Jobs: ఉద్యోగం మారుతున్నారా? ఇవన్నీ చూశాకే ముందడుగు వేయండి..

కెరీర్‌ గ్రోత్‌ కోసం ఉద్యోగం మారడంలో తప్పు లేదు కానీ మారే సమయంలో ఏమైనా తప్పులు చేస్తే..అవి మీ కెరీర్‌కు ఆటకంగా మారవచ్చు. అందువల్ల రాజీనామా ప్రక్రియ సాఫీగా జరిగేలా చూసుకోవడం చాలా ముఖ్యం. 

Updated : 07 Nov 2022 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంతకు ముందు రోజుల్లో ఉద్యోగులు.. తమ ఉద్యోగ జీవితం మొత్తం ఒకటి, రెండు సంస్థలకే పరిమితం చేసేవారు. నేటి తరం అలా కాదు. కెరీర్‌ గ్రోత్‌ కోసం, నైపుణ్యాలు పెంచుకునేందుకు, సంపాదన పెంచుకునేందుకు.. ఇలా అనేక కారణాలతో తరచూ ఉద్యోగం మారుతున్నారు. మెరుగైన అవకాశం అనిపిస్తే చాలు.. మరో ఆలోచన లేకుండా ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థకు రాజీనామా చేసేస్తున్నారు. కెరీర్‌ గ్రోత్‌ కోసం ఉద్యోగం మారడంలో తప్పు లేదు కానీ మారే సమయంలో ఏమైనా తప్పులు చేస్తే.. అవి మీ కెరీర్‌కి ఆటంకంగా మారవచ్చు. అందువల్ల రాజీనామా చేసే ముందు నుంచి కొత్త ఉద్యోగంలో చేరే వరకు కూడా అన్నీ సాఫీగా జరిగేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్ఫర్మేషన్‌ లెటర్‌ వచ్చాకే..

కొంతమంది కొత్త సంస్థకు ఎంపిక అయ్యారని తెలిసిన వెంటనే పాత సంస్థకు రాజీనామా చేస్తారు. కానీ, ఇలా చేయడం మంచిది కాదు. ఏదైనా కారణంతో సంస్థ తమ నిర్ణయం మార్చుకుంటే మీరు చాలా ఇబ్బంది పడాల్సి రావచ్చు. అందువల్ల కొత్త కంపెనీ నుంచి కన్ఫర్మేషన్‌ (జాయినింగ్) లెటర్‌ వస్తే తప్ప, రాజీనామా చేయొద్దు. అప్పుడు కూడా మీ ఆఫర్‌ లెటర్‌ పూర్తిగా చదువుకుని.. ఆమోదించాలనుకున్నప్పుడు మాత్రమే రాజీనామా చేయాలి. 

సీటీసీ అర్థం చేసుకోవాలి..

చాలా మంది ఆఫర్‌ లెటర్‌లో సంస్థ పేర్కొన్న సీటీసీ (కాస్ట్‌ టు కంపెనీ) పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారు. ఇది మీ ప్రస్తుతం జీతం కంటే ఎక్కువని అనుకోవచ్చు. కానీ, నిజానికి చేతికి వచ్చే మొత్తం చాలా తక్కువగా ఉండవచ్చు. సీటీసీలో సంస్థ ఉద్యోగికి ఇచ్చే బేసిక్‌ వేతనం, డీఏ వంటి వాటితో పాటు ఈపీఎఫ్‌ వాటా, ఆరోగ్య బీమా కోసం చేసే ఖర్చు, బోనస్‌, ఇతర అలవెన్సు అన్నింటినీ కలిపి ఇస్తుంది. కాబట్టి సీటీసీ కింద పేర్కొన్న మొత్తం మీ చేతికి రాదని గుర్తుంచుకోండి. కొత్త సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించే ముందు చేతికి వచ్చే జీతం ఎంత? ఇంకా ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుంది? వంటివి ముందుగా తెలుసుకోవాలి. 

నోటీస్‌ పీరియడ్‌..

మీరు ఉద్యోగం మారాలనుకున్నప్పుడు ప్రస్తుతం పనిచేసే సంస్థకు విషయాన్ని తెలియజేస్తూ నోటీస్‌ ఇవ్వాలి. ఇది సంస్థను బట్టి మారుతుంది. కొన్ని సంస్థల్లో మూడు నెలల వరకు కూడా ఉండవచ్చు. మీ సంస్థ నియమ నిబంధనలను అనుసరించి నోటీస్‌ పీరియడ్‌ ఇవ్వండి. ఒక వేళ మీ స్థానంలో కొత్త ఉద్యోగిని తీసుకుంటే.. వారికి ట్రైనింగ్‌ ఇవ్వడం కోసం ఒకటి రెండు వారాలు నోటీస్ పీరియడ్‌ పెరగవచ్చు.

సంస్థకు రాజీనామా చేసాం కదా.. అని కొంతమంది, పై ఉద్యోగులకు తగిన విధంగా సమాధానం చెప్పకపోవడం, విధులకు సరిగ్గా హాజరు కాకపోవడం వంటివి చేస్తుంటారు. నోటీస్‌ పీరియడ్‌లో మీ ఈ ప్రవర్తన మీ కెరీర్‌కు మంచిది కాదు. పాత కంపెనీతో మంచి సంబంధాలను కలిగి ఉండడం ఎల్లప్పుడూ మంచిది. మీ బాధ్యతలను, ఇతర పత్రాలను మీ పైవారికి హ్యాండ్‌ఓవర్‌ చేసినట్లు లెటర్‌ సిద్ధం చేసుకోండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో సంస్థను వీడండి.

బ్యాంకు ఖాతా..

సంస్థ మీకు చెల్లించే జీతాన్ని బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది. ఇందుకోసం ఉద్యోగంలో చేరినప్పుడే మీ పేరుపై శాలరీ అకౌంట్‌ ఇస్తారు. ఒకవేళ మీ పేరుపై కంపెనీ ఖాతాను తెరిచి ఉంటే దీన్ని మూసివేయమని సంస్థ మిమ్మల్ని కోరవచ్చు. ఒకవేళ మీరు చేరబోయే కొత్త సంస్థలో కూడా అదే బ్యాంకులో జీతాలు జమచేస్తుంటే.. అదే ఖాతా ఉపయోగించుకునేలా హెచ్‌ఆర్‌తో మాట్లాడవచ్చు. ఒకవేళ కొత్త సంస్థ వేరే బ్యాంకులో జీతం ఖాతాలను నిర్వహిస్తుంటే పాత ఖాతాను మూసివేయడం మంచిది.

ఈపీఎఫ్‌..

మీ ప్రస్తుత సంస్థ ఈపీఎఫ్‌ పరిధిలోకి వస్తే, ఉద్యోగం మారినప్పుడు కూడా అదే ఈపీఎఫ్‌ ఖాతాను కొనసాగించవచ్చు. ఉద్యోగం మారుతున్నప్పుడు ఈపీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడం మంచిది కాదు. కొనసాగించడం వల్ల భవిష్యత్‌లో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్త సంస్థకు మీ పీఎఫ్ ఖాతా వివరాలను అందించి కొనసాగించవచ్చు.

అవసరమైన పత్రాలను తీసుకోండి..

సంస్థను వీడేటప్పుడు.. రిలీవింగ్‌ లెటర్‌, అనుభవ ధ్రువీకరణ పత్రం, గత కొన్ని నెలల పేస్లిప్‌లు, ఫారం 16 వంటి అన్ని పత్రాలను తీసుకుని ఫైల్‌ చేసుకోండి. ఇవన్నీ మీ కొత్త సంస్థకు సబ్మిట్‌ చేయాల్సి రావచ్చు. కొన్ని సంస్థలు ఫారం 16.. మే, జూన్‌ నెలల్లో అందిస్తాయి. ఒకవేళ ఫారం 16 ఇవ్వకపోయినా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌ ద్వారా ఫారం 26ఏఎస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని టీడీఎస్‌ను ధ్రువీకరించుకోవచ్చు. కొత్త సంస్థలో చేరేటప్పుడు ఫారం 16 లేకపోయినా మునుపటి పేస్లిప్‌లను మినహాయింపు రుజువులుగా అంగీకరిస్తారు. 

పన్నులను అర్థం చేసుకోండి..

సాధారణంగా జీతంలో పెరుగుదల కోసమే ఉద్యోగం మారుతుంటారు. అయితే జీతంలో పెరుగుదల వల్ల మీరు అధిక పన్ను స్లాబ్‌లోకి వెళ్లొచ్చు. అందవల్ల జీతం పెరగడం వల్ల ఎంత పన్ను అధికంగా చెల్లించాల్సి వస్తుందో లెక్కించండి. అందుకు అనుగుణంగా పన్ను ఆదా చేసేందుకు ప్లాన్‌ చేయండి. 

పొదుపు, మదుపులను మానొద్దు..

ప్రస్తుతం మీరు మీ జీతంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తూ, పెట్టుబడులు పెడుతుంటే వాటిని కొనసాగించండి. పెరిగిన జీతంతో ఖర్చులు పెరగకుండా పొదుపు పెరిగేలా చేసుకోండి. మీరు ప్రస్తుతం మీ జీతంలో 30% వరకు పొదుపు చేస్తుంటే.. కొత్త జీతం వచ్చన తర్వాత ఆస్థాయికి తగ్గకుండా పొదుపు చేసేందుకు ప్రయత్నించండి. ఉదాహరణకు మీ చేతికి వచ్చే ప్రస్తుత జీతం రూ. 40,000, కొత్త జీతం రూ.50,000 అనుకుందాం. ప్రస్తుత జీతంలో 30%, అంటే నెలకు రూ.12,000 పొదుపు చేస్తుంటే, కొత్త జీతం రూ. 50,000 వేలలో 30%, అంటే రూ.15,000కు తగ్గకుండా పొదుపు చేయాలి.

చివరిగా: ఉద్యోగం మారే ముందు కొత్త సంస్థ అందించే జీతం మాత్రమే కాకుండా భవిష్యత్‌ అవకాశాలు, పని ఒత్తిడి, సౌకర్యాలు వంటి వాటిని పరిశీలించాకే నిర్ణయం తీసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని