Changes from Dec 1st: శ్రీవారి బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పు, నగదు విత్‌డ్రాకు ఓటీపీ.. రేపటి నుంచే..!

ఆర్థిక విషయాలకు సంబంధించి డిసెంబర్‌ 1 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి. నగదు విత్‌డ్రాకు ఓటీపీ, ద్విచక్ర వాహన ధరలు వంటివి అందులో ఉన్నాయి.

Updated : 30 Nov 2022 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకటో తేదీ వచ్చిదంటే చాలు.. రెంట్‌, కరెంట్‌ బిల్లు కట్టాలి. స్కూల్‌ ఫీజులు, పాల బిల్లులూ షరా మామూలే. జీతం అందిందన్న ఆనందాన్ని అందుకునేలోపే.. ‘మేమున్నాం’ అని ఇవన్నీ గుర్తుచేస్తుంటాయి. వీటికి తోడు ప్రతి నెలా కొత్తగా వచ్చే మార్పులు ‘ఫ్యామిలీ మ్యాన్‌’పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంటాయి. అలా డిసెంబర్‌ 1 నుంచి కొన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అందులో కొన్ని నేరుగా మన జేబును ప్రభావితం చేసేవైతే.. మరికొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అవేంటో చూసేయండి.. 

ఓటీపీ ఉండాల్సిందే..

ప్రభుత్వరంగ బ్యాంక్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) ఏటీఎంలో (ATM) క్యాష్‌ విత్‌డ్రా నిబంధనలు మార్చింది. డెబిట్‌ కార్డు వినియోగించి ఇకపై నగదు తీయాలంటే మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్‌ చేయాల్సిందే. మోసాల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకే ఈ మార్పులు చేసినట్లు తెలిపింది. కాబట్టి ఏటీఎంకు వెళ్లేవారు డెబిట్‌ కార్డుతో పాటు మొబైల్‌ను వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దు.

శ్రీవారి బ్రేక్‌ దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు తితిదే తెలిపింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్‌ దర్శనం చేసుకునే అవకాశం ఉంది.

హీరో మోటోకార్ప్‌

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌ తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ.1500 వరకు పెంచనుంది. కొత్త ధరలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. మోడల్‌, విక్రయించే ప్రాంతాన్ని బట్టి ధర పెంపు పరిమాణం మారొచ్చని పేర్కొంది. తయారీ వ్యయాల భారం అధికం కావడంతో, వాహన ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది.

డిజిటల్‌ రుపీ రేపటి నుంచే

రిటైల్‌ డిజిటల్‌ రూపాయి (ఇRs-ఆర్‌) ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1 నుంచి ప్రారంభించనున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. తొలుత 4 నగరాల్లో ప్రారంభించి, తదుపరి మరో 9 నగరాల్లో ఈ సేవలను విస్తరిస్తారు. ప్రస్తుతానికి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు ఈ లావాదేవీల్లో పాల్గొంటాయి. డిజిటల్‌ రూపాయిని టోకు విభాగంలో నవంబరు 1న ఆర్‌బీఐ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

బండ బరువు దిగేనా? పెరిగేనా?

కొన్ని నెలలుగా ఇంట్లో వాడే గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎటువంటి మార్పూ ఉండడం లేదు. నవంబర్‌లో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రూ.115 మేర తగ్గించాయి. డిసెంబర్‌ 1న మరోసారి రేట్లు సవరించనున్నాయి. ఈ సారైనా సిలిండర్‌ ధరను తగ్గిస్తారా? మళ్లీ పెంచుతారా? అనేది చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని