Smartphones: 18 శాతం మార్కెట్‌ వాటాతో 2023లో శాంసంగ్‌ టాప్‌!

Smartphones: సీఎంఆర్‌ నివేదిక ప్రకారం.. 2023లో వార్షిక ప్రాతిపదికన స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 19 శాతం వృద్ధి నమోదుచేసింది. 5జీ స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలు 122 శాతం వృద్ధితో 65 శాతానికి చేరాయి.

Updated : 06 Feb 2024 09:03 IST

దిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్‌ విపణి (Indian Smartphone Market)లో దక్షిణ కొరియా ప్రముఖ టెక్‌ సంస్థ శాంసంగ్‌ (Samsung) అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీకి 2023లో 18 శాతం మార్కెట్‌ వాటా ఉన్నట్లు మార్కెట్‌ పరిశోధన సంస్థ ‘సైబర్‌మీడియా రీసెర్చ్‌’ (సీఎంఆర్‌) నివేదిక వెల్లడించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మాత్రం చైనా కంపెనీ షావోమీ అగ్రస్థానంలో నిలిచింది.

సీఎంఆర్‌ నివేదిక ప్రకారం.. 2023లో వార్షిక ప్రాతిపదికన స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ 19 శాతం వృద్ధి నమోదుచేసింది. 5జీ స్మార్ట్‌ఫోన్‌ సరఫరాలు 122 శాతం వృద్ధితో 65 శాతానికి చేరాయి. 2023 ఏడాదికి సంబంధించి మార్కెట్‌ షేర్‌ పరంగా శాంసంగ్‌ (Samsung) అగ్రస్థానంలో నిలవగా, చైనా కంపెనీ వివో 16 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. 5జీ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో సైతం 23 శాతం మార్కెట్‌ షేర్‌తో శాంసంగ్‌ టాప్‌లో ఉంది. వివో 15 శాతం, వన్‌ప్లస్‌ 13 శాతం వాటాతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

డిసెంబర్‌ త్రైమాసికంలో మొత్తంగా స్మార్ట్‌ఫోన్ల సరఫరాలో రికార్డు స్థాయిలో 29 శాతం వృద్ధి నమోదైంది. ఇందులో షావోమీ 19 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా, శాంసంగ్‌ (18.9శాతం), వివో (16 శాతం), రియల్‌మీ (12 శాతం), ఒప్పో (8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. యాపిల్‌ 6 శాతం వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీ విక్రయాల్లో ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్ల వాటానే 50 శాతానికి పైగా ఉంది. ప్రీమియం సెగ్మెంట్‌లో రూ.25,000 పైన ఉన్న స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లలో 71 శాతం వృద్ధి నమోదైంది.

రూ.7,000- రూ.25,000 ధరల శ్రేణి 5జీ స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లు 58 శాతానికి పెరిగినట్లు సీఎంఆర్‌ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్‌ గ్రూప్ అనలిస్ట్‌ శిప్రా సిన్హా వెల్లడించారు. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో ఇది 47 శాతంగా ఉంది. రూ.50,000 పైన ధర పలికే సూపర్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో 65 శాతం వృద్ధి నమోదైంది. ప్రముఖ టెలికాం సంస్థ ‘జియో’ సహకారంతో 4జీ ఫీచర్‌ ఫోన్లు సైతం మార్కెట్‌లో గణనీయ వాటాను కలిగి ఉన్నట్లు సిన్హా వెల్లడించారు. 4జీ ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌ 52 శాతం వృద్ధి నమోదు చేయగా, 2జీ ఫోన్ల అమ్మకాలు 12 శాతం పడిపోయాయి. ఫీచర్‌ ఫోన్ల విక్రయాల్లో ‘జియో’ 38 శాతం మార్కెట్‌ షేర్‌తో తొలిస్థానంలో ఉంది. 23 శాతంతో ఐటెల్‌ రెండు, 15 శాతంతో లావా మూడో స్థానంలో ఉన్నాయి. 

షావోమీ సబ్‌ బ్రాండ్‌ పోకో షిప్‌మెంట్స్‌ పరంగా 148 శాతం వృద్ధి నమోదు చేయగా, వివో 5జీ షిప్‌మెంట్స్‌ రికార్డు స్థాయిలో 300 శాతం పెరిగాయి. 2024కు సంబంధించి 5జీ ఫోన్ల డిమాండ్‌ దృష్ట్యా 7-8 శాతం వృద్ధి ఉండొచ్చని సీఎంఆర్‌ అంచనా వేసింది. ఈ ఏడాది 5జీ స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్లు 40 శాతానికి పెరగొచ్చని, 4జీ ఫోన్ల అమ్మకాలు 10 శాతం పుంజుకోవచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని