ఎన్‌ఎస్‌ఐ తొలి మహిళా డైరెక్టర్‌గా...

దేశంలోనే ఏకైక చక్కెర సంస్థ అయిన  నేషనల్‌ షుగర్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌ఎస్‌ఐ)కు తొలి మహిళా డైరెక్టర్‌గా డాక్టర్‌ సీమా పరోహా బాధ్యతలను స్వీకరించారు.

Published : 10 May 2024 01:58 IST

దేశంలోనే ఏకైక చక్కెర సంస్థ అయిన  నేషనల్‌ షుగర్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌ఎస్‌ఐ)కు తొలి మహిళా డైరెక్టర్‌గా డాక్టర్‌ సీమా పరోహా బాధ్యతలను స్వీకరించారు. ఎనిమిది దశాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న ఈ సంస్థను లాభాల బాటలో నడిపించడానికి పరిశోధనలెన్నో చేపడుతున్నారీమె.

ధ్యప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ సీమా పీహెచ్‌డీ పూర్తిచేసి, జవహర్‌లాల్‌ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. 2014లో కాన్పూర్‌లోని నేషనల్‌ షుగర్‌ ఇనిస్టిట్యూట్‌లో మొదట ప్రొఫెసర్‌గా చేరిన ఈమె, ఆ తర్వాత బయోకెమిస్ట్రీ విభాగానికి అధిపతిగా పదోన్నతి పొందారు. ఈ విభాగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారీమె. నానోబ్రూవరీ, డిస్టిలేషన్‌ యూనిట్‌ స్థాపించి, దాన్ని ఆధునీకరించడంలో డాక్టర్‌ సీమా కృషి ఎంతో ఉంది. ఆల్కహాలిక్‌ ఫర్మెంటేషన్‌సహా దుంపలు, తీపి జొన్నలు, సరుగుడు, మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ ముడిపదార్థాల నుంచి ఇథనాల్‌ ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించారీమె. గంగా, యమునా పరీవాహక ప్రాంతంలో ఉండే డిస్టిలరీ యూనిట్ల కోసం చార్టర్‌ను రూపొందించడంలో డాక్టర్‌ సీమా ముందడుగు వేశారు. అలాగే దిల్లీ సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుతో సమన్వయం చేస్తూ చక్కెర కర్మాగారాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థ జలాలను శుద్ధి చేయడంలో మార్గాలను సూచించారీమె. ‘ఈ సంస్థలోకి అడుగుపెట్టేటప్పుడు తొలి మహిళగానే ఉద్యోగంలోకి వచ్చా. ఇప్పుడీ డైరెక్టరు పదవిలో మరెన్నో సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. షుగర్‌ ఇనిస్టిట్యూట్‌ను యూనివర్శిటీగా మార్చడానికి నేను చేసిన ప్రయత్నం సఫలమైంది. ప్రస్తుతం డిప్లొమా కోర్సులను అందిస్తున్నాం. త్వరలో రెండేళ్ల కోర్సును డిగ్రీ చేయనున్నాం. అంతేకాదు, ఎన్‌ఎస్‌ఐలో పరిశోధనపై ఆసక్తి ఉన్నవారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే చక్కెర తయారీలో వృథాగా విడుదలయ్యే కలుషిత నీటిని తిరిగి వినియోగించడానికి చేపట్టిన పరిశోధనలు మంచి ఫలితాలిచ్చాయి. ఈ నీటిలో మినరల్స్‌ను కలపడం ద్వారా తాగునీటిగా మార్చొచ్చు. త్వరలో ప్యాక్డ్‌ మినరల్‌ వాటర్‌ సిద్ధం చేసి ‘చెరకు నీరు’ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొస్తా’మని చెబుతున్నారు డాక్టర్‌ సీమా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్