Mercedes-Benz: మెర్సిడెజ్‌ బెంజ్‌ కార్లకు చాట్‌జీపీటీ సపోర్ట్

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌ (Mercedes-Benz) ఆధునిక సర్వీస్‌ను వినియోగదారులకు పరిచయం చేయనుంది. దీంతో యూజర్లకు సరికొత్త డ్రైవింగ్‌ అనుభూతిని పొందుతారని కంపెనీ తెలిపింది.

Published : 17 Jun 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్లకు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని అందిచాలని ఆటోమొబైల్‌ (Automobile) సంస్థలు భావిస్తుంటాయి. ఇందుకోసం ఎప్పటికప్పుడు కొత్త కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తాయి. వాటిలో ఇన్ఫోటైన్‌మెంట్, డ్రైవర్‌ అసిస్ట్‌ వంటి ఆధునిక ఫీచర్లను పరిచయం చేస్తుంటాయి. తాజాగా జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ (Mercedes-Bnez) మరో ఆధునిక ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.

మెర్సిడెజ్‌ కార్లలో ఉండే మెర్సిడెజ్‌ బెంజ్‌ యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ (MBUX) వాయిస్‌ అసిస్టెంట్‌లో చాట్‌జీపీటీ (ChatGPT) సేవలను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో వినియోగదారులు డ్రైవింగ్‌ చేస్తూనే చాట్‌జీపీటీతో సంభాషిస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ (Microsoft)కు చెందిన అజ్యూర్‌ (Azure) ఏఐ సర్వీసుల ద్వారా చాట్‌జీపీటీ సేవలను మెర్సిడెజ్‌ బెంజ్‌ అందించనుంది. దీంతో ప్రయాణికులు వాతావరణం, ఆటలకు సంబంధించిన సమాచారంతోపాటు చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది చాట్‌జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా రెస్టారెంట్‌లు, సినిమా టికెట్లనూ బుక్‌ చేసుకోవచ్చు.

ఎమ్‌బీయూఎక్స్‌లో చాట్‌జీపీటీని పరిచయం చేయడం ద్వారా ఇకపై వాయిస్‌ అసిస్టెంట్‌లా కమాండ్‌లను స్వీకరించడమే కాకుండా సంభాషణలు కూడా జరుపుతుందని మెర్సిడెజ్‌ అభిప్రాయపడింది. చాట్‌జీపీటీ సేవలను ముందుగా బీటా ప్రోగ్రామ్‌ కింద జూన్‌ 16నుంచి అమెరికాలో ఎమ్‌బీయూఎక్స్‌ కలిగిన 9 లక్షల వాహనాల్లో పరీక్షించనుంది. ఆసక్తిగల వినియోగదారులు ‘హేయ్‌.. మెర్సిడెజ్‌.. ఐ వాంట్‌ టు జాయిన్‌ ది బీటా ప్రోగ్రామ్‌’ అని చెప్పడం ద్వారా చాట్‌జీపీటీ సేవలను పొందొచ్చని కంపెనీ తెలిపింది. పరీక్షల అనంతరం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని