Child education plan: చైల్డ్‌-ఎడ్యుకేషన్‌ ప్లాన్లలో అన్నీ ఉన్నా.. పరిమితులున్నాయ్‌!

విద్యా ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది తమ పిల్లల చదువుల కోసం చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్లను ఎంపిక చేసుకుంటుంటారు. కానీ, దాంట్లోనూ కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని పరిశీలించిన తర్వాత సరిపోతాయనుకుంటేనే తీసుకోవడం ఉత్తమం.

Published : 23 Nov 2022 11:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజురోజుకీ పిల్లల చదువుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల విద్య విషయంలో ఓ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. బీమా, పెట్టుబడితో కూడిన మదుపు మార్గాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఒకవేళ ప్రమాదవశాత్తూ సంరక్షుడు అకాలమరణం చెందినా.. పిల్లలకు ఆర్థిక భరోసా ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణం అధిగమించే రాబడి వల్ల పై చదువులకు కావాల్సిన డబ్బూ సమకూరుతుంది.

ఇన్సూరెన్స్‌-కమ్‌-ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లలో కస్టమర్ చెల్లించే ప్రీమియంలో కొంత భాగాన్ని రిస్క్ కవర్‌ని అందించడానికి సంస్థలు కేటాయిస్తాయి. ఎక్కువ భాగాన్ని వివిధ డెట్, ఈక్విటీ సాధనాల్లో మదుపు చేస్తాయి. ఈ ప్లాన్‌లలో చాలా వరకు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.

జాగ్రత్తగా ఎంచుకోవాలి..

తగిన చైల్డ్ ప్లాన్ కోసం వెతుకుతున్నప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల విద్య, బీమా అవసరాలకు సరిపోయే ఫీచర్లు ఉన్నాయో.. లేదో.. పరిశీలించాలి. యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు (యులిప్స్) వంటి చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్‌లు మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు పాలసీ హోల్డర్ ఎంపికను (ఫండ్స్‌లో) పరిగణనలోకి తీసుకుంటాయి. అందుకు అనుగుణంగానే ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఫండ్‌లను ఎంచుకుంటాయి. దేంట్లో ఎంత మదుపు చేయాలన్నది పాలసీహోల్డర్‌ తీసుకోగలిగే రిస్క్‌ను బట్టి నిర్ణయిస్తాయి.

మరోవైపు చైల్డ్ ఎండోమెంట్ ప్లాన్‌లు అటువంటి సౌలభ్యాన్ని అందించవు. సాధారణంగా డెట్, బాండ్‌ వంటి పథకాలు స్థిర ఆదాయ వనరులలో పెట్టుబడి పెడతాయి. జీవిత బీమాతో సహా హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. పిల్లలకి 18 ఏళ్లు నిండిన తర్వాత, ఈ ప్లాన్‌లు సాధారణంగా నాలుగు విడతల్లో మొత్తాన్ని చెల్లిస్తాయి.

లాక్‌-ఇన్‌ పీరియడ్‌ చాలా ముఖ్యం..

ఈ పాలసీలలో ముఖ్యమైన అంశం లాక్-ఇన్ పీరియడ్. సాధారణంగా ఈ పాలసీలకు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. పాలసీదారుడు పాలసీ ఆరో సంవత్సరంలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. ఒకవేళ పిల్లల విద్యా ప్రణాళికను మార్చినట్లయితే పాలసీని సరెండర్ చేసే వెసులుబాటు ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు..

ఈ ప్లాన్లలో జీవిత బీమా కూడా భాగమైన నేపథ్యంలో చెల్లించే ప్రీమియానికి  సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. వార్షిక బీమా ప్రీమియంల మొత్తం రూ. 2.5 లక్షలు మించనంత కాలం ఈ ప్లాన్‌లకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత అందే మొత్తంపై మాత్రం దీర్ఘకాల మూలధన రాబడి పన్ను వర్తిస్తుంది.

అన్నీ ఉన్నా..

పిల్లల చదువుల ఖర్చులు, బీమా, పన్ను మినహాయింపు.. అన్నీ ఒకే చైల్డ్‌ ప్లాన్‌లో లభిస్తున్న నేపథ్యంలో చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. వీటిలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అందులో మొదటిది.. తక్కువ బీమా హామీ. ఈ ప్లాన్లలో అందే బీమా హామీ మొత్తం మనం చెల్లించే వార్షిక ప్రీమియానికి పదింతలు ఉంటుందంతే. టర్మ్‌ ప్లాన్లతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ. పైగా మనం చెల్లించే ప్రీమియం మొత్తాన్ని మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయరు. ఫలితంగా రాబడి విషయంలో గరిష్ఠ ప్రయోజనాన్ని అందుకోవడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో బీమా కోసం, చదువుల కోసం ప్రత్యేకంగానూ పాలసీలు ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని