మహీంద్రా మెచ్చిన లండన్ ‘డబ్బావాలీ’లు!

తినాలనిపించినప్పుడల్లా బయటి నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుంటాం.. ఒక్కోసారి ఈ ఆహారం రుచించకపోవచ్చు.. మసాలాలు దట్టించినా అది ఆరోగ్యానికి మంచిది కాదు.. ఇక తినడం పూర్తయ్యాక ప్లాస్టిక్‌ డబ్బాలతో నిండిపోయిన చెత్తబుట్టను చూసీ చూడనట్లుగా వదిలేస్తాం.. కానీ అన్షు అహుజా, రెనీ విలియమ్స్‌.. మాత్రం అలా చేయలేదు.

Published : 30 Apr 2024 12:57 IST

(Photos: Instagram)

తినాలనిపించినప్పుడల్లా బయటి నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుంటాం.. ఒక్కోసారి ఈ ఆహారం రుచించకపోవచ్చు.. మసాలాలు దట్టించినా అది ఆరోగ్యానికి మంచిది కాదు.. ఇక తినడం పూర్తయ్యాక ప్లాస్టిక్‌ డబ్బాలతో నిండిపోయిన చెత్తబుట్టను చూసీ చూడనట్లుగా వదిలేస్తాం.. కానీ అన్షు అహుజా, రెనీ విలియమ్స్‌.. మాత్రం అలా చేయలేదు. అటు ఆరోగ్యానికి, ఇటు పర్యావరణానికి నష్టం కలిగిస్తోన్న ఫుడ్‌ ఆర్డర్‌ సమస్యకు చక్కటి పరిష్కారం చూపాలనుకున్నారు. ఈ ఆలోచనతోనే ఎకో-ఫ్రెండ్లీ ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌ను ప్రారంభించారీ స్నేహితురాళ్లు. అంతేకాదు.. డెలివరీ చేసే ఆహార పదార్థాల్నీ తామే స్వయంగా, ఇంటి రుచిని మరిపించేలా, ఆరోగ్యకరంగా తయారుచేసి పర్యావరణహిత పద్ధతిలో డెలివరీ చేస్తున్నారు. అందుకే వీళ్ల ఆలోచన తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రానూ ఆకట్టుకుంది. ఈ డబ్బావాలీలకు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ఆయన.. వీళ్ల ఐడియా అదుర్స్‌ అంటూ కితాబునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ లండన్‌ ‘డబ్బావాలీ’ల ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం రండి..

ఇంతకంటే రుచికరమైన ఆహారం ఉంటుందా?!

ప్రతిభ, సృజనాత్మకత ఉన్న వారిని ప్రోత్సహించడంలో ముందుంటారు మహీంద్రా గ్రూప్ ఛైర్‌పర్సన్‌ ఆనంద్‌ మహీంద్రా. ఈ క్రమంలోనే వాళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా లండన్‌ డబ్బావాలీలకు సంబంధించిన ఓ షార్ట్‌ వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారాయన. ముంబయి డబ్బావాలాల స్ఫూర్తితో.. లండన్‌లో నివసించే అన్షు అహుజా, రెనీ విలియమ్స్ అనే ఇద్దరు స్నేహితురాళ్లు పర్యావరణహితంగా నడుపుతోన్న ఫుడ్‌ బిజినెస్‌ ఇది! ఇంటి రుచులకు ఏమాత్రం తగ్గకుండా వీళ్లు తయారుచేసే ఆహారం, పాటించే నాణ్యతా ప్రమాణాలు, ప్యాకింగ్‌ కోసం పర్యావరణహితంగా ఉండేలా స్టీల్‌ క్యారియర్‌లు ఉపయోగించడం.. ఇలా వీళ్ల ఆలోచన అక్కడి వారినే కాదు.. తాజాగా ఆనంద్‌ మహీంద్రానూ ఆకట్టుకుంది. అందుకే వీళ్లు తయారుచేసే ఆహారపదార్థాలు, ప్యాకింగ్‌కు సంబంధించిన ఓ షార్ట్‌ వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ ప్రశంసలు అందజేశారాయన. దీంతో ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో లండన్‌ డబ్బావాలీల గురించి మరింతమందికి తెలియడంతో పాటు.. తమ దేశం/ప్రాంతంలోనూ ఇలాంటి ఆహార సంస్థ తెరవాలని కొందరు కోరుకుంటే.. భారత్‌ ఎన్నో దేశాలకు ఆదర్శమని మరికొందరు కొనియాడుతున్నారు.

వృథాకు పరిష్కారంగా..!

ముంబయి డబ్బావాలాల గురించి తెలియని వారుండరు. ఇళ్లు, రెస్టరంట్ల నుంచి ఏ పూటకాపూట స్టీల్‌బాక్సుల్లో వేడివేడిగా ఆహారం డెలివరీ చేయడం వీరి పని. లండన్‌లో నివాసముండే అన్షు, రెనీ కూడా ఇదే ఆలోచనను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇరుగుపొరుగిళ్లలో ఉండడంతో స్నేహితులైన వీరు.. ఆహార వృథాకు, ప్లాస్టిక్‌ వ్యర్థాలకు చెక్‌ పెట్టాలన్న ఆలోచనతోనే ఈ ఫుడ్‌ స్టార్టప్‌కు తెరతీశామంటున్నారు.

‘మాది ముంబయి.. కొన్నేళ్ల క్రితమే లండన్‌లో స్థిరపడ్డాను. అయితే నేను చిన్నప్పట్నుంచే పెద్ద ఫుడీని. కాస్త సమయం దొరికితే చాలు.. బయటికెళ్లి చాట్‌, పావ్‌భాజీ లాగించేసేదాన్ని. ఇంటికొచ్చి ఆ వంటకాల్ని స్వయంగా ప్రయత్నించేదాన్ని. అలా వంట చేయడమంటే ఇష్టం పెరిగింది. ఇక నేను, రెనీ అప్పుడప్పుడూ బయటి నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే వాళ్లం. ఈ క్రమంలో ఆహారం వృథా అవడం, పైగా ప్లాస్టిక్‌ డబ్బాల్లో ప్యాకింగ్‌, ఆయా వంటకాల్లో నూనెలు-మసాలాలు ఎక్కువగా ఉపయోగించడం.. వంటివన్నీ గమనించాం. వీటివల్ల ఇటు ఆరోగ్యానికి, అటు పర్యావరణానికి హాని కలుగుతుందన్న విషయం గుర్తించాం. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచన చేస్తున్న క్రమంలోనే ముంబయి డబ్బావాలా వ్యాపారం గుర్తొచ్చింది. ఇదే ఆలోచనను రెనీతో చర్చించి.. కేవలం ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాల్ని పర్యావరణహితంగా డెలివరీ చేయడమే కాదు.. ఆయా పదార్థాల్నీ స్వయంగా వండి అందించాలని నిర్ణయించుకున్నాం. ఇదే 2018లో ‘డబ్బా డ్రాప్‌’ అనే ఫుడ్‌ స్టార్టప్‌ ప్రారంభించడానికి దోహదమైంది..’ అంటోంది అన్షు. తామిద్దరూ తమ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి మరీ ఈ వ్యాపారం ప్రారంభించినట్లు చెబుతోందామె.

ఒక ఆర్డర్‌తో.. ఇద్దరు తినచ్చు!

ఇంటి ప్రేమను, రుచిని రంగరించి, ఆర్డర్‌ను బట్టి ఆయా వంటకాల్ని తయారుచేయడమే కాదు.. వాటిని ఎకో-ఫ్రెండ్లీగా స్టీల్‌ డబ్బా/క్యారియర్‌లో డెలివరీ చేయడం డబ్బా డ్రాప్‌ ప్రత్యేకత!
‘మా తొలి ప్రయత్నంగా.. గుమ్మడి కాయ కూర, పులిహోర, కొబ్బరి తురుముతో చేసిన కర్రీ, కాయగూరలన్నీ కలిపి చేసిన కూర.. మొదలైన వాటిని డబ్బాల్లో ప్యాక్‌ చేసి మాకు తెలిసిన వారికి పంపించాం. అయితే ఒక్కరి దగ్గర్నుంచీ ఫీడ్‌బ్యాక్‌ రాకపోవడంతో వారికి నచ్చలేదేమో అనిపించింది. కానీ ఆపై మా ప్రయత్నం బాగుందంటూ సందేశాలు వెల్లువెత్తాయి. అలా ఒకరి నుంచి మరొకరికి తెలిశాక ఆర్డర్ల సంఖ్యా పెరగడం మొదలైంది. దాంతో వారానికి సరిపడా ఒక మెనూ ఫిక్స్‌ చేశాం. అందులో రోజూ నాలుగు రకాల కూరలు, సలాడ్‌, సబ్జీ/పప్పు, అన్నం.. అందించాలనుకున్నాం. ఆర్డర్‌ను బట్టి నాలుగు బాక్సులున్న స్టీల్‌ క్యారియర్‌లో వీటిని ప్యాక్‌ చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా కూర నచ్చకపోయినా.. వారికి నచ్చిన కర్రీ తయారుచేసిచ్చే వెసులుబాటూ కల్పిస్తున్నాం. ఇక ఈ మధ్యే పంజాబీ, దిల్లీ, పాకిస్థాన్‌, గోవా.. పేర్లతో నాలుగు ప్రత్యేకమైన మెనూల్నీ సిద్ధం చేసి ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక వంటకాల్ని ఫుడ్‌ లవర్స్‌ కోసం అందిస్తున్నాం. పైగా మేం వండే ఆహార పదార్థాలన్నీ వీగన్‌, ఇండియన్‌, దక్షిణాసియా వంటకాలే! ఒక డబ్బా మీల్స్‌ ఆర్డర్‌ చేస్తే ఇద్దరు కడుపు నిండా తినగలుగుతారు..’ అంటూ తమ వ్యాపారం పనితీరు గురించి చెబుతున్నారీ ఇద్దరు స్నేహితురాళ్లు.

అడుగడుగునా పర్యావరణహితంగా..!

ప్రస్తుతం స్థానికంగా తమ ఫుడ్‌ డెలివరీ వ్యాపారాన్ని కొనసాగిస్తోన్న అన్షు, రెనీ.. రుచికరమైన వంటకాలతో ఆహార ప్రియులకు ఆరోగ్యాన్ని అందించడమే కాదు.. అడుగడుగునా పర్యావరణహితమైన ప్రమాణాలు పాటిస్తున్నామంటున్నారు.

‘ముందస్తు ఆర్డర్స్‌ ప్రకారమే మేం పదార్థాలు తయారుచేసి అందిస్తున్నాం కాబట్టి.. ఆహార వృథా ఉండదు.. అలాగే ఫుడ్‌ డెలివరీ కోసం స్టీల్‌ బాక్సులు వాడుతున్నాం.. ఇది కూడా పర్యావరణహితమైన ఎంపికే! అంతేకాదు.. తిరిగి ఈ డబ్బాల్ని సేకరించి.. శుభ్రం చేసి.. ఇతర ఆర్డర్లకూ ఉపయోగిస్తున్నాం. ఇక డెలివరీ కోసం సైకిళ్లు, ఈ-బైక్స్‌.. వంటి ప్రత్యామ్నాయాల్ని ఎంచుకుంటున్నాం. కొంతమంది సమోసా, నాన్స్‌, రోటీస్‌.. వంటివి ఆర్డర్‌ చేస్తుంటారు. వాటిని ప్యాక్‌ చేయడానికీ కంపోస్టబుల్‌ పేపర్‌ని వాడుతున్నాం.. ఇలా ఇప్పటివరకు మా స్టార్టప్‌ ద్వారా సుమారు 2 లక్షలకు పైగా ప్లాస్టిక్‌ కంటెయినర్ల వినియోగం తగ్గింది.. అలాగే దాదాపు వేల కిలోల ఆహార వృథాను అరికట్టగలిగాం..’ అంటున్నారీ ఇద్దరు మిత్రులు. ప్రస్తుతం వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు. వాళ్లు స్కూలుకు వెళ్లిపోగానే.. తమ వ్యాపారంలో నిమగ్నమవుతున్నారు.. మరోవైపు ఇంటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ జీవితాన్నీ ఆస్వాదిస్తున్నామంటున్నారు. ఇక త్వరలోనే యూకే వ్యాప్తంగా తమ ఫుడ్‌ డెలివరీ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామంటున్నారీ ఇద్దరు మిత్రులు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్