Belated ITR Fee: గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయలేదా?మరి ఆలస్య రుసుము ఎంతో తెలుసా?

Belated ITR Fee: గడువులోగా ఐటీఆర్‌ దాఖలు చేయకపోతే ఆలస్య రుసుముతో డిసెంబరు 31వరకు రిటర్నులు దాఖలు చేసే వెసులుబాటు ఉంది....

Updated : 02 Aug 2022 13:07 IST

Belated ITR Fee: గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు జులై 31తో గడువు ముగిసింది. ఒకవేళ వివిధ కారణాల వల్ల ఎవరైనా ఇంకా రిటర్నులు సమర్పించలేకపోయినా.. ఇప్పటికీ అవకాశం ఉంది. అయితే, దాన్ని ఆలస్య రిటర్నుల కింద పరిగణించి రుసుము (Belated ITR Fee) విధిస్తారు. ఆదాయ పన్ను చట్టంలోని 234ఎఫ్‌ కింద ఈ ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

ఆలస్య రుసుము చెల్లిస్తే, డిసెంబరు 31 వరకు రిటర్నులు దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను విభాగం వెసులుబాటు కల్పిస్తోంది. ఒకవేళ అప్పటికి కూడా ఐటీఆర్‌ సమర్పించకపోతే.. ఐటీ విభాగం ప్రత్యేకంగా నోటీసులు పంపితే తప్ప రిటర్నుల దాఖలుకు అవకాశం ఉండదు.

వార్షికాదాయం రూ.5లక్షల లోపు ఉన్న వారు రూ.1,000, రూ.5లక్షలు మించిన వారు రూ.5,000 ఇలా చెల్లించాలి. ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే.. అదనంగా నెలకు ఒక శాతం వడ్డీ వసూలు చేస్తారు. దీర్ఘకాలిక మూలధన నష్టాలు ఉన్నవారు.. వీటిని మరుసటి ఏడాదికి బదిలీ చేసుకునే వీలుండదు. పన్ను పరిధిలోకి రాని వారు ఎలాంటి రుసుము లేకుండానే రిటర్నులు దాఖలు చేయొచ్చు.

ఆలస్యంగా ఐటీఆర్‌ దాఖలు చేసేవారు ముందే ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. చలాన్‌ నెంబర్‌ 280ని ఉపయోగించి చెల్లింపు చేయాలి. లేదా ఆన్‌లైన్‌లో ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారాగానీ, బ్యాంకు శాఖలో కూడా ఆలస్య రుసుము చెల్లించే వెసులుబాటు కల్పించారు.

ఆర్థిక సంవత్సరం 2017-18 నుంచి ఆలస్య రుసుము ప్రవేశ పెట్టారు. జులై 31 నుంచి డిసెంబరు 31 మధ్య రూ.5000, ఆ తర్వాత మార్చి 31 వరకు రూ.10000 జరిమానాతో ఆలస్య ఐటీఆర్‌ను సమర్పించేందుకు అప్పట్లో అవకాశం ఇచ్చేవారు. కానీ, బడ్జెట్‌ 2021లో ఈ నిబంధనను మారుస్తూ సెక్షన్‌ 234ఎఫ్‌లో సవరణలు చేశారు. అప్పటి నుంచి ఐటీఆర్‌ దాఖలుకు డిసెంబరు 31నే ఆఖరు తేదీగా నిర్ణయించారు. గడువు కుదించిన నేపథ్యంలో ఆలస్య రుసుమును కూడా తగ్గించారు.

గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి 2022, జులై 31 నాటికి 5.83 కోట్ల ఆదాయపు పన్ను రిటర్ను (ITR)లు దాఖలయ్యాయి. ఇందులో ప్రధానంగా ఉద్యోగులు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులే ఉన్నట్లు ఐటీ విభాగ సీనియర్‌ అధికారి తెలిపారు. చివరి రోజైన జులై 31 రికార్డు స్థాయిలో 72.42 లక్షలకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 5.89 కోట్ల రిటర్నులు అందాయి. దీంతో పోలిస్తే ఈసారి కూడా దాదాపు అదే స్థాయిలో రిటర్నులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని