భర్తతో నిత్యం నరకం.. విడాకులిచ్చి వ్యాపారవేత్త అయింది!

‘భర్త ఎలాంటి వాడైనా సర్దుకుపోతూ, రాజీపడుతూ దాంపత్య బంధాన్ని ముందుకు నడిపించచ్చు.. కానీ భార్యను హింసించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాడితో సర్దుకుపోవడమంటే మరింత హింసకు తావివ్వడమే..’ అంటోంది కోల్‌కతాకు చెందిన ఫతేమా బరోదావాలా.

Published : 10 May 2024 12:16 IST

(Photos: Instagram)

‘భర్త ఎలాంటి వాడైనా సర్దుకుపోతూ, రాజీపడుతూ దాంపత్య బంధాన్ని ముందుకు నడిపించచ్చు.. కానీ భార్యను హింసించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాడితో సర్దుకుపోవడమంటే మరింత హింసకు తావివ్వడమే..’ అంటోంది కోల్‌కతాకు చెందిన ఫతేమా బరోదావాలా. ఐదు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో భర్త నుంచి తీవ్ర శారీరక, మానసిక హింసను ఎదుర్కొన్న ఆమె.. రాజీపడుతూ అతడితోనే జీవించాలనుకోలేదు. నిత్య నరకంగా మారుతోన్న ఆ బంధం నుంచి బయటికొచ్చి స్వేచ్ఛగా బతకాలనుకుంది. ఎవరేమనుకున్నా, ఎన్ని సవాళ్లు ఎదురైనా ఒంటరి తల్లిగానే తన బిడ్డను సాకాలనుకుంది. తన జీవితానికంటూ ఓ అర్థం, పరమార్థాన్ని వెతుక్కోవాలనుకుంది. ఈ పాజిటివిటీనే ఆమెను వ్యాపారవేత్తగా ఎదిగేలా చేసింది. తలరాతకు తలవంచకుండా దాన్ని తిరిగి రాసుకొనే సమర్థత మనకుందని నిరూపించిన ఈ సింగిల్‌ మదర్‌ స్ఫూర్తి ప్రయాణం.. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మీకోసం..!

పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అందమైన ఘట్టం. వివాహం తర్వాత తమ జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలంటూ అమ్మాయిలు కలలు కంటుంటారు. ఫతేమా కూడా ఇందుకు మినహాయింపు కాదు. తనకు భర్తగా రాబోయేవాడు రాకుమారుడిలా ఉండాలని, తనను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని కలలు కంది. అనుకున్నట్లుగానే ఆ ఘడియ రానే వచ్చింది. 2019లో పెద్దల అంగీకారంతో తనకు నచ్చిన వ్యక్తిని వివాహమాడిందామె.

నిత్యనరకమే!

పెళ్లి తర్వాత దాదాపు ఏడాది పాటు ఫతేమా జీవితం ఆనందంగా ముందుకు సాగింది. వీళ్ల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఆమె గర్భం కూడా దాల్చింది. ఆ తర్వాతే ఫతేమా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. 2020లో అప్పుడప్పుడే దేశంలో కరోనా విజృంభణ మొదలైంది. దీంతో ఆ సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో తనపై హింస మితిమీరిపోయిందని, తన భర్తతో ఆ ఇంట్లో నిత్యం నరకం చూసేదాన్నని చెబుతోందామె.

‘పెళ్లయ్యాక కొన్నాళ్లు బాగానే ఉన్నాం. ఆ తర్వాతే నా భర్త నిజస్వరూపమేంటో నెమ్మది నెమ్మదిగా నాకు తెలిసింది. శారీరకంగా, మానసికంగా హింసించడమే కాదు.. నేనెవరితోనూ మాట్లాడకుండా అందరితో నాకున్న సంబంధాలు కట్‌ చేసేశాడు.. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే ఉంటూ నన్ను పూర్తిగా నాలుగ్గోడలకే పరిమితం చేశాడు.. ఓ గదిలో బంధించాడు. ఇక నేను గర్భం ధరించాక ఆయన ఆగడాలు మితిమీరిపోయాయి. ఈ నరకంలో నుంచి బయటపడేందుకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితి నాది! ఒక్కోసారి నా కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపుతానని బెదిరించేవాడు. ఐదు నెలల గర్భంతో ఉన్న సమయంలోనే నా గైనకాలజిస్ట్‌, తల్లిదండ్రుల సహాయంతో ఈ నిత్య నరకం నుంచి ఎలాగోలా బయటపడ్డా.. ఊపిరి పీల్చుకున్నా..’ అంటోంది ఫతేమా.

విడాకులూ వద్దన్నాడు!

తన భర్త పెట్టే గృహహింస నుంచి ఎలాగోలా బయటపడి పుట్టింటికి చేరిన ఫతేమా.. ఇకపై తన భర్తతో ఉండాలనుకోలేదు. ఈ ఆలోచనతోనే విడాకుల నోటీసు అతడికి పంపించింది. కానీ అందుకు ఆమె భర్త ఒప్పుకోలేదు.. పైగా పదే పదే తనను మళ్లీ అదే నరకంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడని చెబుతోందామె.

‘ఐదు నెలల గర్భం.. కడుపులో పెరుగుతోన్న బిడ్డ.. ఈ సమయంలో వివాహబంధాన్ని తెంచుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ముందుగానే ఊహించా.. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉండే మహిళల పట్ల ఈ సమాజం దృష్టికోణం ఎలా ఉంటుందో, బిడ్డ పుట్టాక ఒంటరి తల్లిగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో అందరికీ తెలిసిందే.. అయినా సరే వాటన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడ్డా. ఇలా నేను ప్రశాంతంగా ఉంటూనే, నా బిడ్డను ఆహ్లాదకరమైన వాతావరణంలో పెంచాలని నేననుకుంటే.. నా భర్త మాత్రం నాకు విడాకులు ఇవ్వనంటే ఇవ్వనని మొండికేశాడు. తిరిగి తనతో నన్ను తీసుకెళ్తానని బలవంతపెట్టేవాడు. దాంతో సర్దుకుపోమంటూ మా బంధువులు కూడా నాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. భర్త ఎలాంటి వాడైనా సర్దుకుపోతూ, రాజీపడుతూ ముందుకెళ్లచ్చు.. కానీ భార్యను హింసించడమే పనిగా పెట్టుకున్న వాడితో రాజీపడితే.. మరింత హింసించమని అతడికి అనుమతిచ్చినట్లే! అందుకే అతడితో వెళ్లడానికి నిరాకరించా.. ఆపై విడాకుల కోసం పెద్ద పోరాటమే చేశా..’ అంటూ తన జీవితంలోని చేదు సంఘటనల్ని పంచుకుంది ఫతేమా.

వ్యాపారవేత్తగా.. ఒంటరి తల్లిగా!

ఇలా హింసాత్మక వివాహ బంధం నుంచి బయటికొచ్చిన ఫతేమా.. పుట్టింట్లోనే ఉన్నప్పటికీ తన తల్లిదండ్రులపై ఆధారపడకూడదనుకుంది. ఈ ఆలోచనతోనే తనకెంతో ఇష్టమైన బేకింగ్‌పై దృష్టి పెట్టింది. రుచికరమైన కేక్స్‌, పేస్ట్రీలు, కుకీస్‌.. వంటివి తయారుచేసి ఇటు కుటుంబ సభ్యులకు, అటు స్నేహితులకు అందించేది. వాళ్ల నుంచి మంచి స్పందన రావడంతో తన అభిరుచినే వ్యాపార మార్గంగా మలచుకోవాలని నిర్ణయించుకుంది ఫతేమా. ఇదే 2020లో కోల్‌కతాలో తన తల్లితో కలిసి ‘కేక్‌లీషియస్ (Cakelicious)’ పేరుతో ఓ బేకరీ బిజినెస్‌ ప్రారంభించేందుకు దోహదం చేసింది.

‘ప్రసవం తర్వాత కొన్నాళ్లకే క్లౌడ్‌ కిచెన్‌ (డైన్‌-ఇన్‌ సదుపాయం లేకుండా ఫుడ్‌ డెలివరీ/టేక్‌-అవే కోసం మాత్రమే సిద్ధం చేసిన ఆన్‌లైన్‌ కిచెన్) పద్ధతిలో బేకింగ్ బిజినెస్‌ ప్రారంభించా. ‘కేక్స్‌ ఇన్‌ టబ్స్‌ (చిన్న చిన్న కంటెయినర్స్‌లో కేక్స్‌ తయారుచేసి డెలివరీ చేయడం)’ కాన్సెప్ట్‌తో రుచికరమైన కేక్స్‌ తయారుచేసి డెలివరీ/టేక్‌-అవే పద్ధతిలో అమ్మడం ప్రారంభించా. క్రమంగా కేక్స్‌తో పాటు పేస్ట్రీలు, కుకీస్‌.. వంటి బేకరీ ఐటమ్స్‌కీ నా వ్యాపారం విస్తరించా. మొదట్లో పలు ఫుడ్‌ ఫెస్టివల్స్‌, ఎగ్జిబిషన్లలోనూ నా కేక్స్‌ని అమ్మేదాన్ని. ఇలా ఈ నాలుగేళ్లలో నా వ్యాపారం.. మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. ప్రస్తుతం నెలకు రూ. 10 లక్షల ఆదాయం వస్తోంది. ప్రముఖ బిజినెస్‌ రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా సీజన్‌ - 2’లో పాల్గొని రూ. 25 లక్షల పెట్టుబడినీ అందుకున్నా..’ అంటోన్న ఫతేమా.. తన వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా తన చిన్నారికి తగిన సమయం కేటాయిస్తున్నానంటోంది. ప్రస్తుతం సింగిల్‌ మదర్‌గా తన కూతురు ఆలనాపాలనను చూస్తోన్న ఆమె.. తన జీవితంలో మంచి రోజులొచ్చాయని, ఓ తల్లిగా తన బిడ్డకు బంగారు భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్