Grok: చాట్‌జీపీటీని మించిన ఎలాన్‌ మస్క్‌ ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’!

Grok: చాట్‌జీపీటీ రాకతో ప్రపంచవ్యాప్తంగా ఏఐ చాట్‌బాట్‌లపై పరిశోధన, వాటి అభివృద్ధి ప్రారంభమైంది. ఇప్పటికే పలు సంస్థలు తమ చాట్‌బాట్‌లను విడుదల చేశాయి. తాజాగా ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ఎక్స్‌ఏఐ సైతం ఓ చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. ఇది ఇతర వాటి కంటే మెరుగైన ఫలితాలిస్తోందని కంపెనీ తెలిపింది.

Published : 05 Nov 2023 17:34 IST

వాషింగ్టన్‌: బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని కృత్రిమ మేధ (AI) అంకుర సంస్థ ‘ఎక్స్‌ఏఐ (xAI)’ తమ ఏఐ చాట్‌బాట్‌ను విడుదల చేసింది. ‘గ్రోక్‌’ (Grok) పేరిట తీసుకొచ్చిన ఇది.. ఇప్పటికే అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ (chatGPT) తరహా ఏఐ చాట్‌బాట్‌ల కంటే మెరుగ్గా పనిచేస్తోందని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఓపెన్‌ఏఐ విడుదల చేసిన చాట్‌జీపీటీ.. ఏఐపై ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఎక్స్‌ఏఐ (xAI)ను స్థాపించిన ఎనిమిది నెలలలోపే చాట్‌బాట్‌ను తీసుకురావడం గమనార్హం.

పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యంతో కూడిన ఏఐ టూల్స్‌ను మావవాళికి సాయంగా అందించాలనే లక్ష్యంతోనే గ్రోక్‌ (Grok)ను అభివృద్ధి చేసినట్లు ఎక్స్‌ఏఐ (xAI) తెలిపింది. ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌) ప్లాట్‌ఫామ్‌ సాయంతో గ్రోక్‌ తాజా సమాచారాన్ని సైతం అందిస్తుందని పేర్కొంది. ఇదే ఇతర వాటితో పోలిస్తే తమ చాట్‌బాట్‌కు ఉన్న ప్రత్యేకతని వివరించింది. ఇతర ఏఐ వ్యవస్థలు తిరస్కరించే కొన్ని తరహా ప్రశ్నలకు సైతం గ్రోక్‌ సమాధానం చెప్పగలదని మస్క్‌ తెలిపారు. మ్యాథ్స్‌, కోడింగ్‌ వంటి అకాడమిక్‌ పరీక్షల్లో చాట్‌జీపీటీ3.5 కంటే కూడా మెరుగైన ఫలితాలనిచ్చిందని ఎక్స్‌ఏఐ ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే, ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన అత్యాధునిక చాట్‌బాట్‌ వెర్షన్‌ జీపీటీ-4ను మాత్రం గ్రోక్‌ (Grok) అధిగమించలేకపోయిందని సమాచారం.

గ్రోక్‌ (Grok)ను ‘ఎక్స్‌ ప్రీమియం ప్లస్‌’ యూజర్లు యాక్సెస్‌ చేసుకోవచ్చని మస్క్‌ తెలిపారు. ప్రస్తుతం దీన్ని అమెరికాలో పరిమిత సంఖ్యలో యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని.. రాబోయే రోజుల్లో మరింత మెరుగుపర్చి విస్తృత స్థాయిలో విడుదల చేస్తామని తెలిపారు. ఎక్స్‌ ప్రీమియం ప్లస్‌ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీ ప్రస్తుతం 16 డాలర్లుగా ఉంది. మరోవైపు ఏఐ బాట్‌ను దుర్వినియోగం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎక్స్‌ఏఐ (xAI) పేర్కొనింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని