అవగాహనతో రికార్డు కొట్టి...

ఆటోఇమ్యూన్‌ డిసీజెస్‌... మనల్ని రక్షించాల్సిన వ్యాధినిరోధక కణాలే మనపై దాడిచేస్తే వచ్చే వ్యాధులివి. వాటిపై సామాన్యులకు అవగాహన తెస్తూ వైద్యురాలిగా  శెభాష్‌ అనిపించుకుంటున్నారు వేంపల్లెకు చెందిన డాక్టర్‌ ఎన్‌ఆర్‌ స్వాతి సాయి... 

Updated : 01 May 2024 03:56 IST

ఆటోఇమ్యూన్‌ డిసీజెస్‌... మనల్ని రక్షించాల్సిన వ్యాధినిరోధక కణాలే మనపై దాడిచేస్తే వచ్చే వ్యాధులివి. వాటిపై సామాన్యులకు అవగాహన తెస్తూ వైద్యురాలిగా శెభాష్‌ అనిపించుకుంటున్నారు వేంపల్లెకు చెందిన డాక్టర్‌ ఎన్‌ఆర్‌ స్వాతి సాయి... 

మాది కడప. నాన్న వైద్యశాఖలో ప్రభుత్వోద్యోగిగా పనిచేసేవారు. వైద్యవృత్తిపై మమకారంతో... కుటుంబంలో ఒక్కరినైనా వైద్యులుగా చూడాలని తపించేవారాయన. నేనే ఆ కల నెరవేర్చాలని, మెడిసిన్‌ చదివా. కర్నూలు మెడికల్‌ కళాశాలలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఆటోఇమ్యూన్‌ వ్యాధి బారిన పడిన కొన్ని కేసులు చూశా. చాలామంది వ్యాధి ముదిరిన తరవాత రావడం చూసి బాధనిపించింది. అవగాహన ఉంటే ఇలా కాదుగా అనుకున్నా. ఎందుకంటే ఈ వ్యాధులు వైరస్‌వల్లో, బ్యాక్టీరియా వల్లో వచ్చేవి కావు. మనలోని వ్యాధినిరోధకకణాలే మనపై దాడిచేసి ఈ వ్యాధులు రావడానికి కారణమవుతాయి. వేంపల్లె మండలం తాళ్లపల్లె పీహెచ్‌సీలో డాక్టర్‌గా విధులకు హాజరవుతూనే... వీటికి సంబంధించిన లోతైన సమాచారంకోసం వెతికాను.

అంతర్జాలంలోనూ అరకొర సమాచారమే ఉంది. దాంతో పుస్తకాలు చదివీ, సీనియర్ల అనుభవాలను అడిగి తెలుసుకునీ సొంతంగా సమాచారం సేకరించా. తీరిక సమయంలో ఇందుకు సంబంధించి నోట్స్‌ రాసుకున్నా. సామాన్యులకు కూడా అర్థమవ్వాలని నాపేరుతో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రారంభించి... రెండు వారాల్లో 62 ఆటోఇమ్యూన్‌ వ్యాధుల గురించిన వీడియోలు పంచుకున్నా. వీటి ప్రాధాన్యం గుర్తించిన ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ సంస్థలు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందించాయి. ఎంబీబీఎస్‌ చదువుతున్నప్పుడే గ్రామస్థులకు సొరియాసిస్‌, కీళ్లనొప్పులు, రక్తహీనత, థైరాయిడ్‌ వంటివాటిపై అవగాహన కల్పించేదాన్ని. అప్పటి అనుభవం ఈ వీడియోలు చేసేటప్పుడు బాగా ఉపయోగపడింది. ప్రజల నుంచీ చక్కటి స్పందన వస్తోంది. మహిళా దినోత్సవం రోజున డీఎంహెచ్‌వో చేతుల మీదుగా ‘ఉత్తమ వైద్యాధికారిణి’గా అవార్డు తీసుకోవడం గర్వంగా అనిపించింది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా.

 వేల్పూరి వీరగంగాధర శర్మ, పిడుగురాళ్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్