Year ender 2023: శాంసంగ్‌ F54, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో+.. ఈ ఏడాది వచ్చిన బెస్ట్‌ ఫోన్స్‌ ఇవే..!

Mid range Best smartphones: ఈ ఏడాది చాలా ఫోన్లు మార్కెట్లో సందడి చేశాయి. అందులో మిడ్‌ రేంజ్‌లో కొన్ని ఫోన్లు ప్రధానాకర్షణగా నిలిచాయి.

Updated : 26 Dec 2023 19:57 IST

Best phones | ఈ ఏడాది దేశంలో చాలా ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రావడంతో దాదాపు అన్ని కంపెనీలూ ఈ సెగ్మెంట్‌లో మంచి మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు తీసుకొచ్చాయి. బడ్జెట్‌ ధరలో రెడ్‌మీ, రియల్‌మీ, మోటో వంటి కంపెనీలు ఫోన్లను తీసుకురాగా.. ప్రీమియం సెగ్మెంట్లో యాపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌ సంస్థలు పోటీ పడ్డాయి. ఇక మిడ్‌ రేంజ్‌ (రూ.20-40 వేల మధ్య) సెగ్మెంట్‌లో దాదాపు అన్ని కంపెనీలూ మెరుగైన పనితీరుతో స్మార్ట్‌ఫోన్లు తీసుకొచ్చాయి. ధర, కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ, పనితీరులో కొన్ని ఫోన్లు టెక్‌ ప్రియుల నుంచి ఎంతగానో ఆదరణ చూరగొన్నాయి. ఆ జాబితా ఇదీ..

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ: ఒకప్పుడు ప్రీమియం సెగ్మెంట్‌కే పరిమితైన వన్‌ప్లస్‌.. మిడ్‌ సెగ్మెంట్‌లో నార్డ్‌ సిరీస్‌లో ఫోన్లను తీసుకొచ్చింది. అలా ఈ కంపెనీ నుంచి రూ.30 వేల్లోపు వచ్చిన ఫోన్‌ వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ. ఆక్సిజన్‌ ఓఎస్‌, 50 ఎంపీ కెమెరా, వన్‌ప్లస్‌ బ్రాండ్‌ చాలా మందిని ఆకట్టుకున్నాయి.


మోటో ఎడ్జ్‌ 40: మోటోరొలా నుంచి వచ్చిన మెరుగైన ఫోన్లలో ఎడ్జ్‌ 40 ఒకటి. దీంట్లో పీఓల్‌ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు. 1200 నిట్స్‌, 3డీ కర్వ్‌డ్‌ డిజైన్‌, 144 Hz రిఫ్రెష్‌ రేటు, 92.7 శాతం స్క్రీన్‌ టు బాడీ రేషియో వంటి ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో హైలైట్‌. ఇదే సిరీస్‌లో వచ్చిన ఎడ్జ్‌ 40 నియో సైతం మెరుగైన ఫీచర్లతో వచ్చింది. 


పోకో ఎఫ్‌5: షావోమి సబ్‌బ్రాండ్‌ పోకో చాలా రోజుల తర్వాత మెరుగైన ఫీచర్లతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 7+ జనరేషన్‌ 2 ప్రాసెసర్‌ను అమర్చారు. పెర్ఫార్మెన్స్‌ విషయంలో ఈ ఫోన్‌ మెరుగైన రివ్యూలను సొంతం చేసుకుంది. లిక్విడ్‌ కూల్‌ టెక్నాలజీ 2.0, యాడ్‌ ఫ్రీ ఎంఐయూఐ ఇంటర్‌ఫేస్‌ ఈ ఫోన్‌కు ప్రధానాకర్షణ.


శాంసంగ్‌ ఎఫ్‌ 54: శాంసంగ్‌ ప్రియులను ఈ ఏడాది చాలా ఫోన్లు పలకరించాయి. అందులో తక్కువ ధరలో మెరుగైన సదుపాయాలతో వచ్చిన ఫోన్‌ శాంసంగ్‌ ఎఫ్‌ 54. బ్యాటరీ లైఫ్‌ను అధికంగా కోరుకునే వారి కోసం 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు. ఫొటోల కోసం 108 ఎంపీ కెమెరా ఉంది. దాదాపు ఇదే ఫీచర్లతో ఎం సిరీస్‌లో తీసుకొచ్చిన శాంసంగ్‌ ఎం 54 సైతం యూజర్లను ఆకట్టుకుంది. 


రెడ్‌మీ నోట్‌ 12ప్రో+5జీ: రెడ్‌మీ నోట్‌ సిరీస్‌లో ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్‌ ఫోన్‌ అంటే రెడ్‌మీ నోట్‌ 12ప్రో. 200 ఎంపీ కెమెరా, 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వచ్చిన ఈ ఫోన్‌ చాలా మందిని ఆకట్టుకుంది. రూ.20 వేల్లోపు 108 ఎంపీ కెమెరాతో వచ్చిన రెడ్‌మీ నోట్‌ 12 ప్రో సైతం విశేష ఆదరణ సొంతం చేసుకుంది.


ఐకూ నియో 7: వివో సబ్‌బ్రాండ్‌ ఐకూ ఈ ఏడాది నియో 7 పేరుతో తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్‌ గేమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 64 ఎంపీ OIS కెమెరాతో వచ్చిన ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌ను అమర్చారు. రూ.30వేల బడ్జెట్‌లో గేమర్స్‌ బెస్ట్‌ ఛాయిస్‌గా నిలిచింది. అలాగే, కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో వచ్చిన ఐకూ జడ్‌7 ప్రో సైతం టెక్ ప్రియులను ఆకట్టుకుంది.


వన్‌ప్లస్‌ 11ఆర్ 5జీ: వన్‌ప్లస్‌ బ్రాండ్‌ నుంచి వచ్చిన మెరుగైన ఫోన్లలో వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీ ఒకటి. కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో స్నాప్‌డ్రాగన్‌ 8+1 జనరేషన్‌తో వచ్చిన ఈ ఫోన్‌ యూజర్లను ఆకట్టుకుంది. 50ఎంపీ కెమెరానే అయినా మెరుగైన ఫొటోలు, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సూపర్‌ ఫ్లూయిడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ.


దేశీ బ్రాండ్‌ రీబౌండ్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా ఈ ఏడాది తీసుకొచ్చిన ‘అగ్ని 2’ 5జీ ఫోన్‌ మెరుగైన రివ్యూలను సొంతం చేసుకుంది. రూ.20 వేలకే 6.78 అమోలెడ్‌ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటు, 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వచ్చిన ఈ ఫోన్‌.. పండగ సేల్స్‌లో ప్రధాన కంపెనీల ఫోన్లకు గట్టి పోటీనిచ్చింది.


 

నథింగ్‌ 2: నథింగ్‌ 1తో మొబైల్‌ మార్కెట్లో తనదైన గుర్తింపును సొంతం చేసుకున్న నథింగ్‌ కంపెనీ నుంచి వచ్చిన రెండో ఫోన్‌ నథింగ్‌ 2. 50+50 ఎంపీ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్‌ 8+ జనరేషన్‌ 1 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌.. రొటీన్‌కు భిన్నంగా ఫోన్‌ కొనాలనుకునే వారికి ఒక ఆప్షన్‌గా మారింది. ప్రీమియం ఫీల్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ.


 

హానర్‌ 90: చాలా ఏళ్ల తర్వాత హానర్‌ 90తో హానర్‌ కంపెనీ భారత మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులోని 200 ఎంపీ కెమెరా, 50 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 1.5కె స్క్రీన్‌తో ఈ ఫోన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌, రెండేళ్ల ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ హామీతో వచ్చింది. మంచి ఫీచర్లతో వచ్చినా ధర రూ.30వేలు పైనే.

  • ఇక ప్రీమియం సెగ్మెంట్‌లో యాపిల్‌ సిరీస్‌లో వచ్చిన ఐఫోన్‌ 15, 15ప్రో మ్యాక్స్‌, వన్‌ప్లస్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ఓపెన్‌, పిక్సెల్‌ 8ప్రో, ఒప్పో ఎన్‌ 3 ఫ్లిప్‌, శాంసంగ్‌ జడ్‌ ఫోల్డ్‌ 5, ఫ్లిప్‌ 5, శాంసంగ్‌ ఎస్‌23 అల్ట్రా, ఎస్‌23, వన్‌ప్లస్‌ 115జీ యూజర్లను ఆకట్టుకున్నాయి.

నోట్‌: బ్రాండ్‌, ధర, కెమెరా, పనితీరు, రివ్యూలు, సేల్స్‌ సమయంలో ఆయా ఫోన్లకు వచ్చిన డిమాండ్‌ ఆధారంగా ఈ జాబితా రూపొందించడం జరిగింది. జాబితాలో ఫోన్ల వరుస క్రమం ఆయా ఫోన్ల ర్యాంకింగ్‌కు సూచిక కాదు. మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునేవారు ఆయా వెబ్‌సైట్లకు వెళ్లి ఫీచర్లను పరిశీలించగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని