Adani group: నష్టాల్లో అదానీ గ్రూప్‌ స్టాక్స్‌.. అమెరికా దర్యాప్తు ఎఫెక్ట్

Adani group: అదానీ గ్రూప్‌ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. దానిపై అమెరికా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని వస్తున్న వార్తలే ఇందుకు కారణం.

Updated : 18 Mar 2024 19:54 IST

Adani group | ముంబయి: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ (Adani group) మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. లంచం ఆరోపణల విషయంలో ఆ గ్రూప్‌పై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టిందన్న వార్తల నేపథ్యంలో వాటి విలువ కుంగింది. దీనికి తోడు అదానీ పవర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురవడం గ్రూప్‌ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. గ్రూప్‌లోని అన్ని కంపెనీల షేర్లూ ఆరంభంలో భారీ నష్టాలు ఎదుర్కొనగా.. సాయంత్రం స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

ఈ గ్రూప్‌లో ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ ఉదయం 4 శాతం నష్టపోగా.. తర్వాత కోలుకొని 0.71 శాతం నష్టంతో ముగిసింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎనకమిక్‌ జోన్‌ లిమిటెడ్‌ ఓ దశలో 3 శాతం మేర కుంగగా.. చివరికి 1.24 శాతం నష్టంతో ముగిసింది. బీఎస్‌ఈలో అదానీ టోటల్‌ గ్యాస్‌ 4.35 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ 3.40 శాతం, అంబుజా సిమెంట్స్‌ 2.81 శాతం, ఏసీసీ 2.43 శాతం చొప్పున నష్టపోయాయి. ఎన్డీటీవీ 2.08 శాతం, అదానీ విల్మర్‌ 2.05 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1.67 చొప్పున నష్టపోయాయి. ఈ గ్రూప్‌నకు చెందిన డాలర్ బాండ్ల విలువ సైతం తగ్గింది.

అదానీ గ్రూప్‌ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు

భారత్‌లో ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో అనుకూలంగా వ్యవహరించేలా అదానీ గ్రూప్‌ లేదా గౌతమ్‌ అదానీ సహా కొందరు వ్యక్తులు ఎవరైనా లంచం ఇవ్వజూపారా? లేదా? అనేది తెలుసుకోవడానికి అమెరికా దర్యాప్తు చేపట్టిందని బ్లూమ్‌బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది. ఆ దేశ అటార్నీ జనరల్‌ ఆఫీస్‌, జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఫ్రాడ్‌ యూనిట్‌ ఈ విచారణ జరపుతున్నట్లు తెలిపింది. దేశీయ ఎనర్జీ కంపెనీ అజ్యూర్‌ పవర్‌ గ్లోబల్‌పైనా ఈ దర్యాప్తు మొదలైనట్లు పేర్కొంది. అమెరికాలో అదానీ గ్రూప్‌ ట్రేడ్‌ కానప్పటికీ.. అమెరికన్ల పెట్టుబడులు ఆ గ్రూప్‌లో ఉన్న నేపథ్యంలో అక్కడి సంస్థలు దర్యాప్తు జరపొచ్చు. అయితే, దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారమూ లేదని అదానీ గ్రూప్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

  • మరోవైపు రాజస్థాన్‌ ప్రభుత్వానికి చెందిన జైపూర్‌ విద్యుత్‌ వితరణ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ నుంచి పేమెంట్‌ సర్‌ఛార్జి కింద రూ.1300 కోట్లు కోరుతూ అదానీ పవర్‌ రాజస్థాన్‌ లిమిటెడ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని