Jack Ma: చైనాలో జాక్‌మా.. ఏడాదిన్నర తర్వాత ప్రత్యక్షం!

Jack Ma in china: అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా మళ్లీ చైనాలో ప్రత్యక్షమయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన.. కొన్ని నెలలుగా విదేశాల్లోనే ఉంటున్నారు.

Published : 27 Mar 2023 13:52 IST

Jack Ma in China | బీజింగ్‌: చైనాకు చెందిన కుబేరుడు, అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా (Jack Ma) చాలా రోజుల తర్వాత స్వదేశంలో ప్రత్యక్షమయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన ఆయన.. చైనాలో (china) తాజాగా అడుగుపెట్టారు. తాను స్థాపించిన స్కూల్‌కు హాజరైనట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ వెల్లడించింది. జాక్‌ మా రాకతో హాంకాంగ్‌ మార్కెట్‌లో అలీబాబా షేర్లు పుంజుకున్నాయి.

అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020లో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. ఆ తర్వాత అతడి కంపెనీలపై ప్రభుత్వ పెద్దలు ఉక్కుపాదం మోపారు. దీంతో 2021 చివర్లో ఆయన చైనాను వీడారు. ఆ తర్వాత జాక్‌ మా బహిరంగంగా కనిపించిన సందర్భాలు అరుదనే చెప్పాలి. జపాన్‌, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో అప్పుడప్పుడూ ప్రత్యక్షమైన ఫొటోలు మాత్రం దర్శనమిచ్చాయి.

అలా దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో ఉంటున్న జాక్‌మా తాజాగా చైనాలో అడుగుపెట్టారు. హంగ్జౌ నగరంలో ఆయన స్థాపించిన ఓ స్కూల్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం బయటకొచ్చాయి. చైనా వచ్చే ముందు ఆయన హాంకాంగ్‌లో పర్యటించారని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. జాక్‌మా రాకతో హాంకాంగ్‌ మార్కెట్‌లో అలీబాబా కంపెనీ షేర్లు 4 శాతం మేర పెరిగాయి. అయితే, జాక్‌మా రాకను చైనాలో మళ్లీ ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పడానికి సంకేతంగా భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని