Bill Gates: ‘పనికంటే జీవితం ఎంతో గొప్పది’ బిల్‌ గేట్స్‌

Bill Gates: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌ గేట్స్‌ సెలవుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారాంతపు సెలవులపై తనకున్న అభిప్రాయాన్ని తన బ్లాగ్‌ పోస్టులో పంచుకున్నారు.

Published : 25 Dec 2023 02:08 IST

Bill Gates | ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) వీకెండ్స్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థలో పనిచేసే తొలినాళ్లలో వారాంతాల్లో సెలవులు తీసుకోవడం, పనిచేయకుండా ఉండటం ఆయనకు నచ్చేది కాదని పేర్కొన్నారు. అయితే తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

‘నేను నా పిల్లల వయసులో ఉన్నప్పుడు సెలవులపై అంత ఆసక్తి ఉండేది కాదు. ముఖ్యంగా తండ్రిని అయ్యాక నా అభిప్రాయం మారింది. పని కంటే జీవితం విలువైందని గ్రహించా’ అంటూ బిల్‌ గేట్స్‌ తన బ్లాగ్‌ పోస్టు ద్వారా తెలిపారు. తన పిల్లల ఎదుగుదల చూడటం ఎందో ఆనందంగా ఉందన్నారు. గోల్‌కీపర్స్ ఈవెంట్‌లో చిన్న కుమార్తె ఫోబ్‌తో తాను వేదికను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాదిలో జరిగిన ముఖ్యాంశాలలో ఇది కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు.

పూర్వ విద్యార్థుల దాతృత్వం.. ‘ఐఐటీ బాంబే’కు రూ.57 కోట్లు అందజేత

పని- జీవిత సమతుల్యత గురించి ఈ ప్రపంచ కుబేరుడు మాట్లాడటం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో అరిజోనా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ‘జీవితాన్ని ఆస్వాదించటం కూడా మరచిపోయేలా కష్టపడొద్దు. పనికంటే జీవితం ఎంతో గొప్పది. ఈ విషయం తెలుసుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే మీరు అంత కాలం వేచి ఉండకండి. మీ బంధాలను బలపరుచుకోవడానికి, విజయాన్ని పంచుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత సమయం వెచ్చించండి’ అని ఆయన విద్యార్థులకు సూచించారు.

ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మాటలకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్న సమయంలో గేట్స్‌ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని