Disney India: రిలయన్స్‌ చేతికే డిస్నీ.. త్వరలో అధికారిక ప్రకటన?

Disney- Reliance: డిస్నీ ఇండియా వ్యాపారం రిలయన్స్‌ చేతికి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Updated : 24 Oct 2023 04:25 IST

Disney- Reliance | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ డిస్నీ.. తన ఇండియా వ్యాపార విక్రయ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా ఆసక్తి-స్థోమత కలిగిన పలువురు పెట్టుబడిదార్లతో ఆ సంస్థ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో రిలయన్స్‌ సహా అదానీ గ్రూప్‌, సన్‌టీవీతోనూ చర్చలు జరిపింది. అయితే, డిస్నీ వ్యాపారాన్ని ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కొనుగోలు చేయబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  త్వరలో ఈ లావాదేవీ జరిగే అవకాశం ఉందని ‘బ్లూమ్‌బెర్గ్‌’ పేర్కొంది. 

డిస్నీ స్టార్‌ వ్యాపారంలో నియంత్రిత వాటాను రిలయన్స్‌కు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 బిలియన్‌ డాలర్లకు విక్రయించాలని డిస్నీ భావిస్తుండగా.. రిలయన్స్‌ 7, 8 బిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు సుముఖంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. రిలయన్స్‌ మీడియా యూనిట్లు సైతం ఇందులో విలీనం అయ్యే అవకాశం ఉందని తెలిపాయి. కొంత నగదు, షేర్ల బదిలీ రూపంలో ఈ డీల్‌ జరిగే అవకాశం ఉందని సమాచారం.

రూ.15 వేల పెట్టుబడి.. రూ.1.2 కోట్ల ఆర్జన.. చాట్‌జీపీటీ సాయంతో!

విలీనం అనంతరం కూడా డిస్నీ ఇండియాకు మైనారిటీ వాటా ఉంటుందని సమాచారం. అయితే, ఈ డీల్ విలువ విషయంలో తుది నిర్ణయం ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. దీనిపై డిస్నీ స్పందించకపోగా.. రిలయన్స్‌ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. భారత్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌18 మీడియా దక్కించుకోవడంతో డిస్నీ+ హాట్‌స్టార్‌కు ఇటీవల చందాదారులు భారీగా తగ్గారు. దీనికి తోడు హెచ్‌బీఓ కంటెంట్‌ను సైతం రిలయన్స్‌ దక్కించుకోవడంతో మరో గట్టి దెబ్బ తగిలింది. దీంతో డిస్నీస్టార్‌ నంబర్లను పెంచుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే విక్రయానికి ముందుకు రావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని