మహిళల వయసు పెరిగే కొద్దీ అండాల నిల్వ-నాణ్యత తగ్గిపోతాయి. ఇలాంటి అండాల్లో క్రోమోజోమ్‌ సంబంధిత అసాధారణతలు ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలో పుట్టబోయే పిల్లల్లో అవకరాలు, ఇతర శారీరక/మానసిక లోపాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలాగని అప్పటికప్పుడు పిల్లల్ని కనడానికి కొంతమంది సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. వయసులో ఉన్నప్పుడే నాణ్యమైన అండాల్ని సేకరించి వాటిని శీతలీకరించడమే దీని ముఖ్యోద్దేశం. ఆపై కాస్త ఆలస్యంగా పిల్లల్ని కనాలనుకున్నా మహిళలు తాము దాచుకున్న ఈ ఆరోగ్యకరమైన అండాల్ని ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనివ్వచ్చు.

అయితే ఇందుకోసం ముందుగా మహిళ ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రుతుచక్రం, హార్మోన్ల స్థాయుల్ని వైద్యులు పరిశీలిస్తారు. సాధారణంగా ప్రతి నెల అండాశయం ఒకే అండాన్ని విడుదల చేస్తుంది. అలాగని ఆ ఒక్కటే శీతలీకరిస్తే సక్సెసయ్యే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని చెప్పలేం. అందుకే ఒకటి కంటే ఎక్కువ అండాల్ని శీతలీకరించుకునేందుకు వీలుగా వైద్యులు మహిళలకు హార్మోన్‌ చికిత్స అందిస్తారు. ఇందులో భాగంగా ఇంజెక్షన్లతో అండాశయాలు ఎక్కువ అండాల్ని విడుదల చేసేలా చేస్తారు. ఆపై వాటిని శీతలీకరిస్తారు. ఇలా ఫ్రీజ్‌ చేసిన అండాల్ని తమకు కావాల్సినప్పుడు వినియోగించుకొని గర్భం దాల్చచ్చు.

ఆ చికిత్సల ప్రభావం పడకుండా..!

ఎగ్‌ ఫ్రీజింగ్‌తో మహిళలు కాస్త లేటు వయసులోనైనా అమ్మతనంలోకి అడుగుపెట్టడమే కాదు.. దీనివల్ల భవిష్యత్తులో పిల్లలు పుడతారో, లేదోనన్న భయం (ఫెర్టిలిటీ యాంగ్జైటీ) తగ్గుతుందని.. కావాలనుకున్నప్పుడు ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనివ్వచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ముందుగానే శీతలీకరణ పద్ధతుల్లో అండాల్ని నిల్వ చేసుకోవడం ద్వారా వయసు పైబడే కొద్దీ మహిళల్లో వచ్చే కొన్ని అనారోగ్యాలు, క్యాన్సర్‌-ఎండోమెట్రియోసిస్‌.. వంటి దీర్ఘకాలిక వ్యాధులు, వాటికి తీసుకునే కీమోథెరపీ వంటి చికిత్సల ప్రభావం నిల్వ చేసిన అండాలపై పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో ఆరోగ్యం సహకరించకపోయినా అద్దె గర్భం.. వంటి పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వచ్చు. అయితే ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకునే క్రమంలో ఎగ్‌ ఫ్రీజింగ్‌ పద్ధతిని పాటించాలనుకున్నప్పుడు.. ముందుగా ఆరోగ్య స్థితిని ఓసారి వైద్యుల దగ్గర చెకప్‌ చేయించుకొని ఆ తర్వాత వారు సూచించినట్లుగా ముందుకెళ్లడం మంచిదని గుర్తుపెట్టు కోవాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్