ITR Filing: గడువులోగా ఐటీఆర్‌ ఫైల్‌ చేయండి.. ఈ ప్రయోజనాలు పొందండి!

ITR Filing: సకాలంలో ఐటీఆర్‌ దాఖలు చేస్తే ఉన్న ప్రయోజనాలేంటో చూద్దాం....

Published : 12 Jul 2022 12:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు (HUF) ఈ నెలాఖరులోగా ఆదాయ పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయాలి. కంపెనీలు, సంస్థల్లో పనిచేసే భాగస్వాముల వంటి పన్ను చెల్లింపుదారుల ఆదాయపు ఖాతాలను ఆడిట్‌ చేయాల్సి ఉంటుంది గనక వారికి అక్టోబరు 31 వరకు గడువు ఉంది. గడువులోపు ఐటీఆర్‌ ఫైల్‌ (ITR Filing) చేస్తే ఎలాంటి జరిమానాలు, న్యాయపరమైన చిక్కులు ఉండవు. సకాలంలో ఐటీఆర్‌ దాఖలు చేస్తే ఉన్న ప్రయోజనాలేంటో చూద్దాం..

నష్టాల బదిలీ: కొన్ని రకాల పెట్టుబడులపై నష్టాలు వాటిల్లితే వాటిని వచ్చే ఏడాది సమర్పించబోయే ఐటీఆర్‌ (ITR)లో చూపించేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా పన్ను ప్రయోజనాలు పొంది కొంత ఆదా చేసుకోవచ్చు. అయితే, గడువులోగా ఐటీఆర్‌ దాఖలు చేసిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది.

న్యాయపరమైన చిక్కులకు దూరం: ఒకవేళ గడువులోగా ఐటీఆర్‌ దాఖలు చేయలేకపోతే ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు అందే అవకాశం ఉంది. వారిచ్చిన గడువులోగా సమాధానం ఇవ్వకపోతే మరో ఇబ్బంది. ఒకవేళ మీరిచ్చిన వివరణతో వారు సంతృప్తి చెందకపోతే న్యాయపరమైన చిక్కుల్లో పడ్డట్లే. వారు మిమ్మల్ని, మీ లావాదేవీలను అనుమానిత జాబితాలో ఉంచి తగు చర్యలు తీసుకునే అవకాశమూ లేకపోలేదు.

(ఇదీ చదవండి: ఐటీ రిటర్నులు ఫైల్‌ చేస్తున్నారా? ఏ ఫారం ఎవరికో తెలుసా?)

త్వరగా రుణ మంజూరు: రుణ మంజూరుకు బ్యాంకుల్లో అనేక పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అందులో ఐటీఆర్‌ ఒకటి. గడువులోగా రిటర్నులు ఫైల్‌ చేస్తే వాటిని ఎక్కడైనా చూపించి రుణం పొందొచ్చు. ఒకవేళ ఆలస్యమైతే.. బ్యాంకులు సైతం మీ రుణ చరిత్రపై అనుమానం వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు. పైగా పెద్ద మొత్తంలో రుణం పొందాలంటే ఐటీఆర్‌ లేనిదే బ్యాంకుల్లో పనికాదు.

రూ.10 వేల జరిమానా ఉండదు: గడువులోగా ఐటీఆర్‌ దాఖలు చేయనివారికి ఆదాయ పన్ను విభాగం రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మరోవైపు సెక్షన్‌ 234ఏ కింద చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా వసూలు చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని