NPSలో ఇక పెన్షన్‌పై హామీ.. కేంద్రం కీలక నిర్ణయం?

NPSలో కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టబోతోంది. ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యాక నిర్దిష్ట మొత్తం పెన్షన్‌ రూపంలో అందేలా పథకంలో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 21 Jun 2023 19:26 IST

దిల్లీ: జాతీయ పింఛను పథకం (NPS)లో కీలక మార్పుల దిశగా నరేంద్ర మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. ఇకపై రిటైర్డ్‌ ఉద్యోగులకు నిర్దిష్ట మొత్తం పెన్షన్‌ అందేలా NPSలో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లో ఉన్న NPS విధానంలో నిర్దిష్ట పెన్షన్‌కు (Pension) ఎలాంటి హామీ లేదు. ఇప్పుడు ఉద్యోగి రిటైర్‌ అయ్యాక చివరి వేతనంలో 40 - 45 శాతం పెన్షన్‌గా అందుకునేలా NPSలో మార్పులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

పాత పెన్షన్‌ విధానంలో (OPS) ఉద్యోగి తన వంతుగా ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకసారి ఉద్యోగ విరమణ చేశాక చివరి నెల జీతంలో 50 శాతం మొత్తం ప్రతి నెలా పెన్షన్‌గా అందుకుంటారు. దీనివల్ల పెన్షన్‌ చెల్లింపులకే ప్రభుత్వాలు అధిక భాగం చెల్లించాల్సి వస్తోంది. అదే NPSలోనైతే ఉద్యోగి తన వాటాగా 10 శాతం చెల్లించాలి. ప్రభుత్వం తన వాటాగా 14 శాతం చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని డెట్‌, ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేస్తారు. అయితే, NPS కింద పెన్షన్‌ మొత్తానికి ఎలాంటి హామీ ఉండదు.

పెన్షన్‌ మొత్తానికి హామీ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఓపీఎస్‌ విధానం కోసం డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానానికి వెళ్తున్నట్లు ప్రకటించాయి. ఈ విధానం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతోంది. దీన్ని నివారించడంతోపాటు, దేశవ్యాప్తంగా పెన్షన్‌ విధానంలో ఏకరూపత తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తాజాగా నివేదిక సమర్పించింది. NPS చందాదారులు ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యాక ఆఖరి నెల జీతంలో 40 - 45 శాతం పెన్షన్‌గా వచ్చేలా హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం NPS వల్ల 38 శాతం పెన్షన్‌ అందుతోందని, ఒకవేళ 40 శాతం పెన్షన్‌కు హామీ ఇస్తే మిగిలిన 2 శాతం నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని ఓ అధికారి తెలిపారు. ఒకవేళ మార్కెట్‌ రిటర్నులు తగ్గితే ఆ మేర ప్రభుత్వం భారం మోయాల్సి ఉంటుందన్నారు. బడ్జెట్‌ పరంగా ఇదేమీ అంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదని పేర్కొన్నారు. ఓపీఎస్‌కు వెళ్లాలనుకుంటున్న రాష్ట్రాల ఆలోచనను విరమింపజేయడానికి ఇది ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోందని సంబంధిత అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని