పైన్‌ చెట్ల ఆకులతో... ‘పిరుల్‌’

జనపనార, తాటాకులతో హస్తకళాకృతులు చేయడం తెలిసిందే. కానీ సన్నని సూది మొనల్లా ఉండే పైన్‌ చెట్ల ఆకులతోనూ అందమైన వస్తువుల్ని చేయొచ్చన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? ఆ ఆకుల్ని వేళ్లతో పట్టుకోవడమే కష్టం... అలాంటిది వాటిని ఒకదాంతో ఒకటి కలుపుతూ అల్లడం సాధ్యమా? ఎవరూ ఊహించని విధంగా దాన్ని సాధ్యం చేసి చూపించింది నుపుర్‌ పోహార్కర్‌.

Updated : 30 Apr 2024 14:42 IST

జనపనార, తాటాకులతో హస్తకళాకృతులు చేయడం తెలిసిందే. కానీ సన్నని సూది మొనల్లా ఉండే పైన్‌ చెట్ల ఆకులతోనూ అందమైన వస్తువుల్ని చేయొచ్చన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? ఆ ఆకుల్ని వేళ్లతో పట్టుకోవడమే కష్టం... అలాంటిది వాటిని ఒకదాంతో ఒకటి కలుపుతూ అల్లడం సాధ్యమా? ఎవరూ ఊహించని విధంగా దాన్ని సాధ్యం చేసి చూపించింది నుపుర్‌ పోహార్కర్‌. ఫలితమే ‘పిరుల్’. ఈ సంస్థ ద్వారా పైన్‌ అడవుల్ని సంరక్షిస్తూ, స్థానిక మహిళలకి ఉపాధినీ కల్పిస్తోంది.

నుపుర్‌ పోహార్కర్‌ది నాగ్‌పుర్‌. తండ్రి అజయ్‌ వెటర్నరీ డాక్టర్‌. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో, కరెంట్‌, తాగునీటి సదుపాయం లేని గ్రామాల్లో ప్రజలకు పశుపోషణపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ పథకాలు అందేలా సహాయం చేసేవాడు. పశు సంరక్షణ కోసం ఒక ఎన్జీవోనూ నడిపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన నుపుర్‌కు ఆయన బాటలోనే నడవాలని కోరిక. వెటర్నరీలో డిగ్రీ పూర్తిచేసి గ్రామీణ ప్రజలకు స్వయం ఉపాధి కల్పించే స్వచ్ఛంద సంస్థలో చేరింది. అందులో భాగంగానే ఉత్తరాఖండ్‌లోని ఖేతిఖాన్‌ గ్రామానికి చేరుకుంది. అక్కడ నివాసముంటున్న వారంతా మహిళలు, వృద్ధులు, పిల్లలే. పనికోసం మగవారు వలస వెళ్తే, ఆడవాళ్లే దుక్కి దున్ని కుటుంబాన్ని పోషిస్తున్నారు. వర్షాలు లేక పంటలు సరిగా పండని అటవీ ప్రాంతమది. విద్య, వైద్యం వారికి అందని ద్రాక్ష. ఇవన్నీ చాలవన్నట్లు చుట్టూ పైన్‌ చెట్లు ఉండటంవల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు అవి అడవిని దహించి వేయడం చూసింది నుపుర్‌. ఆ సమయంలో పరుగులు పెట్టి కొండ గుహల్లో తలదాచుకుంటోన్న వాళ్లను చూసి చలించిపోయింది. వాళ్ల సమస్యకు పరిష్కారం చూపించాలనుకుంది. చెట్ల ఆకులు వృథాగా నేలపై పడటం వల్లే అడవి అంటుకుంటోంది. వాటిని గృహోపకరణాలు చేయడానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఆమె ప్రయత్నం ప్రారంభమైంది.

రాలిన ఆకులతో..

తన ఆలోచన అక్కడి మహిళలతో పంచుకున్నప్పుడు అక్కడి వారెవరూ లెక్కచేయలేదు సరికదా వెటకారంగా నవ్వారట. ఎండకు ఎండి, వానకు తడిచే ఆ పుల్లల్లాంటి ఆకులతో గృహోపకరణాలు చేయొచ్చంటే నమ్మలేదు. దాంతో తనే స్వయంగా మూడునెలలు శ్రమించి ఎండిన ఆకులతో టోపీలు, గిన్నెలు, బుట్టలు చేయడం నేర్చుకుంది నుపుర్‌. వాటిని ఎగ్జిబిషన్‌ పెట్టింది. అప్పుడు అక్కడివాళ్లకి నమ్మకం కలిగిందట. దాంతో ఔత్సాహికులైన నలుగురు మహిళలతో ‘పిరుల్‌’ సంస్థని ప్రారంభించింది. క్రమంగా గ్రామం మొత్తం స్వయం ఉపాధి పొందేలా చేసింది. ఆ ఆకులతో ఇప్పుడు అమ్మాయిలు అలంకరించుకునే ఆభరణాలూ రూపొందిస్తున్నారు. వంద మందికి పైగా మహిళలు దీనిద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇది తెలిసి పక్క గ్రామాల నుంచీ వస్తున్నారు. అయితే వీటి తయారీమీదే దృష్టిపెట్టి సేద్యం, పశుపోషణకు గ్రామస్థులు దూరం కాకుడదని తన బృందంతో ఎప్పటికప్పుడు వ్యవసాయం, పశువుల పెంపకంలో మెలకువలు నేర్పుతోంది. ఇప్పటివరకూ వీళ్లు  చేసిన 8 వేల ఉత్పత్తులను వినియోగదారులకు అందించారు. బెంగళూరు, హైదరాబాద్‌, దిల్లీ వేదికగా అనేక ప్రదర్శనలు నిర్వహించి.. వీటిని విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ అమ్ముతున్నారు. చుట్టుపక్కల అన్ని గ్రామాలకూ ‘పిరుల్‌’ సంస్థను పరిచయం చేసి, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న నుపుర్‌ కృషిని తప్పక ప్రశంసించాల్సిందే మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్