ICICI Loan case: జ్యుడీషియల్‌ కస్టడీకి చందా కొచ్చర్‌ దంపతులు

Loan fraud case: రుణ వ్యవహారంలో అరెస్టయిన చందాకొచ్చర్‌ దంపతులను 14 రోజుల జుడీషియల్‌ కస్టడీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తరలించింది.

Published : 29 Dec 2022 23:41 IST

ముంబయి: వీడియోకాన్‌ గ్రూప్‌ కంపెనీలకు రుణ మంజూరు వ్యవహారంలో అరెస్టయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI bank) మాజీ సీఈఓ చందాకొచ్చర్‌ (Chanda Kochhar), ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జుడీషియల్‌ కస్టడీకి తరలించింది. జనవరి 10 వరకు 14 రోజుల జుడీషియల్‌ కస్టడీకి తరలిస్తూ న్యాయస్థానం గురువారం ఆదేశాలు ఇచ్చింది. కొచ్చర్‌ దంపతులను గత శుక్రవారం అరెస్ట్‌ చేయగా.. ధూత్‌ను సోమవారం సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరి కస్టడీ నేటితో ముగిసిన నేపథ్యంలో గురువారం మరోసారి ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. సీబీఐ తరఫు న్యాయవాది ఎలాంటి కస్టడీ కోరకపోవడంతో కోర్టు ముగ్గురినీ జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రూ.3,250 కోట్ల రుణాన్ని వీడియోకాన్‌ గ్రూపు పొందిన తర్వాత.. అందులో కోట్లాది రూపాయలను దీపక్‌ కొచ్చర్‌ నిర్వహించే న్యూపవర్‌లో, వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ పెట్టుబడులుగా పెట్టినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కేసులో చందా కొచ్చర్‌ దంపతులు మోసం, అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. ఐపీసీ, మనీ లాండరింగ్‌ నియంత్రణ చట్టం నిబంధనల కింద చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌తో పాటు వీడియోకాన్‌ గ్రూపునకు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌, న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌, సుప్రీమ్‌ ఎనర్జీ, వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌లపై ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని