జిరాఫీలతో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారా...?!

వందల ఎకరాల అడవి... అందులో విలాసవంతమైన భవనం...లోపల డైనింగ్‌ టేబుల్‌ మీద కూర్చొని కొందరు బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుంటే, కిటికీలోంచి తమ పొడవాటి మెడను లోపలికి పెట్టి, అతిథులు పెట్టే ఆహారాన్ని ఆరగిస్తుంటాయి అందమైన జిరాఫీలు.

Published : 01 May 2024 02:12 IST

వందల ఎకరాల అడవి... అందులో విలాసవంతమైన భవనం...లోపల డైనింగ్‌ టేబుల్‌ మీద కూర్చొని కొందరు బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుంటే, కిటికీలోంచి తమ పొడవాటి మెడను లోపలికి పెట్టి, అతిథులు పెట్టే ఆహారాన్ని ఆరగిస్తుంటాయి అందమైన జిరాఫీలు. కొన్ని జంటలైతే వాటి మధ్యే పెళ్లి కూడా చేసుకుంటుంటారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా వీటికి సంబంధించిన ఫొటోలే హల్‌చల్‌ చేస్తున్నాయి. అదే కెన్యాలోని ‘జిరాఫీ మ్యానర్‌’. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన విలాసవంతమైన హోటళ్లలో ఇదీ ఒకటి. ప్రత్యేకమైన ఈ సఫారీ వ్యాపారం వెనక ఉన్నది తాన్యా కార్‌ హార్ట్‌లే...

కెన్యా రాజధాని నైరోబీలో పుట్టింది తాన్యా. లండన్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఇంగ్లిష్‌లో డిగ్రీ చదివింది. ‘పబ్లిక్‌ లైఫ్‌ ఇన్‌ కెన్యా’ అనే అంశంపై థీసిస్‌నూ పూర్తిచేసింది. 2001లో మికీ కార్‌ హార్ట్‌లేను పెళ్లి చేసుకుంది. 2009లో ఈ జిరాఫీ మ్యానర్‌ను కొన్నారీ జంట. అయితే, దీన్ని 1932లో సర్‌ డేవిడ్‌ డుంకన్‌ నిర్మించారు. 1970ల్లో జాక్‌, బెట్టీ లెస్లీ దంపతులు దీన్ని సొంతం చేసుకుని, హంటింగ్‌ లాడ్జ్‌గా రీమోడల్‌ చేశారు.

జంతు ప్రేమికులైన వాళ్లు, అంతరించే దశలో ఉన్న రూత్స్‌చైల్డ్‌ జాతి జిరాఫీలను ఎస్టేట్‌కు తీసుకొచ్చి పెంచారు. అప్పటి నుంచి ఇక్కడ ఆ జాతి జిరాఫీలు పెరుగుతూ వచ్చాయి. అయితే తాన్యా చేతుల్లోకి వచ్చాక, ఈ మ్యానర్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. మొత్తం 12 ఎకరాల ప్రైవేటు స్థలంలో విలాసవంతమైన సూట్‌ రూములూ, కెఫే, వెల్‌నెస్‌ సెంటర్లూ, జిమ్‌లను ఏర్పాటుచేసింది. ప్రపంచంలోనే మెరుగైన హోటల్‌గా దీన్ని తీర్చిదిద్దింది. ఈ మ్యానర్‌ చుట్టూ ఉన్న 140 ఎకరాలూ అడవే! హాయిగా ప్రకృతిలో గడపాలనుకునే వాళ్లే కాదు, పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్న కొన్ని జంటల ప్రథమ ఎంపిక ఇదే! ఎంతోమంది సెలెబ్రిటీల ఫేవరెట్‌ స్పాట్‌ కూడా. విల్సన్‌ ఎయిర్‌పోర్టు నుంచి 25నిమిషాల ప్రయాణంతో ఇక్కడకు చేరుకోవచ్చు.

ట్యాక్సీల కోసం వెతుక్కోకుండా తాన్యానే రవాణా సదుపాయమూ కల్పిస్తోంది. బ్రేక్‌ఫాస్ట్‌, సాయంత్రం టీ సమయాల్లో జిరాఫీలకు తినిపించే అవకాశం ఉంటుంది. అందుకు మొలాసెస్‌, గ్రాస్‌ పెల్లెట్స్‌ లాంటివి తీసుకొస్తారు. వాటితో మనం ఎలా మసలుకోవాలో తర్ఫీదు కూడా ఇస్తారు. మరి ఇంకేం మీరూ ఈ జిరాఫీలను ముద్దాడతారా? ఎందుకంటే... జిరాఫీ లాలాజలం యాంటి సెప్టిక్‌ కూడా! కాబట్టి సంకోచించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ అనుభూతులన్నింటినీ పొందాలంటే మాత్రం కనీసం ఆరు నుంచి 12నెలల ముందే బుక్‌చేసుకోవాలి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్