Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ ఆర్థిక తప్పులు చేయొద్దు!

Money mistakes: కొత్తగా ఉద్యోగంలో చేరినవారు ఆర్థికంగా ఎదగడానికి కొన్ని తప్పులను నివారించాలి. అవేంటో చూద్దాం..!

Updated : 08 Mar 2024 10:28 IST

Money mistakes | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగంలో చేరడం జీవితంలో ఓ గొప్ప మైలురాయి. ప్రతినెలా కొంత నిర్దిష్ట మొత్తంలో సంపద చేతికందుతుంది. దీంతో సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. అయితే, ఆర్థికంగా ఎదగడానికి పక్కా ప్రణాళిక అవసరం. లేదంటే తెలియకుండానే కొన్ని తప్పులు జరిగి పోతాయి. ఫలితంగా సొంతిల్లు, వాహనం, వివాహం, పిల్లల ఖర్చులు, పదవీ విరమణ వంటి పెద్ద లక్ష్యాల కోసం నిధులను సమకూర్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది.

బడ్జెట్‌ను నిర్లక్ష్యం చేయడం..

కొత్త ఉద్యోగులు చేసే అత్యంత సాధారణ తప్పులలో ఒకటి బడ్జెట్‌ను రూపొందించడంలో నిర్లక్ష్యం చేయడం. ఆదాయం, వ్యయాలపై స్పష్టమైన అవగాహన లేకుండా అతిగా ఖర్చు చేయడం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. వేతనం, ఏవైనా అదనపు ఆదాయ వనరులతో సహా మొత్తం మీ నెలవారీ ఆదాయాన్ని అంచనా వేయండి. ఆపై, అద్దె, యుటిలిటీలు, కిరాణా సామగ్రి, రవాణాతో సహా అన్ని ఖర్చుల జాబితాను సిద్ధం చేయండి. బడ్జెట్‌ను రూపొందించడం వల్ల ఆర్థిక వ్యవహారాలను మరింత సమర్థంగా నిర్వహించొచ్చు.

పొదుపు లక్ష్యాలను విస్మరించడం..

ఉద్యోగంలో చేరిన మొదట్లో నివారించాల్సిన మరో తప్పు పొదుపునకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం. చాలా మంది కొత్త ఉద్యోగులు భవిష్యత్తు లక్ష్యాల కోసం డబ్బును కేటాయించకుండానే.. తక్షణ ఖర్చులను కవర్ చేయడంపై మాత్రమే దృష్టి పెడతారు. అత్యవసర నిధిని నిర్మించుకోవాలి. పదవీ విరమణ కోసం మదుపు చేయాలి. ఇలాంటి ప్రధాన ఖర్చుల కోసం ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ప్రతినెలా ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు కోసం కేటాయించాలి.

లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్‌లపై అధిక ఖర్చు..

ఉద్యోగంలో చేరిన కొత్తలో తరచూ రెస్టారంట్లకు వెళ్లడం, గ్యాడ్జెట్లు కొనడం, లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఉండడం వంటి జీవనశైలి ఖర్చులకు అధికంగా వెచ్చిస్తుంటారు. ఇవి అప్పుడప్పుడైతే ఫరవాలేదు. కానీ, అలవాటుగా మారితే మాత్రం ఆర్థిక పరిస్థితి త్వరగా దెబ్బతింటుంది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఆటంకం కలుగుతుంది. కోరికల కంటే అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆదాయంలో కొంత భాగాన్ని ఇలాంటి ఖర్చుల కోసం కేటాయించుకుంటే ఫరవాలేదు.

రుణ చెల్లింపును నిర్లక్ష్యం చేయడం..

విద్యా రుణాలు, క్రెడిట్ కార్డ్ బాకీలు లేదా ఇతరత్రా అప్పుల వంటివి ఇప్పటికే ఉంటే.. వాటిని తీర్చడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే వడ్డీ భారం పెరుగుతుంది. ఇది ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తుంది. ప్రతి నెలా ఆదాయంలో కొంత భాగాన్ని రుణ చెల్లింపుల కోసం పక్కన పెట్టాలి. అధిక వడ్డీ అప్పులను ముందుగా తీర్చేయాలి.

ముందస్తు బీమా కవరేజీ..

చాలా మంది కొత్త ఉద్యోగులు బీమా ప్రాముఖ్యతను విస్మరిస్తారు. ఆరోగ్య, జీవిత బీమా చాలా ముఖ్యమని గుర్తించాలి. ప్రమాదాలు, ఊహించని సంఘటనలు జరిగినప్పుడు తగినంత బీమా కవరేజీ ఉంటే మనపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా ఉంటుంది. దీంట్లో పెట్టుబడి ఆర్థిక భద్రత కోసం మదుపు చేయడం అని గుర్తించాలి.

పన్ను ప్రణాళికను విస్మరించడం..

ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడంలో పన్ను ప్రణాళిక ముఖ్యమైన అంశం, అయినప్పటికీ చాలా మంది కొత్త ఉద్యోగులు దీనిని పట్టించుకోరు. ఆదాయం, పెట్టుబడులపై పన్నులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రావిడెంట్ ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ప్లాన్‌ల వంటి పన్ను ఆదా పెట్టుబడి ఎంపికలను అన్వేషించాలి.

పటిష్ఠ ప్రణాళిక, వివేకవంతమైన ఆర్థిక నిర్వహణతో మెరుగైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. క్రమశిక్షణతో కూడిన పొదుపు, స్థిరమైన మదుపు బంగారు జీవితానికి బాటలు వేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని