బడిలో నేర్చుకునేదే చదువు కాదు..!

ఏడుగురు తోబుట్టువుల్లో ఒకరామె. పదికూడా చదవలేదు. కాయకష్టం చేయడం తప్ప మరే ఆదాయ మార్గాలూ తెలియవు. అయితేనేం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించింది. నాబార్డ్‌, ప్రదాన్‌.. లాంటి సంస్థలకూ ఎగుమతి చేసింది.

Published : 30 Apr 2024 02:11 IST

ఏడుగురు తోబుట్టువుల్లో ఒకరామె. పదికూడా చదవలేదు. కాయకష్టం చేయడం తప్ప మరే ఆదాయ మార్గాలూ తెలియవు. అయితేనేం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించింది. నాబార్డ్‌, ప్రదాన్‌.. లాంటి సంస్థలకూ ఎగుమతి చేసింది. తను ఎదగడమే కాదు ఊళ్లో ఇతర మహిళలకూ శిక్షణ ఇస్తోంది శకుంతలా దేవి. ఆ ప్రయాణం ఆమె మాటల్లోనే...

డిలో నేర్చుకునేదే చదువు కాదు జీవితమూ ఎన్నో పాఠాలు నేర్పిస్తుందని నా నమ్మకం. మాది ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో కులాబిరా అనే మారుమూల గ్రామం. ఏడుగురం తోబుట్టువులం. చిన్న వయసు నుంచే కష్టపడి పనిచేయడం అలవాటు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతితోనే చదువు మానేయాల్సి వచ్చింది. పెద్దగా చదువు లేకపోయినా నేను మాత్రం పెద్ద పెద్ద కలలు కనేదాన్ని. పందొమ్మిదేళ్లకే నాకు పెళ్లయింది. నా భర్త మేస్త్రీ. ఊళ్ల్లోని మహిళలను సభ్యులుగా చేర్చుకుని, చంపా స్వయం సహాయక మహిళా మండలిని ప్రారంభించాను. అలాగైనా మా కలల్ని సాకారం చేసుకోవచ్చనేది మా ఆలోచన.

అదే అతిపెద్ద మలుపు...

గతేడాది బిర్సా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ ఆహార పదార్థాల తయారీలో శిక్షణ ఇచ్చింది. ఆ కోర్సుకు ఎంపికైన పదిహేను మందిలో నేనూ ఒకదాన్ని. ఆ కార్యక్రమానికి హాజరవడమే నా జీవితంలో ఒక మలుపు. అక్కడ రాగి పిండితో లడ్డూ, బిస్కట్లు, స్నాక్‌ మిక్చర్‌... లాంటి రకరకాల తినుబండారాలు తయారుచేయడం నేర్పించారు. ఆ నైపుణ్యాలతో ఫుడ్‌ ఆంత్రప్రెన్యూర్‌గా మారా. వ్యాపారం ప్రారంభించడానికి ఎటువంటి రుణాలపైనా ఆధారపడకుండా, నేను పొదుపు చేసుకున్న డబ్బునే పెట్టుబడిగా పెట్టా. అలా గుమ్లాలో నా మొదటి స్టాల్‌ను ఏర్పాటుచేశా. ఇదే అతిపెద్ద మైలురాయి. నేను చేసిన రాగి లడ్డూలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. పెట్టిన గంటల వ్యవధిలోనే మొత్తం సరకంతా అమ్ముడయ్యేది. దీనికి మంచి స్పందన రావడంతో నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుందనే నమ్మకాన్ని నాలో మరింత నింపింది. క్రమంగా స్టాల్స్‌ పెట్టే దశ నుంచి ప్రభుత్వ కాంట్రాక్టులూ పొందే అవకాశాలూ వచ్చాయి. ఆ తరవాత అనేక చోట్ల స్టాల్స్‌ ఏర్పాటుచేశాను. అందుకు నా భర్త కూడా సాయం చేసేవారు. పెట్టిన ప్రతిచోటా చాలామంచి స్పందన వచ్చేది. కొద్ది నెలల్లోనే ఝార్ఖండ్‌లోని చాలా జిల్లాలకూ మా ఉత్పత్తులు పంపేదాన్ని. బెంగళూరు వంటి చోట్లా ప్రదర్శించా. నేను దీన్ని కేవలం వ్యాపారంలానే చూడలేదు. మా కమ్యూనిటీ అభివృద్ధికి సాయపడాలన్నదీ నా లక్ష్యం. అందుకే ఇతర మహిళలకూ ఇందులో శిక్షణ ఇచ్చి, వాళ్లూ ఉపాధి పొందేలా చేశా. ఇక మా ఉత్పత్తులు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సునూ పొందడం మరో అతిపెద్ద మైలురాయి. దీంతో మా ఉత్పత్తులకు బ్రాండింగ్‌, ప్రమోషన్‌లాంటివి చేసుకోవడానికి మార్గం ఏర్పడింది. నాబార్డ్‌, ప్రదాన్‌, ప్రాన్‌... వంటి సంస్థలూ మా వినియోగదారులే. రాంచీ, జమ్‌షెడ్‌పుర్‌, వారణాసి వంటి నగరాలకూ వ్యాపారాన్ని విస్తరించా. భవిష్యత్తులో దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించాలన్నదే నా లక్ష్యం. కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చని నేను నమ్ముతాను. అందుకు నా జీవితమే ఉదాహరణ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్