Air India: రుచికరమైన వంటకాలతో ఎయిరిండియా కొత్త మెనూ!

ఎయిరిండియాకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా టాటాల నేతృత్వంలోని కొత్త యాజమాన్యం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా రుచికరమైన వంటకాలతో కొత్త మెనూను ప్రవేశపెట్టింది.

Published : 03 Oct 2022 17:53 IST

దిల్లీ: టాటాల యాజమాన్యంలోకి వెళ్లిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాకు తిరిగి పూర్వవైభవం తీసుకురావడంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పండగ సీజన్‌ సందర్భంగా దేశీయ విమాన సేవల్లో కొత్త ఆహార మెనూను ప్రవేశపెడుతున్నట్లు సంస్థ ప్రకటించింది. రుచికరమైన భోజనాలు, అధునాతన అపిటైజర్స్‌ (భోజనానికి ముందు ఇచ్చే పదార్థాలు), నాణ్యమైన డెజర్ట్స్‌ (భోజనానంతరం ఇచ్చే పదార్థాలు)ను కొత్త మెనూలో చేర్చినట్లు పేర్కొంది. భారతీయ వంటకాలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు తెలిపింది. అక్టోబరు 1 నుంచి కొత్త మెనూ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి దీన్ని దేశీయ విమాన సేవల్లోనే ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది. త్వరలో అంతర్జాతీయ సేవలకూ విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సంస్థ అంతర్గత సేవల విభాగాధిపతి సందీప్‌ వర్మ వెల్లడించారు.

ఎయిరిండియా ఇటీవలే ‘విహాన్‌.ఏఐ’ పేరిట దీర్ఘకాలిక ప్రణాళికను ప్రకటించింది. రాబోయే అయిదేళ్లలో దేశీయ విమానయాన విపణిలో కనీసం 30 శాతం వాటా పొందడంతో పాటు.. అంతర్జాతీయ కార్యకలాపాల్లోనూ కీలక పాత్ర పోషించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది. వచ్చే 15 నెలల్లో 5 బోయింగ్, 25 ఎయిర్‌బస్‌ విమానాలను జత చేసుకోనున్న సంస్థ, వృద్ధి, లాభదాయకతను పెంచుకుని మార్కెట్‌ లీడర్‌గా పయనించాలని భావిస్తోంది. దేశీయ విమానయాన విపణిలో జులైలో ఎయిరిండియాకు 8.4 శాతం వాటా దక్కినట్లు డీజీసీఏ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే విమానాల్లో క్యాబిన్లు - సీట్లు మెరుగు పరచడం, ఇన్‌-ఫ్లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఆధునికీకరణ వంటి చర్యలతో ఎయిరిండియాలో మార్పు మొదలైందని ‘విహాన్‌.ఏఐ’ ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈఓ కాంప్‌బెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని