ఐరాస వేదికపై.. మన మహిళా సర్పంచ్‌లు!

ఓట్ల కోసం వాగ్దానాలు చేయడం, గెలిచాక వాటిని విస్మరించడం.. రాజకీయాల్లో ఇలాంటివి షరా మామూలే! కానీ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజా సేవలోనే నిమగ్నమయ్యారు ముగ్గురు మహిళా సర్పంచ్‌లు. తమ సేవా నిరతితో గ్రామాభివృద్ధికి, మహిళా సాధికారతకు పాటుపడుతున్నారు.

Updated : 30 Apr 2024 20:13 IST

(Photos: Twitter)

ఓట్ల కోసం వాగ్దానాలు చేయడం, గెలిచాక వాటిని విస్మరించడం.. రాజకీయాల్లో ఇలాంటివి షరా మామూలే! కానీ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజా సేవలోనే నిమగ్నమయ్యారు ముగ్గురు మహిళా సర్పంచ్‌లు. తమ సేవా నిరతితో గ్రామాభివృద్ధికి, మహిళా సాధికారతకు పాటుపడుతున్నారు. ఈ నాయకత్వ లక్షణాలే వారికి ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం కల్పించాయి. ఐరాస జనాభా నిధి (UNFPA) ఆధ్వర్యంలో నిర్వహించే ఓ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు మహిళా సర్పంచ్‌ల గురించి తెలుసుకుందాం..!

ఎవరా ముగ్గురు?

న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ‘ఐక్యరాజ్యసమితి జనాభా నిధి’ ఆధ్వర్యంలో 57వ ‘యునైటెడ్‌ నేషన్స్‌ కమిషన్‌ ఆన్‌ పాపులేషన్‌ డెవలప్‌మెంట్‌’ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ముగ్గురు మహిళా సర్పంచ్‌లకు ఆహ్వానం అందింది. ఏప్రిల్‌ 29 నుంచి మే 3 వరకు ఐదు రోజుల పాటు జరుగుతోన్న ఈ సదస్సు కోసం ‘కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ’ ఈ ముగ్గురు మహిళా సర్పంచ్‌లను ఎంపిక చేసింది. వీరిలో త్రిపుర సెపహిజల జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ సుప్రియా దాస్‌ దత్తా, తూర్పుగోదావరి జిల్లా పేకేరు గ్రామ సర్పంచ్‌ కునుకు హేమకుమారి, రాజస్థాన్‌లోని లంబి అహిర్‌ గ్రామ సర్పంచ్‌ నీరూ యాదవ్‌.. ఉన్నారు. ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ : భారతదేశ స్థానిక పాలనలో మహిళల ముందంజ’ అనే అంశంపై మే 3న వీరు ప్రసంగించనున్నారు.


విద్య, వైద్యం.. ఆమె లక్ష్యం!

ఒక మహిళ విద్యావంతురాలైతే కుటుంబం అభివృద్ధి చెందుతుంది.. కానీ ‘కుటుంబంతో పాటు గ్రామం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయి’ అంటారు కునుకు హేమకుమారి. 2022లో జేఎన్టీయూ కాకినాడలో ఎంటెక్‌ పూర్తిచేసిన ఆమె.. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండంలోని పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ఐదేళ్ల పాటు తణుకులోని ‘శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ’లో ‘ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌’ విభాగంలో అసోసియేట్‌ టెక్చరర్‌గా పనిచేసిన ఆమె.. 2021లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తోన్న ఆమె.. తన గ్రామంలో మహిళల్ని విద్యావంతుల్ని చేసేందుకు, అక్కడి ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. మే 3న ఐరాస వేదిక పైనా ఇవే అంశాలపై ప్రసంగించనున్నారామె. ఇక ప్రస్తుతం సర్పంచ్‌గానే కాదు.. ‘మండల సర్పంచ్‌ ఛాంబర్‌’ అధ్యక్షురాలిగా, ‘జిల్లా సర్పంచ్‌ ఛాంబర్‌’ జనరల్‌ సెక్రటరీగానూ కొనసాగుతున్నారు హేమ.


మహిళల గొంతుకైంది!

గ్రామాల్లో మహిళలపై ఎలాంటి ఆంక్షలుంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కనీసం వాళ్లు తమ సమస్యల్ని కూడా బయటికి చెప్పుకోలేరు. అలాంటిది కేరళలోని త్రిపుర సెపహిజల జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా సుప్రియా దాస్‌ దత్తా ఎన్నికైనప్పట్నుంచి ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పచ్చు. 2019లో ఈ పదవి చేపట్టిన ఆమె.. అప్పట్నుంచి ఆ గ్రామంలో పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా గ్రామ సభలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ వేదికగా మహిళలు తమ వ్యక్తిగత సమస్యలతో పాటు తాము చేసే పనుల్లో ఎదురయ్యే సమస్యల్నీ పంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆ సమస్యల్ని సంబంధిత అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించేలా చొరవ చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలో శ్యానిటరీ ప్యాడ్‌ వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేశారు. వివిధ సందర్భాల్లో లింగ సమానత్వం, మహిళా సాధికారత.. తదితర అంశాలపై ప్రసంగిస్తుంటారు కూడా! ‘స్వయం సహాయక బృందాల ద్వారా ఇక్కడి మహిళలు సాధించిన ఆర్థిక స్వావలంబన’ గురించి ఐరాస వేదికపై ప్రసంగించనున్నారు సుప్రియ.

రోజువారీ కూలీ కూతురైన ఆమె.. చిన్నతనంలో పేదరికంలోనే మగ్గారు. దాంతో పదో తరగతి పూర్తి కాగానే పెళ్లిపీటలెక్కిన సుప్రియ.. ఇక్కడా ఆర్థికంగా పలు కష్టాల్ని చవిచూశారు. అయితే అత్తింటి వారి ప్రోత్సాహంతో డి-ఫార్మసీ పూర్తిచేసిన అనంతరం తన భర్త రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో తానూ ఇటు వైపుగా అడుగులేశారు. ఇక ఇప్పుడు ఐరాస పిలుపు అందుకోవడం గర్వంగా, సంతోషంగా ఉందంటున్నారీ మహిళా నాయకురాలు.


హాకీ వాలీ సర్పంచ్!

పలు సామాజిక కట్టుబాట్ల కారణంగా ఇప్పటికీ చాలా గ్రామాల్లో అమ్మాయిలు ఆటల్ని కెరీర్‌గా ఎంచుకోలేకపోతున్నారు. అలాంటి గ్రామాలకు రాజస్థాన్‌లోని లంబి అహిర్‌ గ్రామం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇదంతా ఆ గ్రామ సర్పంచ్‌ నీరూ యాదవ్‌ చలవే అని చెప్పచ్చు. మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించాలన్న లక్ష్యంతో పంచాయతీ రాజ్‌ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఆమె.. పదవిలో చేరినప్పట్నుంచి ఈ దిశగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళల్లో ఆర్థిక అవగాహన పెంపొందించడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు మన జాతీయ క్రీడ హాకీ వైపు ఆసక్తి చూపే తన గ్రామంలోని బాలికల్ని ఒక టీమ్‌గా తయారుచేసి.. వారికి అనుభవజ్ఞులైన కోచ్‌ల సహకారంతో శిక్షణ ఇప్పిస్తున్నారు. వారికి ఉచితంగా హాకీ కిట్స్‌, యూనిఫాం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘హాకీ వాలీ సర్పంచ్‌’గా పేరు తెచ్చుకున్నారు నీరూ.

హరియాణాలోని నార్నౌల్‌లో పుట్టి పెరిగిన ఆమె.. సైన్స్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం జాగ్రఫీలో పీహెచ్‌డీ చేస్తోన్న నీరూ.. తన గ్రామంలోని అమ్మాయిల్ని ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఆయా విద్యా నైపుణ్యాలూ నేర్పుతున్నారామె. ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో అక్కడి అమ్మాయిలు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు అందుకోవడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఉచితంగా శ్యానిటరీ న్యాప్‌కిన్లు అందించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటుచేయడం, బాలికల్ని విద్యతో పాటు ఆటల దిశగా ప్రోత్సహించడం.. ఇలా తన గ్రామాభివృద్ధి కోసం సంపూర్ణంగా కృషి చేస్తున్నారామె. పర్యావరణహితం కోరుకునే నీరూ.. ఇటీవలే ‘గార్బేజ్‌ ఫ్రీ మ్యారేజ్‌ ఫంక్షన్స్‌’ అనే మరో కార్యక్రమానికి తెరతీశారు. ఈ వేదికగా జీరో వేస్టేజ్‌ పద్ధతిలో పెళ్లిళ్లు చేసుకునేలా అక్కడి జంటల్ని ప్రోత్సహిస్తున్నారామె. అశోక్‌ యాదవ్‌ అనే ఇంజినీర్‌ని వివాహమాడిన నీరూ.. తను సర్పంచ్‌గా రాణించడంలో తన భర్త ప్రోత్సాహం ఎంతో ఉందంటున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్